close

వార్తలు / కథనాలు

ఆ దళమే ఉండుంటే.. ఉగ్రవాదులు మటాషే!

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం : పుల్వామా, ఉరీ, శ్రీనగర్‌, పఠాన్‌కోట్‌... తదితర ప్రాంతాల్లో పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో అనేకమంది భద్రతాదళ సిబ్బంది వీరమరణం పొందిన విషయం తెలిసిందే. అయితే, ఉగ్రదాడులు జరగకుండా ఉండేందుకు కోవర్ట్‌ ఆపరేషన్లు నిర్వహించాలని గతంలో భారత సైన్యంలో ఏకంగా ఒక దళాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం రాజకీయ కారణాలతో దీన్ని రద్దు చేశారు. వాస్తవానికి ఈ దళమే ఉండి ఉంటే ఎలాంటి ఉగ్రదాడినయినా ముందుగానే అడ్డుకొని ఉండే అవకాశముండేదని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

 

ఎప్పుడు ఏర్పాటైంది..

2009 ముంబయి ఉగ్రదాడుల అనంతరం ఉగ్రదాడులను ముందుగానే తెలుసుకునేందుకు వీలైన వ్యూహాలపై అప్పటి జాతీయ భద్రతా సలహాదారు ఎంకే నారాయణన్‌ సైనికదళాల జనరల్స్‌, నిఘావర్గాల అధిపతులతో సమావేశమయ్యారు. దేశంలో గానీ, విదేశాల్లో గానీ మనదేశ భద్రతకు భంగం కలిగించే ఉగ్రసంస్థలు, వామపక్ష తీవ్రవాద సంస్థలను ముందుగానే దెబ్బకొట్టే విధంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు టెక్నికల్‌ సపోర్ట్‌ డివిజన్‌ అనే సంస్థను మెరికల్లాంటి అధికారులతో ఏర్పాటుచేశారు.  అప్పటి సైనిక జనరల్‌ వీకే సింగ్‌ అంగీకరించడంతో  దళం ఏర్పాట్లు చకచకా జరిగిపోయాయి. ఇందులో రా విభాగం, కేంద్ర నిఘా విభాగాలతో పలు సైనిక ఆపరేషన్లలో పాల్గొన్నవారిని నియమించారు. అత్యంత రహస్యంగా కోవర్టు ఆపరేషన్లు నిర్వహించే సంస్థలోని అధికారులు సైనిక జనరల్‌కు మాత్రమే జవాబుదారీగా ఉంటారు.

 

ఆదిలోనే మంచి ఫలితాలు

తొలినాళ్లలో ఈ సంస్థ మంచి ఫలితాలు సాధించింది. పాక్‌ నిఘా సంస్థ ఐఎస్‌ఐ కార్యకలాపాలపై పూర్తి నిఘాపెట్టింది. దేశంలోని ఉగ్రవాదులు ఇతర దేశాలతో వారితే మాట్లాడితే వారి సంభాషణలను రికార్డు చేసేందుకు వీలుగా ఇంటర్‌సెప్టర్‌ పరికరాలను కూడా కొనుగోలు చేశారు. వాస్తవానికి ఇలాంటి యూనిట్లు గతంలోనూ ఉండేవి. 1977లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన జనతా ప్రభుత్వం వీటిని రద్దుచేసింది.  అనంతరం కాంగ్రెస్‌ హయాంలో మళ్లీ ప్రారంభం కాగా 1996-98లో అధికారంలో ఉన్న యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం వీటిని మళ్లీ రద్దుచేసింది. సుదీర్ఘ విరామం అనంతరం ముంబయి దాడుల అనంతరం వీటిని తిరిగి పునరుద్ధరించారు.

 

ఎందుకు మూతపడింది..

జనరల్‌ వీకే సింగ్‌ హయాంలో ఈ సంస్థను ఏర్పాటు చేశారు. అనంతరం అప్పట్లో కేంద్రంలోని కొందరు పెద్దలకు దీనిపై అనుమానాలు తలెత్తడంతో దీని భవిష్యత్తు ఆందోళనకరంగా మారింది. వీకే సింగ్‌ పదవీ విరమణ చేసిన కొద్ది కాలానికే దీన్ని రద్దు చేశారు. వాస్తవానికి ఈ సంస్థ మనుగడలో ఉండి ఉంటే కోవర్టు ఆపరేషన్లు, ఫోన్‌ సంభాషణలను ట్యాపింగ్‌ చేయడం ద్వారా ఉగ్రవాదుల నియంత్రణలో భద్రతాదళాలు ముందంజలో ఉండేవి. కానీ రాజకీయాల కారణంగా ఈ సంస్థను మూసివేశారు. ప్రస్తుతం ఇలాంటి సంస్థ ఉంటే ఉగ్రవాదుల దాడులను ముందస్తుగానే తెలుసుకుని నిలువరించే అవకాశం ఉండేదని భద్రతా నిపుణులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు