
వార్తలు / కథనాలు
ఇంటర్నెట్ డెస్క్: అల్లర్లు, హింసాత్మక ఘటనలు జరిగే ప్రాంతాల్లో అధికారులు ఇంటర్నెట్ సేవలు నిలిపివేస్తుంటారనే విషయం తెలిసిందే. ఈ ఘటనలకు సంబంధించిన అంశాలు ఇతర ప్రాంతాలకు చేరకూడదని ఇలా చేస్తుంటారు. అయితే ఆఫ్రికాలోని కొన్ని దేశాలు విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్న సమయంలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తున్నాయి. ఎందుకంటారా? అక్కడ ఎక్కువగా పరీక్ష పత్రాలు లీక్ కావడం, పరీక్షల్లో విద్యార్థులు చీటింగ్ చేస్తున్నారట. వీటిని అరికట్టడం కోసం.. ఏకంగా దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలు నిలిపివేస్తున్నారు.
సూడాన్‌లో ప్రస్తుతం డిప్లొమా ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ పరీక్షలు జరుగుతున్నాయి. కరోనా కారణంగా కాస్త ఆలస్యంగా ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే సూడాన్‌లో పరీక్షలు నిర్వహించడం అధికారులకు తలనొప్పిగా మారింది. పరీక్ష పత్రాలు పంపిణీ చేసిన వెంటనే వాటిని కొందరు విద్యార్థులు సోషల్‌మీడియాలో పోస్టు చేయడం, ఇంటర్నెట్లో సమాధానాలు వెతికి రాయడం చేస్తున్నారట. దీంతో విద్యార్థుల చేసే చీటింగ్‌ను అరికట్టేందుకు పరీక్షల సమయంలో దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇది ఇప్పటి నిర్ణయం కాదు.. గత కొన్నేళ్లుగా సూడాన్‌లో పరీక్షల సమయంలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తున్నారు. ఎక్కువగా పరీక్షలు ఉదయం 8 గంటల నుంచి 11 గంటలకు జరుగుతాయి. ఆ సమయంలోనే దేశ ప్రజలకు ఇంటర్నెట్ సేవలు అందుబాటులో ఉండవు.
ఆఫ్రికాలోని మరో దేశం అల్జీరియాలోనూ తాజాగా ఉమ్మడి ప్రవేశ పరీక్షలు జరిగాయి. ఆరు లక్షల మంది అభ్యర్థులు ఉన్నత చదువుల కోసం ఈ పరీక్ష రాశారు. జూన్‌లోనే జరగాల్సిన ఈ పరీక్షలు కరోనా కారణంగా గత ఆదివారం నుంచి గురువారం వరకు నిర్వహించారు. ఈ పరీక్షల్లో విద్యార్థులు చీటింగ్ చేయకుండా ఉండేందుకు పరీక్ష నిర్వహిస్తున్న సమయంలో దేశవ్యాప్తంగా సోషల్‌మీడియాతోపాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ఇరాక్ వంటి మరి కొన్ని దేశాల్లోనూ ఇలా పరీక్షల సమయంలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తారట.