
వార్తలు / కథనాలు
* పాక్‌ను చావు దెబ్బతీసిన తంగైల్ ఎయిర్‌డ్రాప్
ఇంటర్నెట్‌డెస్క్ ప్రత్యేకం
చుట్టూ శత్రుసేనలు.. ఉన్నట్టుండి.. గాల్లోకి విమానాల దండు వచ్చింది... శత్రువుల మధ్యలోకి కొందరు యుద్ధవీరులను జారవిడిచింది. వీరంతా అక్కడి స్వతంత్ర పోరాట యోధులకు అండగా నిలిచారు. ఫలితంగా పాక్ రెండు ముక్కలైంది.. బంగ్లాదేశ్‌కు విముక్తి లభించింది. ఈ ఘటన చోటుచేసుకొని 49 ఏళ్లు పూర్తయి మొన్నే అర్ధశతాబ్ధంలోకి అడుగుపెట్టింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అతిపెద్ద ఎయిర్‌డ్రాప్ అయిన ‘ది తంగైల్ ఎయిర్‌డ్రాప్’కు 11వ తేదీతో 49ఏళ్లు పూర్తయ్యాయి. ఆ ఘటన ఏమిటీ.. అది పాకిస్థానీ జనరల్ ఏఏకే నియాజీని ఎలా బెంబేలెత్తించి లొంగిపోయేలా చేసిందో తెలుసుకొందాం.
భారత్ నుంచి పాకిస్థాన్ విడిపోయాక తూర్పు పాకిస్థాన్, పశ్చిమ పాకిస్థాన్‌లుగా ఏర్పడ్డాయి. పంజాబ్ ప్రావిన్స్ వైపు పశ్చిమ పాకిస్థాన్.. బెంగాల్ వైపు ప్రాంతం తూర్పు పాకిస్థాన్(నేటి బంగ్లాదేశ్)గా అవతరించాయి. పాలనలో పశ్చిమ పాకిస్థానీలు ఆధిపత్యం ఎక్కువగా కొనసాగేది. 1970 ఎన్నికల్లో తూర్పుపాకిస్థాన్కు చెందిన అవామీ లీగ్ అత్యధిక స్థానాలు గెలవడంతో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం వచ్చింది. కానీ, నాటి పాలకుడు జుల్ఫీకర్ అలీ భుట్టో పగ్గాలు వదులుకోవడానికి ఇష్టపడక.. తూర్పు పాకిస్థాన్‌లోని అవామీలీగ్‌ను అణచివేయడానికి సైనిక జనరల్‌ను పురమాయించాడు. ఆ తర్వాత మార్చి 26న బంగ్లాదేశ్ నాయకులు, కొందరు సైనికాధికారులతో కలిసి స్వాతంత్ర్యం ప్రకటించుకొన్నారు. దీనిని అణచివేయడానికి పాక్ సైన్యాన్ని పంపింది. దీనికి జనరల్ ఏఏకే నియాజీ నాయకత్వం వహించారు. వీరు లక్షల మందిని హత్యచేశారు. దీంతో అవామీలీగ్ నాయకులు, కొందరు సైనికాధికారులు భారత్‌ను ఆశ్రయించారు. భారత్ అండదండలు అందించింది. దీనిని కంటగింపుగా భావించిన పాక్ డిసెంబర్ 3న భారత్‌పై యుద్ధం ప్రకటించింది.
8 వైమానిక స్థావరాలపై బాంబుల వర్షం కురిపించడంతో భారత్ కూడా యుద్ధరంగంలో అడుగుపెట్టింది. పశ్చిమ పాకిస్థాన్ వైపు లాంగ్వాలా వద్ద భారీ సైనిక ఘర్షణ జరిగింది. అదే సమయంలో మన నౌకాదళం కరాచీ పోర్టును ధ్వంసం చేసింది. ఇక తూర్పు వైపు బంగ్లాదేశ్‌కు స్వాతంత్ర్యం కల్పించడానికి సువర్ణావకాశం దక్కింది. అప్పటికే ముక్తిబాహని సేనలు బంగాల్లో పాక్ సైన్యాన్ని దీటుగా ఎదుర్కొంటున్నాయి. దీంతోపాటు భారత్ సైన్యాలు త్రిపురా, మేఘాలయా వైపు నుంచి శత్రు భూభాగంలోకి చొచ్చుకుపోవడం మొదలుపెట్టాయి. కానీ, డిసెంబర్ 11న జరిగిన ఘటన ఈ పోరులో పాక్ ఓటమిని నిర్ణయించింది.
రంగంలోకి పారాట్రూపర్లు..
డిసెంబర్ 11న చీకట్లు ముసరగానే భారత్‌లోని కలైకొండ, డమ్‌డమ్ వైమానిక స్థావరాల నుంచి 50 విమానాల దండు బంగ్లాదేశ్ మధ్యలో ఉన్న తంగైల్ వైపుగా బయల్దేరింది. అప్పటికే అక్కడ పార కమాండోల రాక కోసం సిగ్నల్ విభాగానికి చెందిన పీకే ఘోష్ నేతృత్వంలో బంగ్లా దేశ్ ముక్తిబాహిని రెండు ప్రదేశాలను సిద్ధం చేసింది. ఆయుధాలు, ఇతర సాధన సంపత్తితో భారత్‌కు చెందిన రెండో పారా బెటాలియన్ నేతృత్వంలోని కమాండోలు నేలపైకి దిగారు. వీరు జమునా నదిపైన ఉన్న అత్యంత వ్యూహాత్మకమైన పుంగిలి వంతెనను స్వాధీనం చేసుకొన్నారు. స్థానికులు భారత సైన్యానికి అండగా ఉన్నారు. దీంతో పాకిస్థాన్ 93వ బ్రిగేడ్ ఢాకా వైపు వెళ్లేందుకు మార్గం మూసుకుపోయింది. ఇక్కడ 24 గంటల పాటు జరిగిన పోరులో 350 పాకిస్థానీ సైనికులు చనిపోయారు. ఆ తర్వాత భారత దళాలు కొన్ని రోజుల్లోనే ఢాకాలో అడుగుపెట్టాయి. డిసెంబర్ 16న పాక్ లెఫ్టినెంట్ జనరల్ ఏఏకే నియాజీ లొంగిపోయారు. దీంతో పాక్ ఓటమి ఖాయమైంది.
మానసికంగా దెబ్బకొట్టి..
తంగైల్ ఎయిర్ డ్రాప్‌కు ముందు పారా బెటాలియన్‌కు నాటి కల్నల్ ఇంద్రజీత్ సింగ్ రక్షణశాఖ పీఆర్వోతో సమావేశం అయ్యారు. తంగైల్ ఎయిర్డ్రాప్కు భారీ ప్రచారం ఇవ్వాలని కోరారు. శత్రువును మానసికంగా కుంగదీయడానికి ఈ వ్యూహాన్ని కూడా అనుసరించారు. నాటి డిఫెన్స్ పీఆర్వో లెఫ్టినెంట్ కల్నల్ రామ్మోహన రావు వద్ద తంగైల్ ఎయిర్‌డ్రాప్ ఫోటోలు లేవు. దీంతో ఆయన తెలివిగా అంతకు ముందు ఏడాది ఆగ్రా సమీపంలో జరిగిన పారా రెజిమెంట్ యుద్ధవిన్యాసాల ఫోటోలనే తంగైల్ ఎయిర్‌డ్రాప్ ఫొటోలుగా విడుదల చేశారు. దీంతో తంగైల్ ఎయిర్ డ్రాప్లో 5,000 మంది వరకు పాల్గొన్నట్లు పాక్ భావించింది. ఇక ముప్పేట దాడిని తట్టుకోలేక ఏఏకే నియాజీ ఒత్తిడికి లోనై భారత దళాలకు లొంగిపోయాడు. వాస్తవానికి 700 మంది పారా కమాండోలు మాత్రమే తంగైల్ ఎయిర్‌డ్రాప్‌లో పాల్గొన్నారు. ఫలితంగా 90 వేల మంది పాకిస్థాన్ సైనికులు లొంగిపోవడం కొసమెరుపు..! ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ శక్తి అది.
ఇదీ చదవండి