close

వార్తలు / కథనాలు

కళరిపయట్టు.. ఇదో అద్భుత కళ గురూ

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం: కళరిపయట్టు.. ప్రపంచంలోని యుద్ధ క్రీడలకు మాతృక. దీని జన్మస్థానం మనదేశమే. ఇప్పటికీ కేరళలోని అనేక ప్రాంతాల్లో దీన్ని సాధన చేస్తుంటారు. ఈ యుద్ధ కళలో వీరులు ప్రదర్శించే విన్యాసాలు గగుర్పొడుస్తాయి. వేల సంవత్సరాల నుంచి ఈ యుద్ధకళను కాపాడుకుంటూ వచ్చారు. ఈ యుద్ధవీరుల ధాటికి భయపడిన యూరోపియన్‌ పాలకులు కొన్ని సంవత్సరాల పాటు ఈ యుద్ధకళను నిషేధించారు. అయితే గురువుల కఠోర శ్రమతో కళను పరిరక్షించారు. ఇంతకీ ఏమిటీ యుద్ధ కళ? శిక్షణ ఎలా ఉంటుంది?వంటి వివరాలు తెలుసుకుందాం..

పరశురాముడితో ప్రారంభమై..
కేరళకు వచ్చిన పరశురాముడు ఈ యుద్ధకళను పరిచయం చేసినట్టు పురాణగ్రంథాలు పేర్కొంటున్నాయి. ధనుర్వేదంలో ఈ కళకు సంబంధించిన చరిత్ర ఉంది. ‘కళరి’ అంటే ఆవాసం. ‘పయట్టు’ అంటే యుద్ధకళ. కళరిలో మూడు సంప్రదాయాలున్నాయి. కేరళలోని ఉత్తర, మధ్య, దక్షిణ సంప్రదాయాలుగా వీటిని విభజించారు. ఉత్తర సంప్రదాయాన్ని పరశురాముడు ప్రవేశపెడితే.. దక్షిణ సంప్రదాయాన్ని అగస్త్యుడు ఆవిష్కరించాడు. ఉత్తర సంప్రదాయంలో తిరిగి రెండు విధానాలున్నాయి. కాలుయరిపట్టు అంటే ఎక్కువగా కాలును వినియోగించడం. కైక్కుట్టిపయట్టు అంటే చేతితో యుద్ధవిద్యను ప్రదర్శించడం.

కళరిలు..
వీటి నిర్మాణాన్ని మంచి మూహూర్తానా ప్రారంభించేవారు. మందిరంలో వివిధ యుద్ధపరికరాలు ఉంటాయి. ఒక వైపు పూతర అనే వేదిక ఉంటుంది. ఏడు ధాతువులకు ఇది ఉదాహరణగా నిలుస్తుంది. ఇప్పటికీ కేరళలోని పలు ప్రాంతాల్లో వీటిని చూడవచ్చు. విద్యను నేర్పించేవారిని గురుక్కుళ్‌ అంటారు.

కఠోర శిక్షణ..
కళరిలో కఠోరమైన శిక్షణ ఉంటుంది. నైతిక విలువలతో పాటు క్రమశిక్షణ పాటించాలి. బ్రహ్మచర్యాన్ని పాటించాల్సి ఉంటుంది. మధుపానం, పొగతాగడం పూర్తిగా నిషేధం. కళరిలోకి ఎటువంటి పాదరక్షలు వేసుకొని ప్రవేశించకూడదు. ఉదయం 5 నుంచి 9 గంటల వరకు సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటల వరకు శిక్షణ ఉంటుంది. వ్యాయామంతో శిక్షణ ప్రారంభమవుతుంది. అనంతరం నూనెతో మర్ధన చేస్తారు. ఈ శిక్షణలో శరీరం ఉక్కులాగా తయారవుతుంది. తరువాత ‘మెయ్‌తారి’ అనే అంశాన్ని నేర్పిస్తారు. ఆత్మరక్షణ కార్యక్రమాలు ఎక్కువగా ఉంటాయి. తరువాతి దశలో ‘కొల్తారి’ (చెక్కతో చేసిన ఆయుధాల)తో శిక్షణ ఉంటుంది. మలి దశను ‘అంగత్రి’ అంటారు. ఇందులో భాగంగా పదునైన లోహ ఆయుధాలతో శిక్షణ ఇస్తారు. ధనుర్వేదంలో పేర్కొన్న పలు ఆయుధాలు ఇందులో కనిపిస్తాయి. కత్తి, డాలు, ఉరుమి (సన్న రేకుతో తయారుచేసి పొడవైన ఖడ్గం), బల్లెం.. తదితర ఆయుధాల వాడకంలో శిక్షణ ఉంటుంది. అనంతరం ఎలాంటి ఆయుధమూ లేకుండా ఉత్త చేతుల్తో పోరాడటంలో శిక్షణ ఇస్తారు. దీన్ని ‘వెరుంకాయ్‌’ అంటారు. ఇవన్నీ శరీరానికి శక్తినిస్తే మానసికంగా పటిష్టంగా ఉండేందుకు  ఉపాసన ఉంటుంది. ఇందులో ధ్యానం, యోగ ఉంటాయి. 

మర్మవిద్య కీలకం..
మనిషి శరీరంలో అనేక కీలకభాగాలు ఉంటాయి. వీటి గురించి మర్మవిద్య అనే విభాగంలో బోధిస్తారు. దాదాపు 107 మర్మాల గురించి వివరిస్తారు. కళరి మర్మ చికిత్స కూడా ఉంటుంది. శిక్షణలో గాయపడే వారికి దీని ద్వారా చికిత్స అందిస్తారు.  

బ్రిటిషు కాలంలో నిషేధం
18వ శతాబ్దంలో బ్రిటిషువారు మలబార్‌ను పూర్తిగా ఆక్రమించారు. కళరి కళ వచ్చిన యోధుల ముందు ఆంగ్లేయులు నిలవలేకపోయారు. దీంతో ఆ కళను నిషేధించారు. ఆ సమయంలో కళను గురువులు, శిష్యులు పూర్తిగా సంరక్షించారు. తమ తరువాతి తరాలకు పూర్తి రహస్యంగా శిక్షణ ఇచ్చారు. దీంతో వేల ఏళ్లనాటి కళ అంతరార్థం కాలేదు. ఇప్పటికీ కేరళలోని పలు ప్రాంతాల్లో కళరి శిక్షణ కేంద్రాలుంటాయి. కేరళ పర్యటనకు వెళ్లిన సమయంలో వీటిని చూడవచ్చు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు