close

వార్తలు / కథనాలు

అచ్చతెలుగు పాటలను అవలీలగా పాడుతున్నాడు!

ఇంటర్నెట్‌డెస్క్‌ : ఏ మాత్రం పరిచయం లేని భాషను అర్థం చేసుకోవడమే కష్టం. పరాయి భాష పాటలు వినడం అచ్చుగుద్దినట్లు పాడడం మరీ కష్టం. సంగీతంపై ఇష్టంతో ఆ కష్టాన్ని చెరిపేశాడు ఓ చిచ్చర పిడుగు. అచ్చతెలుగు పాటలను అవలీలగా పాడుతూ అబ్బురపరుస్తున్నాడు.

ఈ బుడతడిది మన రాష్ట్రం కాదు. అసలు మనం దేశమే కాదు. మన భాష కాదు. ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలోని పోలాండ్‌ ఇతని స్వదేశం. పేరు బిగ్స్ ‌బుజ్జీ. ఈ బుడతడి పూర్వీకులది భారతదేశమే. అయితే ఇతని తాతల సమయంలోనే వారంతా పోలాండ్‌లో స్థిరపడ్డారు. కేవలం ఆసక్తితోనే ఈ బుడతడు పాటలు విని గుర్తు పెట్టుకుని పాడుతున్నాడు.

నిజానికి బిగ్స్‌బుజ్జీకి ఇంగ్లీష్‌, పోలీష్‌‌ తప్ప వేరే భాష తెలియదు. ఇంట్లో తెలుగు అసలే మాట్లాడరు. అయినా తెలుగు పాటలు విని ఎంతో చక్కగా పాడుతున్నాడు.

హిందీ, మళయాళం, తమిళం పాటలు కూడా బిగ్స్‌బుజ్జీకి వచ్చు.  పాటల పట్ల బిగ్స్‌కు ఉన్న ఆసక్తిని గమనించిన అతని తండ్రి శరత్‌.. బిగ్స్‌కు ఆరేళ్ల వయస్సు నుంచే భారతీయ భాషల పాటలను వినిపించేవాడు. బిగ్స్‌కు అసాధారణ జ్ఞాపకశక్తి ఉంది. ఎంత కష్టమైన పాటనైనా కేవలం రెండు గంటల్లోపే నేర్చుకునేవాడు. వాటిని పాడి యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేయడం మొదలుపెట్టాడు. చూస్తుండగానే బిగ్స్‌ పాటలు సంచలనాలయ్యాయి. భారతీయ సినీ ప్రముఖుల ప్రశంసలు కురిశాయి. నాగార్జున, కమలహాసన్‌, రజనీకాంత్‌, షారుఖ్‌ఖాన్‌ వంటి అగ్రహీరోలు సైతం బిగ్స్‌ గురించి ట్వీట్లు చేశారు. ఇప్పటి వరకు తెలుగులో 69, హిందీలో 20, ఆంగ్లంలో 25, స్పానీష్‌లో 10, మళయాళం, తమిళం, కన్నడ భాషల్లో మరికొన్ని పాటలు పాడాడు.

పాటలే కాదు ఓ తెలుగు చిత్రంలోనూ నటించాడు బిగ్స్‌బుజ్జీ. వరుణ్‌తేజ్‌ నటించిన ‘మిస్టర్‌’ చిత్రంలో కన్పించి మెప్పించాడు. తన తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహంతోనే మనస్సుకు నచ్చింది చేయగలుగుతున్నాని అంటున్నాడు బిగ్స్‌బుజ్జీ.

 


Tags :

మరిన్ని