close

వార్తలు / కథనాలు

‘జమిలి’ సాధ్యమేనా?

ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం: ఒకే దేశం- ఒకే ఎన్నిక విధానంపై  కేంద్రం 21 రాజకీయపక్షాలతో సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. బుధవారం ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో జమిలి ఎన్నికలపై సమావేశం జరిగింది. అయితే దీనికి ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, తృణమూల్‌కాంగ్రెస్‌, తెదేపా, శివసేన, జేడీఎస్‌, డీఎంకే, ఎస్‌పీ, బీఎస్పీ.. తదితర పక్షాలు గైర్హాజరు కావడం గమనార్హం. సీపీఎం, సీపీఐ, మజ్లిస్‌... తదితర పక్షాలు ఏకకాలంలో ఎన్నికల నిర్వహణపై  సందేహాలు వ్యక్తం చేశాయి. దీంతో అన్ని రాజకీయపక్షాల అభిప్రాయాలు తెలుసుకునేందుకు కమిటీ వేయాలని నిర్ణయించినట్టు ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. ఏకకాలంలో లోక్‌సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించడంపై సానుకూలత వ్యక్తమవుతున్నప్పటికీ.. కార్యాచరణలో కష్టసాధ్యమని అనేకమంది భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏకకాల ఎన్నికలపై లాభనష్టాలు తెలుసుకుందాం..

మొదట్లో జమిలి ఎన్నికలే..
1952, 1957,1962,1967 వరకు సార్వత్రిక ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేవారు. 1967లో ఇందిరాగాంధీ సారథ్యంలోని కాంగ్రెస్‌ తిరిగి అధికారంలోకి వచ్చింది. అయితే పార్టీలో చీలిక ఏర్పడటంతో ఇందిరాగాంధీ సభను రద్దుచేసి 1971లో ఎన్నికలకు వెళ్లారు. దీంతో  తొలిసారిగా ఏకకాల ఎన్నికల నిర్వహణ ఆగిపోయింది. ఆ తర్వాతి కాలంలో దేశంలో పలు రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. 1977లో జనతాపార్టీ అధికారంలోకి రావడం, 1984లో ఇందిరాగాంధీ హత్యకు గురికావడం.. తదితర ఘటనలు దేశంపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. 1989 నుంచి దేశంలో సంకీర్ణ రాజకీయాల శకం ప్రారంభమైంది. 

సమయం ఆదా..
ఏకకాలంలో ఎన్నికల నిర్వహణతో సమయం ఆదా అవుతుంది. ప్రతి ఏటా ఎన్నికల సంఘం గడువు ముగిసిన లేదా అర్థాంతరంగా రద్ధైన అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహిస్తోంది. ఫలితంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉండటంతో పలు ప్రభుత్వ పథకాల అమలుకు ఆటంకం కలుగుతోంది.

ఓటింగ్‌ శాతం పెరిగే అవకాశం
రెండు ఎన్నికలు ఒకే సారి రావడంతో ఓటింగ్‌ శాతం పెరిగే అవకాశముంది. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో కొన్ని చోట్ల ఓటింగ్‌శాతం పెరగడం, మరి కొన్ని  ప్రాంతాల్లో తగ్గడం గమనిస్తున్నాం.

లా కమిషన్‌సూచనలు
1999లో లా కమిషన్‌కు నేతృత్వం వహించిన జస్టిస్‌ జీవన్‌రెడ్డి  కమిటీ జమిలి ఎన్నికలు నిర్వహించాలని సూచించింది.  అదే విధంగా 2002లో రాజ్యాంగ నిర్వహణతీరుపై సమీక్షకు  నియమితమైన కమిటీ సైతం రాజ్యాంగ మౌలిక స్వరూపానికి భంగం కలగకుండా ఏక కాలంలో ఎన్నికలు నిర్వహించాలని సలహా ఇచ్చింది. ఏటా అనేక ఎన్నికలు జరుగుతున్న అంశాన్ని నీతిఆయోగ్‌ కూడా ప్రస్తావించింది.

ప్రతికూలతలు..
జమిలి ఎన్నికలపై పలువురు ప్రతికూలత వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ జమిలి ఎన్నికలను నిర్వహించిన కొన్ని రాష్ట్రాల్లో లేదా కేంద్రంలో ప్రభుత్వాలు కూలిపోతే మళ్లీ ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఏర్పడుతుంది. దీంతో ఈ ప్రక్రియ మళ్లీ మొదటికే వస్తుందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

జాతీయ పక్షాలకు అనుకూలం
ఏకకాలంలో ఎన్నికల నిర్వహణతో  ప్రచారంలో జాతీయ అంశాలు కీలకంగా మారే అవకాశముంది. దీంతో జాతీయ రాజకీయపక్షాలు ఆధిపత్యం ప్రదర్శించే అవకాశముందని ప్రాంతీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

356 అధికరణం
కేంద్రం చేతిలో 356 అధికరణముంది. రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను రద్దుచేసి రాష్ట్రపతి పాలనను విధించే సౌలభ్యం ఈ అధికరణం ద్వారా ఉంది. దీనిపై కూడా కేంద్రం అధ్యయనం చేయాలని పలు రాజకీయపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

ఎన్నికల నిర్వహణ ఎలా..
లోక్‌సభకు అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికల నిర్వహణకు ఈసీ భారీ కసరత్తు చేయాల్సి వుంటుంది. ఈవీఎంలను భారీస్థాయిలో సమకూర్చుకోవాలి. అలాగే సాయుధబలగాలను భారీస్థాయిలో మొహరించాల్సిన అవసరముంది.
జమిలి ఎన్నికలపై రాజకీయపక్షాలతో పాటు మేధావులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వీటిని నివృత్తి చేస్తే జమిలి ఎన్నికలకు ఆటంకం ఉండబోదని ఆశిద్దాం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు