
వార్తలు / కథనాలు
ఇంటర్నెట్ డెస్క్: యువత సోషల్‌మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికి తెలిసిందే. ఒక్కో సోషల్‌మీడియాను ఒక్కోరకంగా వాడుతుంటారు. ముఖ్యంగా యువతీయువకులు తాము దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తుంటారు. స్నేహితులు, ఫాలోవర్స్‌ను మెప్పించడం కోసం అందంగా తయారై దిగిన ఫొటోలనే పెడుతుంటారు. కానీ ఓ పాతికేళ్ల యువకుడు కేవలం తన నొసలును మాత్రమే ఫొటో తీసి ఇన్‌స్టాలో పోస్టు చేస్తున్నాడు. ఇది పెద్ద విషయం కాకపోవచ్చు.. కానీ ఆరేళ్లుగా ప్రతి రోజు పోస్టు చేయడం విశేషమే కదా..! అంతేకాదు, అలా చేయడానికి ఓ కారణముందని అంటున్నాడు.
యూరప్ ఖండంలోని మాల్టాకు చెందిన జార్జియస్ గత ఆరేళ్లుగా ఈ విధంగా నొసలును ఫొటో తీసి ఇన్‌స్టాలో పెడుతున్నాడు. తనదే కాదు.. తన స్నేహితుల నొసలు ఫొటోలు కూడా పోస్టు చేస్తున్నాడు. ఇదేదో రికార్డు కోసమే, వినూత్న ప్రయత్నమో కాదట. సరదాగా మొదలైన ఈ అలవాటు కొన్నాళ్లుగా కొనసాగుతూ ఉందని, పదేళ్ల మైలు రాయి అందుకునే వరకు దీన్ని ఇలాగే కొనసాగిస్తానని చెబుతున్నాడు.
జార్జియస్ తన నొసలు ఫొటో తీసుకోవడానికి కారణం తన మాజీ ప్రేయసేనట. ఆరేళ్ల కిందట తను ప్రేమలో ఉన్నప్పుడు తరచూ జార్జియస్ను అతడి ప్రేయసి ‘ఎక్కడ ఉన్నావు? ఫొటో తీసి పంపు’అని అడిగేదట. దీంతో ఒకసారి తన ముఖం కనిపించకుండా తన వెనకున్న ప్రాంతం కనిపించేలా నొసలు నుంచి ఫొటో తీశాడు. ఫొటోలో నొసలు, బ్యాక్‌గ్రౌండ్‌లో తను ఎక్కడున్నది స్పష్టంగా కనిపించేది. ఇదేదో బాగుందని తన ప్రేయసి అడిగిన ప్రతి సారి ఇలాగే నొసలు ఫొటో పంపేవాడు. వాటినే ఇన్‌స్టాలో పోస్టు చేసేవాడట. ఆ తర్వాత ప్రేమ విఫలమైనా.. రోజూ ఇలా ఫొటోలు పెట్టడం మానలేదు.