close

వార్తలు / కథనాలు

పాపా.. కమాన్‌ పాపా

‘ఇంత పెద్ద ప్రపంచంలో ఈ రోజు దాకా నన్ను జడ్జ్‌ చేయంది నా కొడుకొక్కడే. వాడి దృష్టిలో నేను కొంచెం తగ్గినా తట్టుకోలేను’ అని జెర్సీ ట్రైలర్‌లో నాని చెప్పిన మాటలు విన్నాం. తండ్రికి పిల్లలకు మధ్య ఉన్న ప్రేమ, క్రికెట్‌కు సంబంధం గురించి తెరపైనే కాదు.. నిజ జీవితంలోనూ మనం చూస్తుంటాం. ఐపీఎల్‌లో ఇలాంటి సన్నివేశాలు ఇప్పటివరకు ఎన్నో జరిగాయి. ఈ సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ విజయాలతో అదరగొడుతూ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. డాడీస్‌ ఆర్మీగా పేరున్న ఈ జట్టు సభ్యులు సమయం దొరికినప్పుడల్లా పిల్లలతో గడుపుతుంటారు. ధోని, తాహిర్‌, వాట్సన్‌, రైనా పిల్లలు ఆడియన్స్‌ గ్యాలరీలో కూర్చొని మరీ.. వారి తండ్రులకు మద్దతిస్తూ క్రికెట్‌ను ఆస్వాదిస్తుంటారు. 

ధోని కూతురు జీవా చేసే అల్లరి ఎప్పుడూ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంటుంది. దిల్లీ క్యాపిటల్స్‌తో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తలపడుతున్న సమయంలో ధోనిని జీవా ప్రోత్సహించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ‘పాపా.. కమాన్ పాపా‌’ అంటూ పిలుస్తూ తన తండ్రిని ఉత్సాహపరచడానికి ప్రయత్నించింది. 

సురేశ్‌ రైనా కూతురు గ్రాసియకు వాళ్ల నాన్న ఆట చూడటమంటే ఎంతో ఇష్టమట. మైదానంలో తన తండ్రి ఆటను ఆస్వాదిస్తూ ఇలా కెమెరా కంటికి చిక్కింది.

కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌పై చెన్నై గెలిచిన తర్వాత డాడీస్‌ ఆర్మీ తమ పిల్లలతో మైదానంలో కొద్దిసేపు గడిపింది. తాహిర్‌, షేన్‌ వాట్సన్‌ కుమారులకు సరదాగా పరుగు పందెం పెట్టారు. వాట్సన్‌ కుమారుడు విలియమ్‌ నెగ్గగా, తాహిర్‌ కొడుకు గిబ్రన్‌ ఓడిపోతాడు. ఇంతలో ధోని వచ్చి మళ్లీ పరుగు పందెంకి ఆహ్వానిస్తాడు. గిబ్రన్‌ను చేతుల్లో ఎత్తుకొని ధోని పరుగును ముగిస్తాడు.

జూనియర్‌ పరాశక్తి గిబ్రన్‌ పుట్టినరోజు వేడుకల్ని చెన్నై జట్టు డ్రెస్సింగ్‌ రూమ్‌లో చేసింది. గిబ్రన్‌ సిగ్గుపడుతుంటే రైనా, ధోని అతనిని కవ్వించడానికి ప్రయత్నించారు. 

ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లో రిషబ్‌ పంత్‌ను టిమ్‌ పైన్‌.. బేబీ సిట్టర్‌ అని స్లెడ్జింగ్‌ చేసిన విషయం తెలిసిందే. తర్వాత టిమ్‌ పైన్‌ పిల్లల్ని ముద్దాడిన పంత్‌ ఫొటో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసింది. ఇప్పుడు తాజాగా ఐపీఎల్‌లో ధావన్‌ కొడుకు జొరావర్‌తో పంత్‌ సరదాగా గడిపిన వీడియో వైరల్‌ అవుతోంది. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌పై దిల్లీ క్యాపిటల్స్‌ విజయం సాధించిన తర్వాత గ్రౌండ్‌లో జొరావర్‌ను గాల్లో తిప్పుతూ పంత్‌ సందడి చేశాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు