close

వార్తలు / కథనాలు

గూగుల్‌ పండగలో ఏం చెప్పారంటే...?

కొత్త ఉత్పత్తులు, సరికొత్త ఫీచర్ల గురించి వివరించడానికి గూగుల్‌ ఏటా i/o పేరుతో ఓ సదస్సు నిర్వహిస్తుంటుంది. ఈ ఏడాది జరిగిన సదస్సులో కొత్త ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ Q గురించి కొన్ని ఆసక్తికరమైన వివరాలు తెలియజేశారు. దీంతోపాటు గూగుల్‌ సెర్చ్‌, గూగుల్‌ లెన్స్‌, ప్రైవసీ, సెక్యూరిటీ గురించి వివరించారు. ఆ వివరాలు క్లుప్తంగా మీ కోసం...!

గూగుల్‌ సెర్చ్‌

త్రీడీ మోడల్‌ 

కొత్త ఫ్రిజ్‌ కొందామని గూగుల్‌లో సెర్చ్‌ చేశారు. వెంటనే వందల, వేల ఫ్రిజ్‌ల ఫొటోలు వచ్చేస్తాయి. వాటితోపాటు ఆన్‌లైన్‌ షాపింగ్‌ వెబ్‌సైట్ల లింక్‌లు వస్తాయి. ఇదంతా గతం... ఇప్పుడు వీటితోపాటు ‘వ్యూ ఇన్‌ త్రీడీ’ అని కొత్త ఆప్షన్‌ కనిపిస్తుంది. దాన్ని క్లిక్‌ చేస్తే మీరు కొనాలనుకుంటున్న వస్తువును త్రీడీ ఇమేజ్‌ రూపంలో కనిపిస్తుంది. దాన్ని 360 డిగ్రీల్లో ఎటు కావాలంటే అటు తిప్పి చూసుకోవచ్చు. కొనుక్కోవచ్చు. అంతేకాదు ఆ వస్తువును గూగుల్‌ కెమెరా ద్వారా మీ పరిసరాల్లో ప్లేస్‌ చేసి చూసుకోవచ్చు. అంటే మీ దుస్తుల పక్కన పెట్టి... కాంబినేషన్‌ బాగుందో లేదో చెక్‌ చేయవచ్చు. 

టాప్‌ ఫుడ్‌

పిక్సల్‌ ఫోన్లు, స్టాక్‌ ఆండ్రాయిడ్‌ ఫోన్లలో తొలుత వచ్చిన గూగుల్‌ లెన్స్‌... ఆ తర్వాత యాప్‌ రూపంలో మిగిలిన ఫోన్లలోకి వచ్చి చేరింది. ఈ లెన్స్‌ ద్వారా ఏదైనా వస్తువు మీద ఫోకస్‌ చేసి... స్క్రీన్‌ను టచ్‌ చేస్తే ఆ వస్తువుకు సంబంధించిన పూర్తి వివరాలు వస్తాయి.  అంటే మీరు ఏదైనా రెస్టరెంట్‌కి వెళ్లి... అక్కడ పరాయి భాషలో ఉన్న మెనూ కార్డు మీ లెన్స్‌ ఫోకస్‌ చేస్తే అవి మీ సొంత భాష (మీరు ఎంచుకున్న భాష)లో కనిపిస్తాయి. ఇప్పుడు దీనికి మరిన్ని అదనపు సొబగులు అద్దారు. మెనూ కార్డు మీద లెన్స్‌ను ఫోకస్‌ చేస్తే ఆ రెస్టరెంట్‌లో పాపులర్‌ డిష్‌ను హైలైట్‌ చేసి చూపిస్తాయి. 

లైవ్‌లో వంట

‘ఈనాడు ఆదివారం’లో ఓ వంట రెసిపీ చూశారు. బాగుంది కదా అని ఫొటో తీసి పెట్టుకున్నారు. ఇది కెమెరాతో చేసేపని. గూగుల్‌ లెన్స్‌తో అయితే ఆ వంటను ఫోకస్‌ చేస్తే దాని గురించి అదనపు వివరాలు తెలుస్తాయి. కానీ త్వరలో ఇలాంటి వంటల రెసిపీలను గూగుల్‌ లెన్స్‌తో ఫోకస్‌ చేస్తే... ఆ వంట తయారీకి సంబంధించిన వీడియో వచ్చేస్తుంది. ఎంచక్కా మీరు చూస్తున్న రెసిపీ బుక్‌ మీదనే ఆ వీడియో దర్శనమిస్తుంది. దీని వల్ల ఆ వంటను మీరు మరింత బాగా వండేయొచ్చు. ఈ నెలాఖరుకల్లా ఈ కొత్త ఫీచర్లు గూగుల్ సెర్చ్‌, గూగుల్‌ లెన్స్‌లోకి వస్తాయి. 

గూగుల్‌ అసిస్టెంట్‌

బుక్‌ చేసి పెడుతుంది

కార్లు, టికెట్ల బుకింగ్‌ లాంటివి సులభంగా చేసుకునేలా గూగుల్‌ డ్యూప్లెక్స్‌ సాంకేతికతను అభివృద్ధి చేసింది. దీని కోసం  మీరు గూగుల్‌ అసిస్టెంట్‌లోకి వెళ్లి ‘నా తర్వాతి ట్రిప్‌కి  కారు బుక్‌ చేయ్‌’ అనగానే మీ కేలండర్‌ యాప్‌లో మీ తర్వాతి ట్రిప్‌ని వెతికి పట్టి... దానికి తగ్గట్టుగా గూగుల్‌లో సెర్చ్‌ చేసి అక్కడి కార్లు అద్దెకిచ్చే సంస్థల పేర్లు చూపిస్తుంది. వాటిలో  అందులో మీరు ఎంచుకున్న సంస్థ నుంచి మీరు ఎక్కువగా వినియోగించే కారును ఎంపిక చేస్తుంది. మీరు ఓకే చేస్తే మీ వివరాలు అన్ని ఇచ్చి... పేమెంట్‌ ప్రక్రియ దగ్గరకు తీసుకొస్తుంది. ఇక డబ్బులు చెల్లిస్తే సరి. 

ఆఫ్‌లైన్‌లో కూడా

గూగుల్‌ అసిస్టెంట్‌ ఇప్పుడు మరింత శక్తిమంతం అవుతోంది. ప్రస్తుతం పని చేస్తున్న వేగం కన్నా పదింతలు ఎక్కువగా ఉండనుందని గూగుల్‌ చెబుతోంది. మల్టీ టాస్కింగ్‌కు అనువుగా అసిస్టెంట్‌ను రూపొందిస్తున్నారు. ఒకేసారి పది యాప్‌లను యాక్సెస్‌ చేసినా మంచి ఫలితాలు వచ్చేలా తీర్చిదిద్దుతున్నారు. దీంతోపాటు ఆఫ్‌లైన్‌లోనూ అసిస్టెంట్‌ వినియోగించేలా మార్పులు చేశారు. ఫ్లాష్‌లైట్‌ ఆన్‌ చేయడం, జీమెయిల్‌ ఓపెన్‌ చేయడం, కేలండర్‌ను యాక్సెస్‌ చేయడం లాంటివి ఆఫ్‌లైన్‌లో చేయొచ్చు. 
ఈ ఏడాది వచ్చే కొత్త పిక్సల్‌ ఫోన్‌లో కొత్త గూగుల్‌ అసిస్టెంట్‌ వచ్చేస్తుంది.

పర్సనల్‌ రిఫరెన్స్‌

‘మా అమ్మ వాళ్లింటికి వెళ్లడానికి ఎంత టైం పడుతుంది’ అని అంటే గూగుల్‌ అసిస్టెంట్‌ చెప్పగలదా? అంటే కష్టమే అని చెప్పాలి. ఎందుకంటే గూగుల్‌లో చాలామంది ఇలా ‘అమ్మ ఇల్లు’ అని సేవ్‌ చేసుకొని ఉంటారు. కానీ కొత్త అసిస్టెంట్‌లో ఈ ఇబ్బంది లేదు. ఎందుకంటే ఇందులో పర్సనల్‌ రిఫరెన్స్‌ తీసుకొస్తున్నారు. దీని ద్వారా మీ అసిస్టెంట్‌ మీ పరిధిలోనే నడుస్తుంది. ఉదాహరణకు గూగుల్‌ కాంటాక్ట్స్‌లో మీ అమ్మగారి డిటైల్స్‌తో సహా షేర్‌ చేస్తే ఆ తర్వాత అసిస్టెంట్‌ వాటికనుగుణంగా నడుచుకుంటుంది. ‘అమ్మ వాళ్లింటికి వెళ్లడానికి ఎంత సమయం పడుతుంది’ అని అసిస్టెంట్‌ను అడిగితే అది వెంటనే వివరాలు చెప్పేస్తుంది. అయ్యో ఇలా మన సొంత వివరాలు ఇచ్చేస్తే ఇబ్బందేమో అనుకోవడానికీ లేదు. ఎందుకంటే వీటిని సెట్టింగ్స్‌లోని ‘యు’ ట్యాబ్‌లోకి వెళ్లి డిలీట్‌ చేసేయొచ్చు.

డ్రైవింగ్‌ చేస్తున్నారా?

గూగుల్‌ అసిస్టెంట్‌లో డ్రైవింగ్‌ మోడ్‌ను తీసుకొస్తున్నారు. అసిస్టెంట్‌ను పలకరించి డ్రైవింగ్‌ మోడ్‌ ఆన్‌ చేయగానే... సరికొత్త డ్యాష్‌ బోర్డు కనిపిస్తుంది. ‘లెట్స్‌ డ్రైవ్‌’ అనగానే.. ఆ రోజు మీ ప్లాన్డ్‌ ప్రోగ్రామ్స్‌ ఉంటే ఆ ప్రదేశానికి గూగుల్‌ మ్యాప్స్‌ షార్ట్‌ కట్‌ వచ్చి చేరుతుంది. గతంలో మీరు సగం విన్న పాట, చూసిన వీడియో ఉంటే... దాని షార్ట్‌ కట్‌ కూడా వస్తుంది. మ్యాప్స్‌ ఆన్‌ చేసి డ్రైవింగ్‌ మొదలుపెట్టగానే.. పాటలు వినాలని అనిపిస్తే అసిస్టెంట్‌కు చెబితే మంచి పాటలు వినిపిస్తుంది. ఈలోగా ఎవరైనా ఫోన్‌ చేస్తే పాట ఆగిపోయి... ఎవరు కాల్‌ చేశారో చెబుతుంది. కాల్‌ కట్‌ చేయాలంటే మీరు ఎర్ర బటన్‌ క్లిక్‌ చేయక్కర్లేదు. అసిస్టెంట్‌కు చెబితే కట్‌ చేసేస్తుంది. మరికొన్ని రోజుల్లో ఈ డ్రైవింగ్‌ మోడ్‌ వచ్చేస్తుంది. 

ప్రైవసీ | సెక్యూరిటీ

తీసేయాలంటే తీసేయడమే

వినియోగదారుల ప్రైవసీ ఎప్పుడూ జాగ్రత్తలు తీసుకుంటూనే ఉంది. దీని కోసం ప్రైవసీ సెట్టింగ్స్‌లో మరింత అందుబాటులోకి తీసుకొస్తోంది. గూగుల్‌ సెర్చ్‌లోని ప్రొఫైల్‌ ఐకాన్‌ను క్లిక్‌ చేస్తే ‘యువర్‌ డేటా ఇన్‌ సెర్చ్‌’ అనే ఆప్షన్‌ కనిపిస్తుంది.  ఇందులో రీసెంట్‌ యాక్టివిటీని చూసుకోవచ్చు. దాన్ని ఆటోమేటిక్‌గా డిలీట్‌ చేసుకునేలా ఆప్షన్‌  తీసుకొచ్చారు. మీ సెర్చ్‌ డేటా ఎన్ని రోజులు ఉండాలనేది మీరే ఎంచుకోవచ్చు. గూగుల్‌ ప్రధాన యాప్స్‌లో త్వరలో ఈ ఫీచర్లు వస్తాయి.

ఎవరికీ కనిపించకుండా... 

గూగుల్‌ క్రోమ్‌, యూట్యూబ్‌లో ఎంతో ప్రజాదరణ పొందిన ఇన్‌కాగ్నిటో మోడ్‌ ఇప్పుడు గూగుల్‌ మ్యాప్స్‌లోకి కూడా వస్తోంది. మ్యాప్స్‌ యాప్‌ ఓపెన్‌ చేసి పైన ప్రొఫైల్‌ ఐకాన్‌ను క్లిక్‌ చేస్తే ఇన్‌కాగ్నిటో మోడ్‌ వస్తుంది. దాన్ని క్లిక్‌ చేసి వాడితే మీ సెర్చ్‌ డేటా సేవ్‌ అవ్వదు. తర్వాత దాన్ని ఎవరూ యాక్సెస్‌ చేయలేరు. త్వరలో ఈ ఫీచర్‌ను గూగుల్‌ సెర్చ్‌లో కూడా తీసుకొస్తున్నారు. 

యూజర్ల కోసం...

సబ్‌టైటిల్స్‌ తరహాలో
యూట్యూబ్‌లో ఏదో వీడియో ఓపెన్‌ చేశారు.. వాళ్లు మాట్లాడేది అర్థం కావడం లేదు. స్ట్రీమింగ్‌ యాప్స్‌లో ఏదో విదేశీ సినిమా చూస్తున్నారు. దానికి సబ్‌టైటిల్స్‌ లేవు. ఇలాంటి ఇబ్బందులు ఇక ఉండవు. ఎందుకంటే గూగుల్‌ లైవ్‌ క్యాప్షన్‌ ఆప్షన్‌ను తీసుకొస్తోంది. దీని ద్వారా ప్లే అవుతున్న వీడియోలోని మాటలను అక్షరాల రూపంలో అంటే సబ్‌టైటిల్స్‌ తరహాలో చూసేయొచ్చు.  వీడియో మీద కనిపించే చిన్న ఐకాన్‌ను క్లిక్‌ చేయడం ద్వారా లైవ్‌ క్యాప్షన్‌ సౌకర్యాన్ని పొందొచ్చు.

బధిరుల కోసం... 

వినికిడి శక్తి తక్కువగా ఉన్నవారి కోసం, పూర్తిగా లేనివారి కోసం గూగుల్‌ కొత్త ఆప్షన్‌ తీసుకొస్తోంది.  అదే లైవ్‌ రిలే. దీని ద్వారా బధిరుల పని సులభమవుతుంది. ఫోన్‌ కాల్స్‌ వస్తే మాట్లాడలేరు కాబట్టి... స్మార్ట్‌ రిప్లై, స్మార్ట్‌ కంపోజ్‌ ద్వారా ఫోన్‌లో అవతలి వ్యక్తి మాట్లాడిన మాటలను టెక్స్ట్‌ రూపంలో చూపిస్తుంది. తిరిగి టెక్స్ట్‌ టైప్‌ చేస్తే అవతలి వ్యక్తికి మాటల రూపంలో వినిపిస్తుంది. దీనికి ఇంటర్నెట్‌ కూడా అవసరం లేదు. 

ఆండ్రాయిడ్‌ ‘క్యూ’

కొత్త ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ (ఓఎస్‌) గురించి కార్యక్రమంలో కొన్ని విషయాలు వెల్లడించారు. కొత్త ఆండ్రాయిడ్‌ 5జీ నెట్‌వర్క్‌ని సపోర్టు చేస్తుంది. ఈ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 20 నెట్‌వర్క్స్‌ ఆండ్రాయిడ్‌తో 5జీ ని ప్రవేశపెట్టబోతున్నాయి. 

స్మార్ట్‌ రిప్లై ఆప్షన్‌ కూడా అందుబాటులోకి వస్తోంది. మీకు వచ్చే మెసేజ్‌లకు ఎలాంటి రిప్లై ఇవ్వాలనేది స్మార్ట్‌ రిప్లై సూచిస్తుంది. అంతేకాదు... మీకొచ్చిన మెసేజ్‌లోని విషయాన్ని బట్టి సంబంధిత యాప్‌ లింక్‌ను మెసేజ్‌ కింద చూపిస్తుంది. అంటే ఫలానా ప్రాంతానికి వెళ్దాం అని మీకు మెసేజ్‌ వస్తే... ఆ మెసేజ్‌ దిగువన గూగుల్‌ మ్యాప్స్‌ లింక్‌ వస్తుంది.

 ఆండ్రాయిడ్‌ ఫోన్లలోకి డార్క్‌ థీమ్‌ను తీసుకొస్తున్నారు. దీన్ని ఆన్‌ చేసుకుంటే మీ స్క్రీన్‌ డార్క్‌గా మారిపోతుంది. దీని వల్ల బ్యాటరీ వినియోగం కూడా తగ్గుతుంది.

 ఏదన్నా యాప్‌ను ఓపెన్‌ చేస్తే మీ లొకేషన్‌ పర్మిషన్ అడుగుతుంటుంది. అలా ఇచ్చిన తర్వాత మీరు యాప్‌ వాడకపోయినా ఇంకా పర్మిషన్‌ కొనసాగుతూనే ఉంటుంది. అలా చాలా రోజుల నుంచి వాడని యాప్స్‌ లొకేషన్‌ పర్మిషన్‌ తొలగించడానికి ఆండ్రాయిడ్‌ ఓ ఆప్షన్‌ తీసుకొచ్చింది. చాలా రోజుల నుంచి లొకేషన్‌ వాడుకుంటూ మీరు వినియోగించని యాప్‌ల గురించి ఎప్పటికప్పుడు మీకు తెలియజేసేలా కొత్త ఆండ్రాయిడ్‌లో సదుపాయం అందిస్తున్నారు. అలాగే ఐఓఎస్‌ తరహాలో మీరు ఆ యాప్‌ వాడుతున్నప్పుడు లొకేషన్‌ను యాక్సెస్‌ చేసేలా మార్పులు చేశారు. 

 ఫోన్‌లో అప్పుడప్పుడు యాప్స్‌ ఇన్‌స్టాల్‌ చేస్తుంటారు. కానీ తర్వాత వాటిని వాడరు. కానీ వాటి నోటిఫికేషన్లతో చిరాకు వస్తుంటుంది. అలాంటి వాటికి అడ్డుకట్ట వేసేలా ఆండ్రాయిడ్‌ ఫోకస్‌ మోడ్‌ను తీసుకొస్తోంది. ఈ ఆప్షన్‌లో ఎంచుకున్న యాప్స్‌ మిమ్మల్సి డిస్ట్రబ్‌ చేయవు. 

- ఇంటర్నెట్‌ డెస్క్‌


Tags :

మరిన్ని