
వార్తలు / కథనాలు
(Photo: Orfield Laboratories website)
ఇంటర్నెట్ డెస్క్: ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకూ రోజంతా ఎన్నో మాటలు, శబ్దాలు వింటాం. ఇంట్లో ఉంటే టీవీ సౌండ్, పిల్లల గోల, రోడ్డుమీద వాహనాల శబ్దాలు.. ఆఫీసు, షాపుల్లో ఇంకా చెప్పనక్కర్లేదు. మరోవైపు రోజురోజుకూ శబ్దకాలుష్యం పెరుగుతూనే ఉంది. వీటితో విసిగిపోయి ప్రశాంతత కోసం నిశ్శబ్దమైన ప్రాంతానికి వెళ్లాలనుకుంటాం. కానీ, ఎక్కడికి వెళ్లినా ఏదో ఒక శబ్దం చెవులకు వినిపిస్తూనే ఉంటుంది. అయితే, బాహ్య ప్రపంచానికి సంబంధించి ఎలాంటి శబ్దం వినిపించని అత్యంత నిశ్శబ్దమైన ప్రాంతం ఒకటుంది. ఆహా.. అక్కడికి వెళ్లి ప్రశాంతత తెచ్చుకుందామనుకుంటున్నారేమో.. అందులో మీరు ఎక్కువ సేపు ఉండలేరు.. ఉండాలని ప్రయత్నిస్తే పిచ్చి పట్టే ప్రమాదముంది.
యూఎస్‌లో మిన్నెసోటాలోని మిన్నెపోలీస్‌లో ఏర్పాటు చేసిన ఒర్ఫిల్డ్ లేబొరేటరీస్‌లో ఉందీ అత్యంత నిశ్శబ్దమైన చోటు. ఈ ల్యాబ్‌లో ఓ ఛాంబర్‌ను ఏర్పాటు చేశారు. ఇందులోని గోడలు బయటి శబ్దాలను లోపలకు రానివ్వవు. లోపల శబ్దాలు -9.4 డెసిబెల్స్‌గా ఉంటుందంటే నమ్ముతారా?కానీ, అదే నిజం. ఇందులోకి వెళ్తే బయటి శబ్దాలు వినిపిచడం ఆగిపోవడం కాదు, మన లోపల అవయవాలు చేసే శబ్దాలు వినిపిస్తాయి. గుండె చప్పుడు, ఊపిరితిత్తులు చేసే శబ్దాలు స్పష్టంగా వినిపిస్తాయి. ఉదరంలో జరిగే ప్రక్రియలో భాగంగా వెలుబడే శబ్దాలు సైతం చక్కగా వినిపిస్తాయి. అందుకే ఈ ఛాంబర్లోకి వెళ్లిన వారు 45 నిమిషాలకు మించి ఉండలేరు. శరీరంలో నుంచి వచ్చే శబ్దాలు వింటుంటే పిచ్చి పట్టినట్టుగా అవుతుందట. నిజానికి వివిధ సంస్థలు ఉత్పత్తి చేసే ఆడియో పరికరాలు సరిగా పనిచేస్తున్నాయో లేదో తెలుసుకోవడం కోసం, నాణ్యమైన శబ్ద పరికరాలను తయారు చేయడం కోసం ఈ ఛాంబర్‌ను ఉపయోగిస్తారట. అలాగే అంతరిక్షంలో ఉండే నిశ్శబ్దానికి అలవాటు పడటం కోసం వ్యోమగాములు ముందుగా ఈ ఛాంబర్లో ఉండి శిక్షణ తీసుకుంటారట. ప్రస్తుతం ఈ ఛాంబర్ సాధారణ ప్రజలకూ అందుబాటులో ఉండటంతో ఇదో పర్యాటక ప్రాంతాగానూ మారిపోయింది.
అయితే, మైక్రోసాఫ్ట్ కూడా తమ సంస్థ ఉత్పత్తి చేసే ఆడియో పరికరాల పనితీరును పరీక్షించడం కోసం అమెరికాలోని సంస్థ ప్రధాన కార్యాలయంలో అత్యంత నిశ్శబ్దమైన ల్యాబ్‌ను ఏర్పాటు చేసుకుంది. దీంతో ప్రపంచంలో అత్యంత నిశ్శబ్దమైన ప్రాంతంగా గిన్నిస్‌బుక్‌లో రికార్డు సాధించింది. అంతకుముందు వరకు ఈ రికార్డు ఒర్ఫిల్డ్ లేబొరేటరీస్ పేరిట ఉండేది.