close

వార్తలు / కథనాలు

అందుకే మసూద్‌కు చైనా మద్దతు..!

ఇంటర్నెట్‌డెస్క్‌  ప్రత్యేకం: ఐరాసలో మరోసారి పాక్‌ ఉగ్రవాది మసూద్‌ అజర్‌కు చైనా మద్దతుగా నిలిచింది. భారత్‌కు మద్దతుగా యూకే, ఫ్రాన్స్‌, అమెరికాలు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని చైనా మరోసారి సాంకేతిక కారణాలు చూపి నిలిపివేసింది. అంతకు ముందు కూడా మూడుసార్లు చైనా ఇదే విధంగా మసూద్‌కు మద్దతుగా నిలిచింది. దీంతో ఐరాసలోని 1267 కమిటి ప్రస్తుతానికి ఆ అంశాన్ని పక్కన పెట్టింది. ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు ఎదురవుతున్నా డ్రాగన్‌.. మసూద్‌ అజర్‌కు మద్దతుగా నిలవడానికి పలు భౌగోళిక రాజకీయాంశాలు, ఆర్థిక అవసరాలు, దేశ అంతర్గత విషయాలు కారణాలుగా నిలిచాయి.

భారత్‌కు శత్రువు చైనాకు మిత్రుడు..
చైనా, పాక్‌ సంబంధాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారత్‌పై పాకిస్థాన్‌ ఎక్కుపెట్టే ఆయుధాల్లో చాలా వరకు చైనా నుంచి వచ్చేవే. భారత్‌కు చైనా, పాక్‌లు శత్రుదేశాలే. ఇదే అంశం వారిని దగ్గర చేసింది. ఈ నేపథ్యంలో భారత్‌ను నష్టపర్చేలా పాక్‌ చేపట్టే ఏ చర్యకైనా చైనా మద్దతు ఉంటుంది. కొన్ని లోపాయకారిగా ఉంటే.. మరికొన్ని బహిరంగంగానే ఉంటాయి. అలా బహిరంగంగా ఉండే వాటిల్లో మసూద్‌ అజర్‌ అంశం కూడా ఒకటి.

టిబెట్‌ విషయంలో వైరం..
టిబెట్‌కు చెందిన ఆధ్యాత్మిక గురువు దలైలామాకు భారత్‌ కొన్ని దశాబ్దాలుగా ఆశ్రయం ఇస్తోంది. ఈ అంశం చైనాకు కంటగింపుగా మారింది. ఎన్నోసార్లు చైనా బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. అయినా భారత్‌ దీనిని పట్టించుకోలేదు. భారత్‌కు లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ నాయకులు ఎంతో.. తమకు దలైలామా అంతే అన్నట్లు చైనా వ్యవహరిస్తుంది. ఈ నేపథ్యంలో భారత్‌ను విసిగించేందుకు మసూద్‌ అజర్‌ను వాడుకొంటోంది.

ఇమేజ్‌ కోసం..
చైనా జిన్‌జియాంగ్‌ ప్రావిన్స్‌లో కొన్ని లక్షల మంది ఉయ్‌గుర్‌ ముస్లింలపై దమనకాండ సాగిస్తోంది. వారి ప్రతికదలికపై నిఘా ఉంచి అణగదొక్కుతోంది. అఫ్గాన్‌ సరిహద్దులో ఉన్న ఈ ప్రాంతం నుంచి తమ ప్రధాన భూభాగానికి ఉగ్రముప్పు పొంచి ఉందనేది  చైనా అనుమానం. మరోపక్క మసూద్‌ అజర్‌కు చెందిన జైషేకు పాక్‌, అఫ్గాన్‌ సరిహద్దుల్లో పట్టు ఉంది. ఇప్పుడు మసూద్‌కు వ్యతిరేకంగా ఐరాస తీర్మానానికి మద్దతు ప్రకటిస్తే అఫ్గాన్‌కు చెందిన ఉగ్రమూకలు చైనాలో విద్వేషాలను రెచ్చగొట్టే ప్రమాదం ఉంది. అసలే తనను వ్యతిరేకించిన పాక్‌ అధ్యక్షుడు ముషారఫ్‌ పైనే జైషే హత్యాయత్నాలు చేసింది. అటువంటి ఉగ్రసంస్థతో తలనొప్పి దేనికి అనుకొని చైనా తీర్మానాన్ని వ్యతిరేకించింది. మరో పక్క ఉయ్‌గుర్‌ల విషయంలో ముస్లింల వ్యతిరేకి అనే విమర్శలను డ్రాగన్‌ ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో  మసూద్‌ను రక్షించడం ద్వారా తాను ముస్లింలకు వ్యతిరేకి కాదు అనే విషయాన్ని చెప్పదలుచుకొంది. పాక్‌లోని మసూద్‌ రక్షించడం ద్వారా ముస్లిం దేశాల్లో ఇమేజ్‌ పెంచుకోవాలనే తాపత్రయం కూడా ఒక కారణం.

భారత్‌ను ఇబ్బంది పెట్టాలనే..
దక్షిణాసియాలో భారత్‌ అత్యంత కీలకమైన స్థానంలో ఉంది. యుద్ధానికి ముందు వరకు చైనాతో భారత్‌ మంచి సంబంధాలు పెట్టుకొంది. కానీ యుద్ధం తర్వాత చైనా మన దాయాది పాక్‌కు దగ్గరైంది. ఈ నేపథ్యంలో భారత్‌.. జపాన్‌, అమెరికాలతో సంబంధాలను పటిష్ఠం చేసుకొంది. దక్షిణ చైనా సముద్రంలో ఆ దేశ దూకుడుకు అమెరికా, జపాన్‌లు కళ్లెం వేస్తున్నాయి. దీనికి భారత్‌ సహకరిస్తోంది. ఇప్పుడు దీంతో మన శత్రువైన పాక్‌ను సంతోషపెట్టేందుకు మసూద్‌కు చైనా సాయం చేస్తోంది.

వియత్నాం విషయంలో..
భారత్‌ ఇటీవల కాలంలో వియత్నాంతో సంబంధాలను పెంచుకొంటోంది. ఆ దేశానికి ఆయుధాలను కూడా సరఫరా చేస్తోంది. వియత్నాంతో చైనాకు కొన్ని అంశాలపై తీవ్ర విభేదాలు ఉన్నాయి. అటువంటి వియత్నాంకు భారత్‌ ఆయుధాలు సరఫరా చేయడం కూడా చైనా ఆగ్రహానికి కారణం అవుతోంది.

అన్నింటి కంటే అతి ముఖ్య కారణం సీపెక్‌..!
చైనా-పాక్‌ ఎకనామిక్‌ కారిడార్‌ కూడా మసూద్‌ రక్షణకు కారణమైంది. అందరూ సీపెక్‌ పాకిస్థాన్‌కు గుండెకాయ అనుకుంటారు. కానీ, ఇది చైనాకు ఆక్సిజన్‌ అందిస్తుంది. ఇప్పటి వరకు చైనాకు చమురు  రవాణా చేయాలంటే అది భారత్‌ కనుసన్నల్లోని మార్గాల నుంచి జరగాల్సిందే. చైనాకు వెళ్లే చమురు నౌకలను భారత్‌  అండమాన్‌ దీవుల వద్ద తన నావికాదళంతో అడ్డుకొనే అవకాశం ఉంది. ఇదే జరిగితే చైనా వృద్ధిరేటు ఒక్కసారిగా పాతాళంలోకి పడిపోతుంది. ఈ విషయం చైనాకు తెలుసు. అందుకే ఈ మార్గానికి ప్రత్యామ్నాయంగా జింగ్‌జియాంగ్‌ ప్రావిన్స్‌ నుంచి పాకిస్థాన్‌లో గ్వాదర్‌ పోర్టు వరకు సీపెక్‌ పేరుతో కారిడార్‌ నిర్మాణం చేపట్టింది. గల్ఫ్‌ దేశాల నుంచి వచ్చే చమురు, గ్యాస్‌లను ఈ మార్గం నుంచి చైనాకు తరలించనుంది. ఇది అత్యంత సురక్షితమైన చౌక వ్యవహారం. ఇక్కడే మసూద్‌ పాత్ర ఉంది. ఈ సీపెక్‌ పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ నుంచి వెళుతుంది. ఇక్కడ చైనా, పాక్‌ వ్యతిరేక ఉద్యమాలు జరుగుతున్నాయి. సీపెక్‌ నిర్మాణాన్ని పాక్‌ ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్నారు. పాక్‌లోని ఖైబర్‌ కనుమల్లోని మాన్‌షెహ్‌రా నుంచి కూడా సీపెక్‌ మార్గం వెళుతుంది. ఇక్కడికి అత్యంత సమీపంలోని బాలాకోట్‌ వద్ద కూడా చైనా భూములను తీసుకొంది. అంతేకాదు సీపెక్‌లో దాదాపు 10వేల మంది చైనీయులు పనిచేస్తున్నారు. దీంతోపాటు పలు కీలకమైన విద్యుత్తు ప్రాజెక్టుల పనులు నడుస్తున్నాయి. ఈ సమయంలో జైషే నిషేధానికి మద్దతు తెలిపితే ఆ సంస్థ సీపెక్‌పై దాడులు మొదలు పెట్టే అవకాశం ఉంది. దీంతో అసలుకే ఎసరు వస్తుంది. ఇది దాదాపు 51 బిలియన్‌ డాలర్ల ప్రాజెక్టు. అందుకే చైనా కిమ్మనకుండా జైషేకు మద్దతు ఇస్తోంది. ఇదీ మసూద్‌కు చైనా మద్దతు వెనుక అసలు కారణం.


Tags :

మరిన్ని