
వార్తలు / కథనాలు
వ్యాపారస్తులు ఎప్పుడూ తమ వ్యాపారం విస్తరించాలని, ఆదాయం పెంచుకోవాలనే చూస్తారు. ఇందుకోసం రూ.వేల కోట్లు పెట్టి ఇతర సంస్థల్లో పెట్టుబడులు పెట్టడం లేదా ఇతర సంస్థలను కొనుగోలు చేయడం చేస్తుంటారు. గతంలో ఓ సంస్థ ఈ విధంగానే భావించి.. పాపులరైన ఒక సోషల్‌మీడియా సంస్థను రూ.వేల కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. కానీ కొన్నాళ్లకే అది అత్యంత దారుణంగా విఫలం కావడంతో కేవలం రూ.కోట్లలో అమ్ముకోవాల్సి వచ్చింది. విచిత్రం ఏమిటంటే ఆ యాప్ తిరిగి తిరిగి మళ్లీ దాని సృష్టికర్తల దగ్గరకే రావడం.. ఆ తర్వాత కనుమరుగవడం.
అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోకి చెందిన మైఖేల్, షోచి దంపతులు 2005లో ‘బెబో’ పేరుతో సోషల్‌మీడియా వెబ్‌సైట్‌ను రూపొందించారు. అప్పుడప్పుడే నెటిజన్లకు సోషల్‌మీడియా అందుబాటులోకి వస్తున్న తరుణంలో బెబోకు యమ క్రేజ్ పెరిగింది. అప్పట్లోనే కోటి మంది యూజర్లను సొంతం చేసుకొని అత్యంత ఆదరణ పొందుతున్న సోషల్‌మీడియా వేదికగా పేరొందింది. దీని పాపులారిటీని చూసిన ఏవోఎల్ అనే ఆన్లైన్ సర్వీస్ ప్రొవైడర్ కంపెనీ దీనిని సొంతం చేసుకోవాలనుకుంది. ఈ మేరకు 2008 మార్చిలో 850 మిలియన్ డాలర్లు(ప్రస్తుత విలువ దాదాపు రూ. 6,251కోట్లు) పెట్టి బెబోను కొనుగోలు చేసింది. తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచిందన్నట్లు.. బెబోతో మరింత పేరు తెచ్చుకోవాలనుకున్న ఏవోఎల్కు ‘ఫేస్బుక్’ రూపంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
నెటిజన్లంతా ఫేస్‌బుక్‌కు మారడంతో.. బెబో ప్రాముఖ్యం బాగా తగ్గిపోయింది. ఉన్న యూజర్ల సంఖ్య కూడా భారీగా పడిపోయింది. దీంతో 2010లో ఏవోఎల్ ఓ ప్రకటన చేసింది. ప్రస్తుతం సోషల్‌మీడియాకు తగినట్లుగా బెబో లేదని.. త్వరలో అమ్మేయడం లేదా మూసేయడం చేయనున్నట్లు వెల్లడించింది. అదే ఏడాది క్రిటేరియన్ క్యాపిటల్ పార్ట్నర్స్(సీసీపీ)కు 10మిలియన్ డాలర్ల(ప్రస్తుత విలువ దాదాపు రూ.73కోట్లు)లోపు ధరకు అమ్మేసిందట. రూ. ఆరువేల కోట్లకు కొన్న కంపెనీని కేవలం రూ. కోట్లలో అమ్మడంతో సంస్థ భారీగానే నష్టపోయింది. దీనికి బాధ్యుడైన అప్పటి ఏవోఎల్ సీఈవో రాండీ ఫాల్కో తన ఉద్యోగం కోల్పోవాల్సి వచ్చింది.
తక్కువ ధరకే కొన్న సీసీపీ.. బెబోను 2011లో కొత్త వెర్షన్‌తో నెటిజన్ల ముందుకు తీసుకొచ్చింది. కొత్త డిజైన్, వినూత్న సౌలభ్యాలతో నెటిజన్లను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. కానీ అనుకున్నంత ఆదరణ పొందలేకపోయింది. దీంతో 2012 జనవరిలో అంతర్గత తనిఖీల కారణంగా బెబో కొన్ని గంటలపాటు పనిచేయదని సీసీపీ ప్రకటించింది. ఫిబ్రవరిలో సాంకేతిక కారణాల వల్ల బెబోను అందుబాటులోకి తీసుకురాలేకపోతున్నామని, ఆ తర్వాత కొత్త ఫీచర్లను తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుందని సాకు చెబుతూ బెబో నెటిజన్లకు అందుబాటులో లేకుండా చేశారు. కొన్నాళ్లకు దాన్ని అనధికారికంగా మూసివేశారని తెలిసింది. దీంతో బెబో కాస్త #bebomemories పేరుతో ట్విటర్లో ట్రెండ్ అయింది.
ఆ తర్వాత 2013 మే నెలలో బెబోను కొనుగోలు చేసిన సీసీపీ సంస్థ దివాలా తీసింది. అయితే బెబో మాత్రం యూజర్లు ఉపయోగించే విధంగా ఉందని తెలిపింది. దీంతో మళ్లీ బెబో సృష్టికర్తలు మైఖేల్, సోచి దంపతులే తిరిగి దానిని సీసీపీ నుంచి ఒక మిలియన్ డాలర్లు(ప్రస్తుత విలువ దాదాపు రూ.7.3 కోట్లు)కు కొనేశారు. కానీ, తిరిగి తమ యూజర్లను వెనక్కి రప్పించుకోలేక కొన్నాళ్లకే పూర్తిగా మూసేశారు. అయితే 2015లో బెబో బ్లాబ్ పేరుతో మెసెంజర్ యాప్‌ను తీసుకొచ్చారు. ఏడాదిలోపే ఈ యాప్ దాదాపు 40లక్షల మంది యూజర్స్ సంపాదించింది. కానీ విఫలమై రెండేళ్లకే మూతపడింది. గతేడాది బెబోను అమెజాన్‌కి చెందిన ట్విచ్ ఇంటరాక్టివ్ 25 మిలియన్ డాలర్ల(ప్రస్తుత విలువ దాదాపు రూ. 184కోట్లు)కు కొనుగోలు చేసింది.
- ఇంటర్నెట్ డెస్క్