close

వార్తలు / కథనాలు

పూట గడవని స్థితి నుంచి కంపెనీ అధిపతిగా..!

కేరళ యువకుడి విజయగాథ

పూట గడవని స్థితి నుంచి కంపెనీ అధిపతిగా..!

ఇదో ఓ యువ వ్యాపారవేత్త విజయగాథ. కేరళలోని కన్నూర్‌కు చెందిన 19ఏళ్ల ఓ యువకుడు గృహ రుణం కోసం బ్యాంకుకు వెళ్లాడు. వయసు తక్కువగా ఉందంటూ అతడిని బ్యాంకు అధికారులు వెనక్కి పంపించేశారు. ఇంటర్మీడియట్‌ పూర్తి కాగానే బీబీఏ చేద్దామని ఓ ప్రముఖ కళాశాలకు వెళ్లాడు. ‘నీకున్న 85శాతం మార్కులు చాలవు. కావాలంటే మేనేజ్‌మెంట్‌ కోటాలో చేయొచ్చు’ అని అక్కడా తిరస్కరించారు. ఎక్కడికి వెళ్లినా తిరస్కరణ.. ఆర్థిక సమస్యలు.. ప్రతి పనిలోనూ వైఫల్యం.. ఇలా అన్ని సమస్యలు వెంటాడే పరిస్థితుల్లో నుంచి ఆ యువకుడు తన తండ్రి ఇచ్చిన కంప్యూటర్‌తో ఉన్నత శిఖరాలకు చేరుకున్నాడు. ఏడాదికి రూ.రెండు కోట్ల ఆదాయం తెచ్చిపెట్టే కంపెనీకి యజమాని అయ్యాడు. సొంత ఇల్లు, బీఎండబ్ల్యూ కారు కొన్నాడు. ప్రపంచ వ్యాప్తంగా వేల మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నాడు. ఉత్సాహవంతులైన యువతకు శిక్షణ ఇప్పిస్తున్నాడు.

కేరళలోని కన్నూర్‌ అనే చిన్న పట్టణంలో నివాసం ఉండే ఓ మలయాళ వార్తాపత్రిక సంపాదకీయుడి కుమారుడు మహ్మద్‌ జవాద్. ఐదేళ్ల వయసులో జవాద్‌ రోజూ తండ్రి కార్యాలయానికి వెళ్తుండేవాడు. తండ్రి వాడే కంప్యూటర్‌ ముందు కూర్చునేవాడు. కంప్యూటర్‌లో ఏదో ఒకటి వెతుకుతూ ఉండేవాడు. జవాద్‌కు కంప్యూటర్‌పై ఉన్న ఆసక్తిని అతని తండ్రి గమనించేవాడు. మొదట్లో అందరు పిల్లల్లాగే జవాద్‌ కంప్యూటర్‌లో గేమ్స్‌ ఆడుతూ వెబ్‌సైట్లు చూస్తుండేవాడు. ఫేస్‌బుక్‌, ఆర్కుట్‌ వెబ్‌సైట్‌ చూసి వెబ్‌సైట్‌ పనితీరుపై ఆశ్చర్యానికి గురయ్యేవాడు. వెబ్‌సైట్‌ ఎలా పనిచేస్తుంది? అసలు వెబ్‌సైట్‌ను ఎలా తయారు చేయాలి.? అని ఆలోచించేవాడు. దానికి సంబంధించిన వివరాలన్నీ దుబాయ్‌లో ఉన్న తన సోదరుడిని అడిగి తెలుసుకున్నాడు.

పదిలోనే తొలిమెట్టు..
మొదట్లో తన సొంత పట్టణమైన కన్నూర్‌కు సంబంధిందించి ఓ వెబ్‌సైట్‌ తయారు చేశాడు. అది అంతగా ఉపయోగపడలేదు. పదో తరగతిలో శ్రీరాగ్‌ అనే స్నేహితుడుండేవాడు. అన్ని విషయాల్లోనూ ఇద్దరివీ ఒకే రకమైన అభిప్రాయాలు ఉండేవి. సాంకేతిక పరిజ్ఞానం తెలిసిన వారు కావడంతో అందరు విద్యార్థులు వారి వద్దకు వచ్చి కంప్యూటర్‌కు సంబంధించిన అనుమానాలు నివృత్తి చేసుకునేవారు. ఎంపీ3 పాటలు, ఆర్టికల్స్‌ అందించాలనే ప్రతిపాదనతో ఒక బ్లాగ్‌ను రూపొందించాలనుకున్నారు. తన పేరులో నుంచి ‘జ’ తన స్నేహితుడి పేరులో నుంచి ‘శ్రీ’ కలిపి ‘జశ్రీ’ అనే పేరుతో ఒక వెబ్‌సైట్‌ తయారు చేయాలనుకున్నారు. ‘.కామ్‌’, ‘.నెట్‌’ డొమైన్లను కొనాలంటే ఎక్కువ మొత్తంలో డబ్బు కావాలి. వారి దగ్గర అంత డబ్బు లేదు. ఉచితంగా అందుబాటులో ఉన్న ‘.టీకే’ అనే డొమైన్‌తో ‘జశ్రీ.టీకే’ అనే వెబ్‌సైట్‌ తయారు చేశారు. పదో తరగతి పూర్తి అయిన తర్వాత శ్రీరాగ్‌ తన పైచదువుల కోసం అబుదాబి వెళ్లాడు. మరోపక్క వెబ్‌సైట్ల ద్వారా డబ్బు సంపాదించే మార్గాల కోసం జవాద్‌ అన్వేషించాడు. తన వెబ్‌సైట్‌కి గూగుల్‌ నుంచి యాడ్‌సెన్స్‌ అనుమతి లభించింది. అయినా వెబ్‌సైట్‌కు ఆదరణ లేకపోవడంతో పైసా కూడా సంపాదించలేకపోయాడు. అక్కడితో అదీ కనుమరుగైపోయింది.

తండ్రి ఉద్యోగం పోయింది.. సంపాదించాల్సిన సమయమొచ్చింది..
2012లో జవాద్‌ తండ్రి ఉద్యోగం పోయింది. సొంత ఇల్లు నిర్మించుకోవాలనే కల చెదిరిపోయింది. తండ్రి ఆరోగ్యం కూడా పాడయింది. కుటుంబమంతా అప్పటికే అద్దె ఇంట్లోనే ఉంటున్నారు. తండ్రి రెండు ఇళ్లు కొన్నప్పటికీ ఆర్థిక సమస్యలతో వాటినీ అమ్మాల్సి వచ్చింది. పరిస్థితులు మరింత కఠినంగా మారాయి. పూట గడవడం కూడా కష్టంగా మారింది. దీంతో తానూ సంపాదించాల్సిన అవసరం వచ్చిందని జవాద్‌ గుర్తించాడు. వెబ్‌డిజైనింగ్‌ ద్వారా డబ్బు సంపాదించే అవకాశం ఉందని తెలుసుకున్నాడు. అప్పుడు టీఎన్‌ఎం ఆన్‌లైన్‌ సొల్యూషన్‌ పేరుతో ఒక డొమైన్‌ను తీసుకున్నాడు. సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయడం ప్రారంభించాడు. ఐదు పేజీల వెబ్‌సైట్‌కు రూ.2,500, నాలుగు పేజీల వెబ్‌సైట్‌కు రూ.2వేలు ఇలా ప్యాకేజీలను ఆఫర్‌ చేసేవాడు. చాలా మందిని నుంచి స్పందన వచ్చేది కానీ అనుభవం లేదనే కారణంతో ఎవరూ నమ్మకాన్ని చూపలేకపోయారు. అప్పుడు జవాద్‌కు 16ఏళ్లు. తండ్రి పొదుపు చేసిన రూ.1.50లక్షలు ఇంట్లో ఉన్నాయి. కుటుంబం గడవడానికి ఉన్న మొత్తం ఏకైక ఆధారం అదే. అప్పుడు జవాద్‌.. తన తండ్రి దగ్గరికి వెళ్లి కన్నూర్‌లో ఓ కార్యాలయం ప్రారంభించడానికి కొంతనగదు కావాలని అడిగాడు. ప్రతిగా ‘‘నువ్వేం చేయాలనుకుంటున్నావో.. అదే దారిలో ముందుకెళ్లు’’ అని తండ్రి ప్రోత్సహించారు. ఇంటర్‌ మొదటి సంవత్సరం చదివే సమయంలో జవాద్‌ కన్నూర్‌లో తన మొదటి కార్యాలయాన్ని ప్రారంభించాడు.

ఉపాధ్యాయులకే ఉద్యోగమిచ్చాడు..
కార్యాలయం ప్రారంభించిన జవాద్‌.. అదే పట్టణంలోని ఒక ఐటీ శిక్షణ సంస్థలో వెబ్‌డిజైనింగ్‌లో శిక్షణ తీసుకున్నాడు. ఆ సంస్థలో తనకు శిక్షణ ఇచ్చిన ఇద్దరు ఉపాధ్యాయులు ఇప్పుడు జవాద్‌ సంస్థలో ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. ‘మొదటి సంపాదన నా గురువు శోమా విలాస్‌ నుంచి పొందాను. ఫేస్‌బుక్‌లో పెట్టిన ఓ పోస్టును చూసిన శోమా నన్ను సంప్రదించారు. వెబ్‌సైట్‌ తయారు చేసి ఇచ్చినందుకు రూ.2,500 చెల్లించారు. నా జీవితంలో అదే నాకు మొదటి ఆదాయం. ఆ డబ్బును తీసుకెళ్లి అమ్మ ఫరీదాకు ఇచ్చాను. అప్పుడు అమ్మ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. తర్వాత విషయాన్ని అమ్మకు వివరంగా చెప్పా’ అని జవాద్‌ ఆనందంతో తెలిపాడు. ఆ తర్వాత కొన్ని నెలల్లోనే టీఎన్‌ఎం సొల్యూషన్స్‌కు చాలా మంది ఆకర్షితులయ్యారు. కానీ, ఆ ఆకర్షితులను కస్టమర్లుగా మార్చలేకపోయాడు.

అప్పుడే మలుపు తిరిగింది..
కేరళలో నిర్వహించిన యువ వ్యాపారవేత్తల(ఎస్‌కేరళ) సమ్మిట్‌లో జవాద్‌ పాల్గొన్నాడు. అతడి జీవితం అక్కడే మలుపు తిరిగింది. తన తండ్రి పనిచేసిన మలయాళ వార్తాపత్రికకు చెందిన ఒక విలేకరి జవాద్‌ వద్ద ఇంటర్వ్యూ తీసుకున్నాడు. ఆ వార్త అన్ని ఎడిషన్లలోనూ ప్రచురితం అయింది. ఆ వార్తకు సంబంధించిన పత్రిక క్లిప్పింగును తన ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు. దీంతో అనూహ్యంగా స్పందన పెరిగింది. అమెరికా, దుబాయ్‌, ఖతార్‌లతో పాటు దేశవిదేశాల నుంచి ఫోన్లు రావడం.. నెమ్మదిగా గుర్తింపు రావడం మొదలైంది. ఇంతలోనే అప్పటి కేరళ ముఖ్యమంత్రి ఊమెన్‌ చాందీ కార్యాలయం నుంచి పిలుపొచ్చింది. ఐటీ శాఖ మంత్రి కున్హలికుట్టీ(ఇప్పుడు ఎంపీ) జవాద్‌ గురించి తెలుసుకున్నాడు. అతడిని రప్పించాడు. మంత్రులతో కలిసి ఫొటోలు దిగి, ఆ ఫొటోలను ఫేస్‌బుక్‌లో పెట్టడంతో జవాద్‌ వ్యాపారానికి ప్రాచుర్యం మరింత పెరిగింది. వ్యాపార వృద్ధికి దోహదపడింది.

సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌ ద్వారా ఒక్కో ఎస్‌ఈవోకు రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు జవాద్‌ ఇప్పుడు సంపాదిస్తున్నాడు. ఈ 22 ఏళ్ల యువకుడు 20 దేశాలకు చెందిన 917 మంది క్లయింట్లతో దుబాయ్‌లోనూ ఒక కార్యాలయాన్ని ప్రారంభించాడు. 36మంది సభ్యులతో కన్నూర్‌లోనూ కార్యాలయాన్ని విస్తరింపజేశాడు. చిన్న వయసులోనే ఎన్నో విజయాలు సాధించిన జవాద్‌ ఇటీవల యూఏఈలో ప్రముఖ వ్యాపారవేత్త డా.రామ్‌ బుక్సాని అవార్డు సొంతం చేసుకున్నాడు.

అదే నా లక్ష్యం..
‘టీఎన్‌ఎం ఆన్‌లైన్‌ సొల్యూషన్స్‌’ ప్రధానంగా వెబ్‌ డిజైనింగ్‌, వెబ్‌ డెవలప్‌మెంట్‌, మొబైల్‌ యాప్‌ డెవలప్‌మెంట్‌, గూగుల్‌ ఎస్‌ఈఓ, ఐటీ కన్సల్టెన్సీలకు సంబంధించిన సేవలను అందిస్తోంది. జవాద్‌ ఇప్పుడు టీఎన్‌ఎం పేరుతో ఒక శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నాడు. దానిద్వారా వెబ్‌ డిజైనింగ్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌లో యువతకు శిక్షణ ఇస్తున్నారు. తన కంపెనీకి ‘టీఎన్‌ఎం జవాద్‌’ అనే పేరు సూచించిన గూగుల్‌కు కృతజ్ఞతలు అంటున్నాడు జవాద్‌. తన పేరు మీద యూజర్‌ ఐడీ అందుబాటులో లేకపోవడంతో గూగుల్‌ ఆ పేరును సూచించిందని జవాద్‌ తెలిపాడు. అదే ఇప్పుడు తనకు గుర్తింపు అయ్యిందని భావోద్వేగంతో తెలిపాడు. ఏదో ఒక రోజు భారతదేశంలోనే అతిపెద్ద వెబ్‌డిజైనింగ్‌ కంపెనీగా తీర్చదిద్దాలన్నదే తన లక్ష్యమని జవాద్‌ పేర్కొన్నాడు.

-ఇంటర్నెట్‌డెస్క్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు