close

వార్తలు / కథనాలు

ఆన్‌లైన్‌లో డబ్బు సంపాదించండిలా..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రస్తుతం డిజిటల్‌ యుగం నడుస్తోంది. ఈ డిజిటల్‌ యుగంలో ఇంటర్నెట్‌ మనకు ప్రపంచం మొత్తాన్ని అరచేతిలో చూపిస్తుంది.  ఇంటర్నెట్‌ ద్వారా ఎంతో మంది తెలియని విషయాలు తెలుసుకుంటుంటే, మరెంతో మంది తెలిసిన విషయాలను ఇతరులతో పంచుకుని డబ్బు సంపాందించే మార్గాలు కూడా అన్వేషిస్తున్నారు. అందులో భాగంగానే ఎంతో మంది యూట్యూబ్‌లో ఛానెళ్లు ప్రారంభించి తమకు నచ్చిన, ఆసక్తి ఉన్న రంగంపై వీడియోలు తీసి తమను ఫాలో అయ్యే వారితో పంచుకుని డబ్బులు సంపాదించే ఉపాధి మార్గాలు తయారు చేసుకుంటున్నారు. ఇలా యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించడానికి ఎన్నో  ఆలోచనలు ఉన్నాయి.. కొంతమందికి ఆ మార్గాలు తెలియక సతమతమవుతుంటారు. అలాంటి వారి కోసం కొన్ని ఆలోచనలను అందించే ప్రయత్నం చేద్దాం..

మీకు వంటలు చేయడం ఇష్టమేనా?
కొందరు చికెన్‌ బిర్యానీ చేస్తే దాని రుచి మామూలుగా ఉండదు.. అబ్బ చెప్తేనే నోరూరుతుంది కదూ..! మరి అలాంటివి చేసుకుని తినాలంటే ఎలా చేయాలో తెలియాలి కదా. అలా రుచికరమైన వంటలు తినాలనే కోరిక ఉన్నవారి కోసం వంటలు చేయడంలో నైపుణ్యం ఉన్నవారు వీడియోలు తీసి యూట్యూబ్‌లో పెడితే మంచి వాటికి మంచి ఆదరణ ఉంటుంది. ఎందుకంటే కొంతమంది మంచి మంచి వంటకాలు రుచి చూడడం కోసం ఎలా చేయాలని వీడియోలు చూస్తారు. అలాంటి వారు మీ వీడియోలు వీక్షించడం ద్వారా ప్రకటనల నుంచి ఆదాయంతో పాటు వంట నైపుణ్యాల ప్రదర్శనతో  మంచి ఆదాయ మార్గంగా కూడా మారుతుంది. ప్రస్తుతం చాలామంది వంట మాస్టార్లు యూట్యూబ్‌లో తమ వంటకాల వీడియోలను ఉంచి ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నారు. 

ఎలాగైనా కొత్త ఫోన్‌ పట్టాల్సిందే..!
వీడేంటో ఎప్పుడు వీడికి ఫోన్ల పిచ్చే.. మార్కెట్లో ఏది కొత్తగా వచ్చినా అది వీడి చేతిలో పడే వరకూ నిద్రపోడు. దాని కెమెరా ఎంత మెగా పిక్సెల్‌ ఉంటుంది? దాని ర్యామ్‌ ఎంత? ఎలా పనిచేస్తుంది అని ఓ ప్రశ్నల మోత ఉంటుంది. అలా కొందరు సాంకేతికంగా అభివృద్ధి చెందే ఏ పరికరం మార్కెట్లో వచ్చినా దాన్ని కొనే దాకా నిద్ర పోరు.. ఏ టెక్నాలజీ వచ్చినా తెలుసుకోకుండా ఉండరు. అలాంటి వారి కోసం సాంకేతిక పరిజ్ఞానం ఉన్నవారు ఎవరైనా ఉంటే.. బయట ఏదైనా ఎవరికీ తెలియని కొత్త సాంకేతిక పరిజ్ఞానం విడుదలైతే దాన్ని వీడియో తీసి యూట్యూబ్‌ ఛానెల్‌లో పోస్ట్‌ చేయవచ్చు. టెక్నాలజీపై ఆసక్తి ఉన్న యువత ఈ వీడియోలు చూడడం ద్వారా మీ ఛానల్‌కు ప్రేక్షకులు పెరగడంతో పాటు వారి లైక్స్‌ను బట్టి మీకు ఆదాయ మార్గంగా కూడా మారుతుంది. 

ఎలాగైనా ఉద్యోగం సంపాదించాలి..!
ఏ ఉద్యోగ ప్రకటన వెలువడినా దరఖాస్తు చేసి ఉద్యోగాన్ని పట్టేయాలి అని నిరుద్యోగులు ఎదురుచూస్తుంటారు. పోటీ పరీక్షల సమాచారం, విషయ పరిజ్ఞానం ఉన్నవారు ఉద్యోగ ప్రకటనలపై సమాచారాన్ని నిరుద్యోగులకు అందించే వీడియోలు చేయవచ్చు. దానితో పాటు వారికి ఉద్యోగం కోసం సాధన చేయడానికి గల సూచనలను కూడా అందించవచ్చు. నిరుద్యోగుల కోసం ఇలాంటి వీడియోలు తీసి వారికి యూట్యూబ్‌ ద్వారా అందిస్తే మీకు ఆదాయ మార్గంగానూ ఉపయోగపడుతుంది. అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగం సాధించే అవకాశాన్ని కల్పించిన వారుగా మంచి పేరూ వస్తుంది.

హాస్యం పుట్టించండి..!
 ఏదైనా జరగని సంఘటనని జరిగినట్లు సృష్టించి ఇతరులను బయపెట్టడంలో హాస్యం పుడుతుంది. కొందరు ఎంత కోపంగా ఉన్నా అది హాస్యంగా ఉన్నట్టే ఉంటుంది. అలాంటి వారితో ప్రాంక్‌ వీడియోలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకోవచ్చు. అలా కొంతమంది స్నేహితులతో చేస్తూ వారిని ఏడిపిస్తుంటారు. అలాంటివి వీడియోలు తీసీ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేయడం ద్వారా బాగా పాపులర్‌ అవుతుంటాయి. 

రాజకీయ పరిజ్ఞానం ఉందా?
రాష్ట్రంలో, కేంద్రంలో రాజకీయ పరిస్థితులు ఏవిధంగా ఉన్నాయి. ఎప్పుడెప్పుడు రాజకీయాల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అనే వార్తలపై మీకు ఆసక్తి ఉండి ఎప్పటికప్పుడు తెలుసుకునే సామర్థ్యం ఉండి, రాజకీయ పరిస్థితులను విశ్లేషించగలిగితే మీకు యూట్యూబ్‌లో ఆదాయం సంపాదించడానికి మంచి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే దేశవ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ రాజకీయ పరిస్థితులపై తెలుసుకోవాలనే కోరిక అందరికీ ఉంటుంది. కాబట్టి రాజకీయ విశ్లేషణలపై వీడియోలు చేసే మీకు తిరుగుండదు. భవిష్యత్‌ రాజకీయాలను కూడా అంచనా వేయగలిగితే ఛానెల్‌కు వీక్షకులు పెరిగి మీకు మంచి ఆదాయ వనరుగా మారుతుంది. 

ప్రజా సమస్యలు..
సమాజంలో ప్రజా సమస్యలపై స్పందించే తత్వం ఉన్నవారు ఎవరైనా ఉంటే.. నిత్యం ప్రజల్లో ఉన్న సమస్యలను ఫోకస్‌ చేసి ఆ ప్రాంత ప్రజల దృష్టికి అధికారుల దృష్టికి తీసుకెళ్లే విధంగా మీరే సొంత ఛానెల్‌గా చేయవచ్చు. ఇలా ప్రజలకు కచ్చితమైన సమాచారాన్ని చేరవేయగలిగే విధంగా ఉంటే వీక్షకులు పెరిగే అవకాశం ఉంటుంది. ఇలా చేయడం ద్వారా మీరు ఆదాయం సంపాదించడంతో పాటు ప్రజల సమస్యలు నెరవేర్చిన వారిగా కూడా పేరు సంపాదిస్తారు. 

వ్యాయామం చేసే వారి కోసం..
జీవితాంతం ఆరోగ్యంగా ఉండాలంటే ఆహార నియమాలు పాటించడంతో పాటు వ్యాయామం కూడా తప్పనిసరిగా చేయాలి. శారీరక దృఢత్వం కోసం, ఆరోగ్యం కోసం చాలా మంది జిమ్‌లకు వెళ్తుంటారు. అలాంటి వారికోసం ఇంటి వద్దే వ్యాయామం చేయడం ఎలా? వ్యాయామంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర సలహాలు, సూచనలతో కూడిన వీడియోలు చిత్రీకరించి యూట్యూబ్‌లో పోస్ట్‌ చేయడం ద్వారా కూడా ఆదాయాన్ని పొందవచ్చు. శారీరక దృఢత్వం కోసం కసరత్తులు చేసేవారు చాలామంది ఈ వీడియోలు చూస్తారు. కాబట్టి వ్యాయామ కసరత్తులపై ఆసక్తి ఉన్నవారికి మంచి ఆదాయ వనరుగా మారుతుంది. 

జంతుప్రేమికుల కోసం..
సమాజంలో మనుషులతో పాటు ఎన్నో జీవులు బతుకుతున్నాయి. కొంత మంది వాటిలో కూడా ప్రేమను ఆస్వాదిస్తుంటారు. కుక్కల్ని, కోళ్లను,చేపల్ని, గుర్రాలను, పిట్టలను ఇలా రకరకాల జీవుల్ని పెంచుకుంటుంటారు. అలాంటి వారి కోసం మంచి వీడియోలు రూపొందించి పోస్ట్‌ చేయవచ్చు. వాటికి ఎలాంటి ఆహారం అందించాలి. వాటి ఆరోగ్యాన్ని ఎలా సంరక్షించాలి. ఇలాంటి జంతుప్రేమికుల కోసం వీడియోలు రూపొందించవచ్చు. వీటికి ప్రేక్షకాదరణ బాగానే ఉంటుంది. దీని ద్వారా వారికి జీవులపై సూచనలు అందించడంతో పాటు, మీకు ఆదాయ వనరుగా కూడా మారుతుంది.

పుస్తక సమీక్షలు..
మీకు పుస్తక సమీక్షలు రాయడంలో మంచి నైపుణ్యం ఉందా? అయితే నిత్యం చదివుతూ ఉండే పుస్తక ప్రేమికుల కోసం మంచి పుస్తకాలకు సంబంధించిన వీడియోలు చేయండి. విజయవంతమైన వారి జీవిత చరిత్రలు గానీ, బాగా పేరు మోసిన నవలలు గానీ, కవితా సంపుటిలు గానీ మీకు తెలిసినవి మార్కెట్లో మంచి పేరున్నవి తెలుసుకుని పుస్తక సమీక్షలతో యూట్యూబ్‌ వీడియో చేయండి. పుస్తకాల కోసం పరితపించే వారు వాటిని వీక్షించే అవకాశం ఉంటుంది.

విహారయాత్రికుల కోసం..
కొందరు ఖాళీ సమయం దొరికిందంటే చాలు విహారయాత్రలకు బయలు దేరుతుంటారు. ఎన్నో తిరుగుదామని అనుకుంటారు. కానీ వారికి విహార యాత్రల ప్రదేశాలపై సరైన అవగాహన లేక కొన్ని వెళ్లిన దగ్గర కొన్ని చూడకుండానే వచ్చి బాధపడుతుంటారు. అలాంటి వారి కోసం విహార యాత్రలకు సంబంధించిన సమాచారం తెలుసుకునేలా యూట్యూబ్‌ ఛానెల్‌ ప్రారంభిస్తే మంచి ఆదరణ ఉంటుంది. ఏ ప్రాంతంలో సందర్శించాల్సిన ప్రదేశాలు ఏం ఉంటాయి, అక్కడ ఏమేం లభిస్తాయి అనే సమాచారంతో కూడిన సూచనలు, సలహాలు ఇచ్చే విధంగా వీడియోలు రూపొందిస్తే ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. ఇలా చేయడం ద్వారా మీరు పరోక్షంగా టూరిస్ట్‌ గైడ్‌ గా పేరు సంపాదించడంతో పాటు వీక్షకుల సంఖ్య పెరిగితే ఆదాయ వనరుగా కూడా మారుతుంది. అయితే ఎప్పటికప్పుడు కొత్తకొత్తగా ప్రదేశాల సమాచారాన్ని వీక్షకులకు అందజేస్తుంటే మీకు మంచి అవకాశాలు ఉంటాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు