
వార్తలు / కథనాలు
టీకా వచ్చేవేళ రెండో తరంగానికి కారణం కావద్దు..
ఐరోపా నేర్పుతున్న పాఠాలు
నిబంధనలు గాలికొదలద్దు..
ఇంటర్నెట్‌డెస్క్ ప్రత్యేకం
అలొచ్చినప్పుడు తలవంచాల్సిందే.. లేకపోతే కొట్టుకుపోతాం.. మనిషి దగ్గర తగిన శక్తిలేకపోతే ఇదే సూత్రం పాటించాలి. కరోనా విషయంలో కూడా అంతే.. ఇప్పటికైతే టీకా రాలేదు.. దాదాపు ఆరునెలలుగా కష్టపడి ఐరోపా దేశాలు వైరస్‌ను కట్టడి చేశాయి. సరే.. కదా అని నిబంధనలు సడలించాయి. అంతే, ఒక్కసారిగా కేసుల సంఖ్య మరోసారి పెరిగిపోయింది. తప్పని పరిస్థితుల్లో ఇప్పుడు ఆయా దేశాలు లాక్డౌన్లు విధించే అంశాన్ని పరిశీలిస్తున్నాయి. కొన్ని దేశాలు ఇప్పటికే రాత్రివేళల్లో కర్ఫ్యూలనూ విధించాయి.
ఐరోపా దేశాల్లో కేసుల వరద..
ఇటలీలో కరోనా తీవ్రత తగ్గాక రోజుకు కేవలం 200 కరోనా కేసులు మాత్రమే వచ్చాయి. ఇక తగ్గిందనుకున్న సమయంలో ఒక్కసారిగా మరోసారి వైరస్ విజృంభించింది. ఇక్కడ ఇప్పుడు నిన్న ఒక్కరోజే 17 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఫ్రాన్స్‌లో 26 వేలు, స్పెయిన్‌లో 17వేలు, యూకేలో 20వేలు, జర్మనీలో 12వేలు, బెల్జియంలో 15వేలు, స్విట్జర్లాండ్‌లో 17 వేలు, రష్యాలో 17 వేల కేసులు వచ్చాయి. మొత్తంగా ఐరోపాలోని చిన్నాచితకా దేశాలను కూడా కలుపుకొంటే కేసుల సంఖ్య ఒక్కరోజే 2 లక్షలు దాటేసింది.
మళ్లీ అమల్లోకి నిబంధనలు..
* ఫ్రాన్స్‌లో చాలా పట్టణాల్లో రాత్రివేళల్లో కర్ఫ్యూ విధించారు. ఈ కర్ఫ్యూలకు 46 మిలియన్ల మంది ప్రభావితం కానున్నారు. ఈ సంఖ్య ఫ్రాన్స్ జనాభాలో మూడింట రెండో వంతు. పరిస్థితి అధ్వాన్నంగా ఉందని ఫ్రాన్స్ ప్రధాని జేన్ కాస్టెక్స్ పేర్కొన్నారు.
* స్పెయిన్‌లో రాత్రి 11 నుంచి ఉదయం 6 వరకు కర్ఫ్యూ అమల్లో ఉంది. స్పెయిన్‌లో నైట్‌లైఫ్ విధానమే కరోనావ్యాప్తికి కారణమవుతోందని ప్రధాని పెడ్రో తెలిపారు. అందుకే కఠిన చర్యలు తీసుకొన్నట్లు వెల్లడించారు.
* ఇటలీలో కరోనా అదుపునకు మళ్లీ ఆంక్షలు విధించారు. బార్లు, రెస్టారెంట్లను సాయంత్రం 6 గంటలకే మూసివేయాలని తెలిపారు. క్రీడలు, ఇతర ఆహ్లాదభరిత కార్యక్రమాలను రద్దు చేశారు. విద్యార్థులకు మళ్లీ ఆన్లైన్ క్లాస్‌లు మొదలుపెట్టారు. ఈ నిబంధనలు నవంబర్ 24 వరకు అమల్లో ఉంటాయి. జనాల్లో కోపం పెరిగినా.. కొవిడ్‌ను అదుపు చేయడానికి ఈ నిబంధనలు తప్పవని ప్రధాని గ్యుసేప్ కాన్ట్ తెలిపారు.
* లండన్‌లో పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని ఆ దేశ హెల్త్ సెక్రటరీ మాట్ హాంకాక్ తెలిపారు. ప్రజలు కలుసుకోవడంపై ఆంక్షలు విధించారు. దేశ వ్యాప్తంగా ఆల్కహాల్ విక్రయంపై ఆంక్షలు విధించే అంశాన్ని పరిశీలిస్తున్నారు.
* ఇక ఐర్లాండ్‌లో మళ్లీ లాక్డౌన్ విధించారు. వేల్స్లో ఈ వారాంతం నుంచి 17 రోజుల లాక్డౌన్ అమల్లోకి వస్తుంది.
రెండో తరంగానికి కారణాలు..
అమెరికాలోని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ అంచనా ప్రకారం కరోనావైరస్ రెండో తరంగం వచ్చే అవకాశం ఉంది. ఇది కేవలం మానవ తప్పిదంతోనే జరుగుతుందని ఆ విశ్వవిద్యాలయం పేర్కొంది. ఆ సంస్థ ఆగస్టులో సెల్ఫోన్ల డేటాను విశ్లేషించి.. ప్రజల మధ్యలో భౌతిక దూరం గణనీయంగా తగ్గిపోయినట్లు గుర్తించింది. దీనికితోడు కరోనా వంటి ఆరోగ్య సమస్యలను తెచ్చే స్పానిష్ ఫ్లూ.. స్వైన్‌ఫ్లూ వంటి జబ్బులు కూడా తొలుత వసంత కాలంలో ఓ మోస్తరు స్థాయిలో వచ్చి కొంచెం తగ్గుమఖం పట్టాయి.. అనంతరం శీతాకాలంలో భారీగా విజృంభించాయి.
అమెరికాలో కరోనా సోకిన వారి సంఖ్య 10శాతం వరకు ఉంది. అంటే ఇంకా దాని బారినపడే అవకాశం ఉన్న వారు ఎక్కవ మందే ఉన్నారని అర్థం. భారత్‌లో అయితే ఇది 1శాతం లోపే ఉంది. ప్రపంచంలోని చాలా దేశాల్లో ఈ పరిస్థితి ఉంది.
భవిష్యత్తులో కరోనా భారీగా వ్యాపించడానికి కారణాలు..
వాతావరణ ప్రభావం..
వాతవరణంలో తేమ తగ్గడం.. చలి వంటి అంశాలు ఫ్లూ, ఇన్ఫ్లుయెంజా వైరస్లుకు బాగా కలిసి వస్తాయి. ఇవి వైరస్లు ఎక్కువ సేపు సజీవంగా ఉండటానికి ఉపయోగపడతాయి. దీంతోపాటు ఈ సీజన్లో రోగి నుంచి విడుదలయ్యే తుంపరల్లో ‘వైరసుల సంఖ్య’ అత్యధికంగా ఉంటుంది. దీంతో పాటు తుంపర పరిమాణం కూడా తగ్గడంతో అది గాలిలో ఎక్కువ సేపు ఉండటంతోపాటు ఎక్కువ దూరం కూడా ప్రయాణించగలదు. అంటే వేసవిలో మనిషిని సోకే వైరస్ లోడ్ కంటే శీతాకాలంలో లోడ్ ఎక్కువగా ఉంటుందన్న మాట. ఇది తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది.
వ్యాపార కార్యకలాపాలు మొదలు..
వ్యాపార కార్యకలాపాలు మొదులుకాగానే అంతా సవ్యంగా ఉందనే భావన నిర్లక్ష్యానికి కారణం అవుతోంది. వాస్తవంగా ఎండాకాలంలోనే విపరీతంగా వ్యాపించిన కరోనా వైరస్.. శీతకాలంలో మరింత ఎక్కువగా వ్యాపిస్తుందనే అంశాన్ని విస్మరించడమే కారణం అవుతోంది.
పాఠశాలల పునఃప్రారంభం
పిల్లలతో సామాజిక దూరం నిబంధనలు పాటింపజేయడం అత్యంత కష్టమైన పని. దీంతో ఒక్కరికి వైరస్ సోకితే అది వేగంగా మిగిలిన వారికి సోకే అవకాశాలు ఉన్నాయి.
ఎక్కవమంది ఇండోర్‌లో ఉండటం..
శీతాకాలం కావడంతో ఓపెన్ గార్డెన్ రెస్టారెంట్లు వంటివి కాకుండా ఇండోర్ రెస్టారెంట్లకు ప్రాధాన్యం ఇవ్వడం కూడా ఒక కారణం. చాలా దేశాల్లో చలి కారణంగా రెండు కుటుంబాలు కలిసినా బయట ఉండే పరిస్థితి ఉండదు. ఇండోర్‌లో గాలి ప్రసరణ సరిగా లేకపోవడంతో వైరస్ వ్యాపిస్తుంది.
జలుబు సీజన్ కావడం..
శీతాకాలంలో ఆస్తమాతోపాటు జలుబు ఎక్కవమందిలో కనిపిస్తుంటుంది. ఇవి సాధారణ వైరస్ల నుంచి వచ్చాయనుకొని గతంలో మందులు వాడేవాళ్లం. కానీ, ఇప్పుడు జలుబు చేసినా కరోనావైరస్ నుంచి వచ్చిందేమో అని పరీక్షలు చేయించుకోవాలి. అందరూ ప్రతిసారీ పరీక్షలు చేయించుకొనే పరిస్థితి ఉండదు. దీంతో కరోనా సోకిన వారు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండకుండా బయట తిరిగితే వ్యాధి మరింత మందికి సోకుతుంది.
విసిగిపోయిన జనం..
ప్రజలు ఏప్రిల్, మే నెలల్లో ఉన్నంత జాగ్రత్తగా ఇప్పుడు ఉండటంలేదు. నెలల కొద్దీ నిబంధనలు పాటించడంతో చాలా మంది ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. కొంత మంది ఫేస్ మాస్క్‌లను కూడా విస్మరిస్తున్నారు. వైరస్ బలంగా ఉన్న సమయంలో ఇది అత్యంత ప్రమాదకరం. ఇలాంటప్పుడే నిబంధనలు కచ్చితంగా పాటించాలి.
తప్పుడు ప్రచారంతో..
చాలా మంది వ్యక్తిగత స్వార్థంతో చేసే తప్పుడు ప్రచారాలు కూడా వైరస్ వ్యాప్తికి కారణం అవుతాయి. ‘మందులొచ్చేశాయి.. ఏమీ కాదు’, ‘వైరస్ బలహీనమైంది ఏమీ చేయదు’.. ఇంకా మతపరమైన కారణాలతో వ్యాధి వ్యాప్తి తీవ్రత పెరుగుతుంది.
కేవలం 90 రోజులు ఓపిక పడితే..
‘దిగార్డియన్’ కొవిడ్ వ్యాక్సిన్ ట్రాకర్ ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 217 టీకాల అభివృద్ధి యుద్ధప్రాతిపదికన జరుగుతోంది. వీటిల్లో 11 టీకాలు 3వ దశలో ఉన్నాయి. అంటే ఈ దశ దాటితే ఆమోదముద్ర వేయించుకోవడమే. ఆక్స్ఫర్డ్, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్, ఫైజర్, సినోఫార్మా టీకాలు అభివృద్ధి దాదాపు ముగింపు దశలో ఉంది. పైగా చాలా కంపెనీలు భారీ ఎత్తున డోసులను తయారు చేసి పెట్టుకొన్నాయి. అంటే వచ్చే ఏడాది ప్రారంభం నాటికి ఎట్టి పరిస్థితుల్లో కరోనా నుంచి విముక్తి లభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇన్ని నెలలు జాగ్రత్తగా ఉన్నవారు.. చివర్లో నిర్లక్ష్యంగా వ్యవహరించి వైరస్ బారిన పడటం అవసరమా..?