
వార్తలు / కథనాలు
చిత్రాలు: వారి ఫేస్బుక్ అధికారిక ఖాతా నుంచి..
పుట్టుకతోనే అంధుడు కానీ, సంకల్పం ముందు అంధత్వం ఓడి ఐఏఎస్ అయినవారొకరు..
చూపులేకపోయినా ఇతరుల చూపును ఆకర్శిస్తూ ఉత్తమ ఫొటోగ్రాఫర్‌గా గుర్తింపు పొందినవారు మరొకరు..
కనిపించకపోయినా తన ఆలోచనా పరిజ్ఞానంతో ప్రముఖ కంపెనీకి సీఈఓ బాధ్యతలు చేపట్టినవారు ఇంకొకరు. ..ఇలా ఆలోచనలకు అంధత్వం అడ్డు రాదని నిరూపించిన వారు ఎందరో.. తమ ఆలోచనలకు కార్యరూపం దాల్చి నిలిచి గెలిచినవారెందరో.. చేయాల్సింది ప్రయత్నం మాత్రమే.. అలా ప్రయత్నంతో మొదలెట్టి ఇప్పుడు ఎంతో మంది చూపులేనివారికి వెలుగై నిలిచింది బెంగళూరుకు చెందిన మధు సింఘాల్. చూపులేని వారు పడే ఇబ్బందులు తనకు బాగా తెలుసు. ఎందుకంటే తనూ అంధురాలే. కళ్లులేవనే కారణంతో చదువు, ఉద్యోగం, ఉపాధి ఇలా అన్నీ కోల్పోయి ఇంటికే పరిమితమవుతున్న వారెందరో.. వారికి వారిలోని సామర్థ్యాన్ని గుర్తు చేసి, జీవితంలో ఎదిగేందుకు చూపు అక్కర్లేదు, సాధించాలనే దృఢమైన సంకల్పం ఉంటే చాలు వ్యక్తిగతంగా ఎదగొచ్చు, అవకాశాలు సృష్టించుకోవచ్చు. అని వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపడమే తన పని. అందుకే మిత్ర జ్యోతి అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించింది. గత 30ఏళ్లుగా ఈ సంస్థ ద్వారా ఏంతో మంది కళ్లులేనివారికి సంకల్ప బలముందని గుర్తుచేసింది. వారికి తోడై నిలుస్తోంది.
వెలుగునిస్తోంది..
హరియాణాలో జన్మించిన మధు క్లాసికల్ మ్యూజిక్‌లో ఉన్నత విద్యని అభ్యసించింది. సంగీతంలో అధ్యాపకురాలిగా స్థిరపడాలనుకుంది. కానీ తనలా చూపులేని వారికి తను చేయాల్సింది ఎంతో ఉందని విధి ఆమెను బెంగళూరు పంపింది. అక్కడ తన సోదరితో కలిసి అంధులు పడుతున్న ఇబ్బందులను తెలుసుకుంది. ఇక ఎలాగైనా చూపులేని తనలాంటి వారికి వెలుగై నిలవాలని నిర్ణయించుకుంది. 90లలో అంధులు చదువుకోవడం అంటే అంత సులభం కాదు. వారికంటూ ప్రత్యేక పుస్తకాలూ ఉండేవికావు. పాఠశాలల్లోనూ బ్రెయిలీ లిపికి అంతగా ప్రాముఖ్యం ఉండకపోయేది. ఈ ఇబ్బందులతో చదువును మధ్యలోనే మానేసిన వారెందరో.. కాస్తో కూస్తో ఆసక్తి కొద్ది చదువుకున్న వారికి ఒక్క టెలిఫోన్ ఆపరేటర్ తప్ప ఏ ఉద్యోగమూ లభించేది కాదు. మరి దీనికి పరిష్కారం..? అది కనుగొనే వేటలో పడింది మధు. ఫలితం మిత్ర జ్యోతి. ఈ సంస్థ ద్వారా దృష్టి లోపం ఉన్న ఎంతో మందికి చదువు, ఉద్యోగం, ఉపాధి అవకాశాలను కల్పిస్తొంది.
ప్రారంభం ఇలా..
మొదట్లో మిత్రుల సహాయంతో ఓ చిన్న గ్యారేజీని సంస్థకి వేదికగా మార్చుకుని కొంత మందితో కలిసి ఓ పెద్ద టేప్‌రికార్డర్ సహాయంతో ఆడియో పాఠ్యాంశాలను రికార్డు చేసింది. అవసరమున్న వారికి ఆ ఆడియో క్యాసెట్లను ఇచ్చేవారు. కొంత కాలానికి సీడీల రూపంలో అందుబాటులోకి తెచ్చారు. తదుపరి టెక్నాలజీ అభివృద్ధితో రికార్డింగ్ డివైజ్‌లు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా పాఠ్యాంశాలు, ఇతర పుస్తకాలను ఆడియోలుగా మార్చి అందుబాటులో ఉంచుతున్నారు. అలా చిన్న గ్యారేజీగా ఏర్పాటైన ఈ సంస్థ ఇప్పుడు అధునాతన గ్రంథాలయంగా మారింది.
అందుబాటులో ఇవి..
కేవలం చదువే కాదు, అంధులకోసం అనేక కార్యక్రమాలు నడుపుతోంది మధు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకునే విభిన్న రంగాల్లో శిక్షణనిస్తోంది. దేశవిదేశాలనుంచి అనేక మంది చూపులేని వారు శిక్షణ తీసుకునేందుకు ఇక్కడికి వస్తుంటారు. విద్యా వనరుల కేంద్రాన్ని స్థాపించి దీని ద్వారా బ్రెయిలీ లిపిలో ప్రింట్ చేసిన పుస్తక గ్రంథాలయం, విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాలు, నవలలు, పత్రికలు వివిధ భాషల్లో ఆడియోల రూపంలో అందుబాటులో ఉంచుతున్నారు. ఇందుకు చాలా మంది వాలంటీర్లు తమ స్వరాన్నిచ్చి పుస్తకాలను రికార్డు చేస్తున్నారు. ఈ మధ్యే డిజిటల్ రంగంలోకీ అడుగుపెట్టింది తన సంస్థ. ఇక పోటీ పరీక్షలు, ఇతర ఉద్యోగాలకు ఇతరులతో పోటీ పడాలంటే కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాల్సిదే. అందుకే కంప్యూటర్ పరిజ్ఞానంలోనూ శిక్షణనిచ్చేలా కంప్యూటర్ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. చూపులేని వారు తమ కాళ్లపై తాము నిలబడేలా, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేందుకు స్వతంత్ర జీవన నైపుణ్యాల శిక్షణా కేంద్రం, మహిళల కోసం మహిళా సాధికారత కేంద్రాన్ని స్థాపించి విద్యా, వసతి అందిస్తున్నారు. ఇన్ని కార్యక్రమాలు కార్యరూపం దాల్చడంలో దాతల సహాయం మరవలేనంటారు మధు.
ఉద్యోగ కల్పన
కేవలం శిక్షణ మాత్రమే కాదు. చూపులేని వారికి ఉపాధి అవకాశాలనూ కల్పిస్తోంది. ఏయే రంగాల్లో అవకాశాలున్నాయి. వారి అర్హతలు, వారి ఆసక్తికి తగిన ఉద్యోగాలను కల్పించేలా ప్లేస్మెంట్ సెల్‌ని ఏర్పాటు చేశారు. టీసీఎస్, ఐబీఎం, సిస్కో వంటి ప్రముఖ కార్పొరేట్ సంస్థలూ వీరికోసం నియామకాలు చేపడతాయి. ఇప్పటికీ వేయి మందికి పైగా ఈ ప్లేస్మెంట్ సెల్ ద్వారా ఉద్యోగాలు దక్కించుకున్నారు.
లాక్డౌన్ కాలంలోనూ..
లాక్‌డౌన్‌తో అన్ని సంస్థల వలే మూడునెలలు మిత్రజ్యోతినీ మూసివేయాల్సి వచ్చింది. కానీ వారి సేవలను మాత్రం అలాగే కొనసాగించారు. గ్రామీణ ప్రాంతంలోని చూపులేనివారికి రేషన్, ఇతర అత్యవసర వస్తువులు, చదువుకునేందుకు డిజిటల్ పుస్తకాలు, సీడీలు అందించారు. ప్రస్తుతం సంస్థ తెరుచుకున్నా పరిస్థితులు సహకరించపోవడంతో ఈ మెయిల్ ద్వారానే కావాల్సిన సమాచారం, సీడీలు చేరవేస్తున్నారు.
- ఇంటర్నెట్ డెస్క్