
వార్తలు / కథనాలు
ఇంటర్నెట్‌డెస్క్: అదొక మార్కెట్. ఏటా ఆ మార్కెట్‌ను చూడ్డానికి ఐదు కోట్ల మంది వస్తుంటారు. వాణిజ్య ప్రకటనలు ఉండే బిల్‌బోర్డులు ఇక్కడ మనకు దర్శనమిస్తాయి. ఇక్కడ తమ ఉత్పత్తులను ప్రదర్శించడానికి పెద్ద పెద్ద కంపెనీలు సైతం క్యూ కడతాయి. ఈ పాటికే అదేమిటో అర్థమై ఉంటుంది. అదే న్యూయార్క్‌లోని టైమ్స్‌స్క్వేర్ అని!! తాజాగా ఆగస్టు 5వ తేదీన అయోధ్యలో రామమందిర భూమి పూజకు గుర్తుగా ఇక్కడి బిల్‌బోర్డుపై శ్రీరాము, అయోధ్యలోని ఆలయ నమూనా, భారత జాతీయ పతాకాన్ని ప్రదర్శించారు. దీంతో మరోసారి ఇది వార్తల్లో నిలిచింది. ఇంతకీ ఏమిటీ టైమ్‌స్క్వేర్..? ఏంటి దీని ప్రత్యేకత?
టైమ్స్ స్క్వేర్ విశేషాలు..
ఇది ప్రపంచలోనే అతి రద్దీగా ఉండే మార్కెట్. నిత్యం 3.30 లక్షల మంది నిత్యం ఇక్కడికి వస్తుంటారు. రద్దీ రోజుల్లో ఈ సంఖ్య 4లక్షలను దాటేస్తుంది. ప్రపంచ వినోద పరిశ్రమకు ప్రధాన కేంద్రం. దీనికి ఈ పేరు రావడానికి ‘ది న్యూయార్క్ టైమ్స్’ పత్రికే కారణం. ఆ పత్రిక ప్రధాన కార్యాలయాన్ని 1904లో ఇక్కడకు తరలించడంతో అందరూ దీనిని టైమ్స్ స్క్వేర్‌గా వ్యవహరించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత న్యూయార్క్ టైమ్స్ భవనం మారినా పేరు మాత్రం కొనసాగింది.
* 1907 నుంచి ఇక్కడ ప్రతి నూతన సంవత్సర వేడుకల్లోనూ ‘న్యూ ఇయర్ ఈవ్ బాల్డ్రాప్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
* పేరులోనే దీనికి స్క్వేర్ అని ఉంటుంది గానీ.. దీని ఆకారం మెడకు పెట్టుకొనే బౌటై ఆకారంలో ఉంటుంది.
* ఒకప్పుడు దీనిని లాంగ్ఎకర్ స్క్వేర్ అని పిలిచేవారు.
* చట్టప్రకారం టైమ్స్ స్క్వేర్‌లోని భవనాల్లో కనిపించేంత వెలుతురు కచ్చితంగా ఉండాలి.
* రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా గెలిచాక 1945 ఆగస్టు 14న ఇక్కడ జరిగిన సంబరాల్లో 20లక్షల మంది పాల్గొన్నారు. అదొక రికార్డ్.
* 1990 తర్వాత ఇక్కడ పెట్టుబడులు భారీగా పెరిగాయి. 2000 నాటికి భారీ పర్యాటక ప్రాంతంగా అవతరించింది.
వాణిజ్య కేంద్రం..
* టైమ్స్ స్క్వేర్ వాణిజ్య ప్రకటనలకు స్వర్గం. ఇక్కడ దాదాపు 234 బిల్ బోర్డులు ఉన్నాయి. ఇవి 24గంటలూ కాంతులీనుతుంటాయి. పెద్దపెద్ద బ్రాండ్లు ఇక్కడ తమ కొత్త ఉత్పత్తులను ఇక్కడ బిల్‌బోర్డులపై ప్రదర్శించడానికి క్యూ కడతాయి. ఇక్కడి బిల్‌బోర్డులు లక్షల కొద్దీ ఇంప్రెషన్లను ఆకర్షిస్తాయి. ఇక్కడ ఒక సాధారణ బిల్ బోర్డు పెట్టాలంటే ఏడాదికి సగటున 1.1 మిలియన్ డాలర్ల నుంచి 4 మిలియన్ డాలర్ల వరకు చెల్లించాలి. అదే పెద్ద బిల్బోర్డుకు నెలకు సగటున 3 మిలియన్ డాలర్ల వరకు చెల్లించాల్సి ఉంటుంది.
* ఇక్కడ కారు పార్కింగ్ కూడా కష్టమే. చాలా ధరను వసూలు చేస్తారు. అందుకే ఇక్కడ ప్రజలు నడకకు ప్రాధాన్యం ఇస్తారు. ఎన్ని లక్షల మంది వచ్చినా నడకే శరణ్యం.
* ఇక్కడ ఫొటోలు దిగాలంటే రకరకాల సినిమా క్యారెక్టర్ల వేషాల్లో స్థానికులు అందుబాటులో ఉంటారు.
* ఇక స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్ అడుగడుగునా దర్శనమిస్తాయి. వివిధ సంస్కృతులకు చెందిన ఆహారం లభిస్తుంది. సందర్శకులు కూడా చాలా ఆసక్తిగా కొత్తరుచులను ఆస్వాదిస్తారు. పాన్ దుకాణాలు కూడా ఉంటాయి.
* పదుల సంఖ్యలో థియేటర్లు, షాపింగ్ మాల్స్ ఇక్కడ ఉన్నాయి. నిత్యం లైవ్ షోలు వంటివి ఇక్కడ ప్రదర్శిస్తుంటారు.
ఉగ్రవాదుల దృష్టి..
టైమ్స్స్క్వేర్కు అత్యధిక ప్రాముఖ్యం ఉండటంతో ఉగ్రవాదులు కూడా ప్రపంచం దృష్టిని ఆకర్షించడానికి ఇక్కడ దాడికి యత్నిస్తుంటారు. 2008 నుంచి ఇప్పటి వరకు రెండు సార్లు దాడులకు కుట్ర పన్నారు. 2008, 2010లో కారు బాంబు రూపంలో దాడికి ప్రయత్నించారు. అందుకే ఇక్కడ నిత్యం పోలీస్ పహారా కొనసాగుతుంది.