close

వార్తలు / కథనాలు

ఆయన వాయుసేన బంగారు బాణం..!

స్ఫూర్తిమంతం.. ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ప్రస్థానం

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం: ‘‘నేనూ విమానం నుంచి ఎజెక్ట్‌ అయ్యాను.. మనోడు ఎజెక్ట్‌ అయ్యాడు.. నేను తిరిగి రావడానికి ఎనిమిది నెలలు పడితే.. మన వర్థమాన్‌ తిరిగి వచ్చేందుకు ఆరునెలలలోపే పట్టింది.’’ ఇవి వింగ్‌కమాండర్‌ అభినందన్‌లో ధైర్యం నింపేందుకు ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ బీఎస్‌ ధనోవా చేసిన వ్యాఖ్యలు. ఒక తండ్రి బిడ్డకు ధైర్యం చెబుతున్నట్లు ఉన్న ఆ మాటలు విని ఆశ్చర్యపోవడం అక్కడున్న విలేకర్ల వంతైంది. ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌గా నేటితో పదవీ విరమణ చేస్తున్న  ధనోవా ప్రస్థానం చాలా స్పూర్తిమంతంగా ఉంటుంది.  

మనం చేస్తున్న దానిలో రాణించాలంటే చేయాల్సింది ఒక్కటే..  చేస్తున్న పనిని ప్రేమించడం. అంతే విజయాలు వాటంతట అవే వస్తాయి. బీరేంద్ర సింగ్‌ ధనోవా కూడా చేసింది అదే. ఇటీవల కాలంలో వచ్చిన ఎయిర్‌ చీఫ్‌ మార్షల్స్‌లో ఆయనకు ప్రత్యేక స్థానం ఉంది. దాదాపు నలభై ఏళ్ల తర్వాత పాక్‌లోని శత్రుస్థావరాలపై భారత విమానాలు విరుచుకుపడటం వెనుక ఆయన కీలక పాత్ర పోషించారు. గతంలో అది ఆపరేషన్‌ సఫేద్‌ సాగర్‌ కావచ్చు.. ‘బాలాకోట్‌’ను విజయవంతం చేయడం కావచ్చు.. ఏదైనా కానీ నిబద్ధతతో పూర్తి చేశారు. 

ఐఏఎస్‌ కుటుంబం నుంచి వచ్చి..

ధనోవా 1957లో దేవగఢ్‌లో జన్మించారు. ఆ ప్రాంతం ఇప్పుడు ఝార్ఖండ్‌లో ఉంది. ఆయన తండ్రి సొరైన్‌ సింగ్‌ ఐఏఎస్‌ ఆఫీసర్‌. ఆయన పంజాబ్‌, బిహార్‌లకు సీఎస్‌గా పనిచేశారు. ధనోవా తాత రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్‌ ఇండియన్‌ ఆర్మీలో పనిచేశారు. ధనోవా విద్యాభ్యాసం పేరున్న పాఠశాలలు, కాలేజీలో జరిగింది. ఆయన డెహ్రడూన్‌లోని ఇండియన్‌ మిలటరీ కాలేజీ, పుణెలోని ఎన్‌డీఏలో విద్యాభ్యాసం చేశారు. వెల్లింగ్‌టన్‌లోని డిఫెన్స్‌ సర్వీసెస్‌ కాలేజీ నుంచి స్టాఫ్‌ కోర్సు పూర్తి చేశారు. 1978లో వాయుసేనలోని ఫైటర్‌ స్ట్రీమ్‌లో చేరారు. ఆయనకు హెచ్‌జేటీ 16 కిరణ్‌, మిగ్‌ 21, జాగ్వర్‌, మిగ్‌ 29, సు 30 ఎంకేఐలను నడిపిన అనుభవం ఉంది.  1988లో తాను నడుపుతున్న విమానం కూలిపోతే దాని నుంచి ధనోవా సురక్షితంగా బయటపడ్డారు. 

‘ఆపరేషన్‌ సఫేద్‌ సాగర్‌’ వ్యూహకర్త..

కార్గిల్‌ యుద్ధం సమయంలో పదాతి దళానికి మద్దతుగా భారత వాయుసేన ఉగ్రస్థావరాలపై నిర్వహించి ‘ఆపరేషన్‌ సఫేద్‌ సాగర్‌’కు ధనోవానే కమాండింగ్‌ ఆఫీసర్‌గా వ్యవహరించారు. ఆ సమయంలో ఆయనే స్వయంగా నిఘా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గగనతలంపై నుంచి పర్వాతాల్లో నక్కిన ఉగ్రవాదులపై దాడి చేయడం ధనోవా ముందున్న లక్ష్యం. పూర్తిగా పర్వతాలతో నిండిపోయిన కార్గిల్‌ ప్రాంతంలో ధనోవా నేతృత్వంలోని ‘గోల్డెన్‌ యారోస్‌’ (వాయుసేన 17 స్క్వాడ్రన్‌) దాడులు చేసింది. వాయుసేనలోనే ఇది అత్యున్నత స్క్వాడ్రన్‌గా నిలిచింది. అర్ధరాత్రి వేళ వీరి బృందం అత్యంత ఎత్తైన పర్వత సానువుల్లో బాంబుల వర్షం కురిపించింది. దీంతో మన పదాతి దళాలు ముందుకు కదిలాయి. గత వాయుపోరాటాల చరిత్రలో అంత ఎత్తైన ప్రదేశాల్లో రాత్రి వేళల్లో ఎప్పుడూ దాడి చేయలేదు. కార్గిల్‌తోనే ఇది మొదలైంది. ఇప్పుడు కొత్తగా వాయుసేనకు అందే రాఫెల్‌ యుద్ధవిమానాలను కూడా ఇదే స్క్వాడ్రన్‌కు ఇచ్చే అవకాశం ఉంది. 

‘బాలాకోట్‌’ దాడులకు నేతృత్వం..

పుల్వామాలో సీఆర్‌పీఎఫ్‌ బలగాలపై దాడి జరిగిన వెంటనే దేశంలోని అత్యున్నత నాయకత్వం దీనికి జవాబు చెప్పాలని నిర్ణయించింది. భారత్‌-పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు తారస్థాయిలో ఉన్న సమయంలో ప్రపంచంలోని అన్ని నిఘా సంస్థల దృష్టి భారత్‌-పాక్‌లపైనే ఉంది. ఆ సమయంలో కూడా అత్యంత రహస్యంగా బాలాకోట్‌కు విమానాలను పంపి జైషే శిక్షణ శిబిరాన్ని నేలమట్టం చేయించారు. ఇది ధనోవా వ్యూహచతురతకు అద్దం పడుతుంది. 

ఒక్కమాటలో వంద అర్థాలు..

బాలాకోట్‌ దాడుల తర్వాత మృతుల సంఖ్యపై వివాదం అవుతున్న సమయంలో ‘శవాలు లెక్కపెట్టడం మా పనికాదు’ అంటూ విమర్శకులకు ఒక పంచ్‌ ఇచ్చారు. ఆ తర్వాత ఆ వివాదం మెల్లగా సద్దుమణిగింది. హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ జాప్యం కారణంగా యుద్ధవిమానాలు తయారీ ఆలస్యమవుతోందని ఆయన సున్నితంగా నిర్మొహమాటంగా చెప్పేశారు. అలాగని ఆయన కెరీర్‌లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సందర్భం ఒక్కటీ లేదు. పూర్తి క్రమశిక్షణతో మాట్లాడేవారు. ఇటీవల పాక్‌ వాయుసేన భారత్‌ చీకట్లో దాడి చేసింది. ‘మేం పగలు దాడి చేశాం’ అని జబ్బలు చరుచుకుంది. దీన్ని ఉద్దేశించి ధనోవా ఇచ్చిన సమధానంతో పాక్‌ పరువు పోయింది. ఆయన ‘ఇండియాటుడే’ కాంక్లేవ్‌లో ఇటీవల మాట్లాడుతూ ‘పాక్‌కు రాత్రిపూట దాడి చేసే సామర్థ్యం లేదు. అందుకే పగలు వచ్చింది. భారత్‌కు రాత్రివేళల్లో కూడా దాడి చేసే సామర్థ్యం ఉందని బాలాకోట్‌ దాడులు చెప్పాయి’ అని పేర్కొన్నారు. ఇరాక్‌పై యుద్ధంలో అమెరికా కూడా రాత్రిపూటే దాడి చేసిందనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

బలగాలకు ధైర్యం ఇవ్వడంలో ఎప్పుడూ ముందే..

ఒక నాయకుడిగా తన కింద పనిచేసే బలగాలకు ధైర్యం ఇవ్వడంలో ధనోవా ఎప్పుడూ ముందుండేవారు. చాలా ఘటనలు ఈ విషయాన్ని చెబుతాయి. అభినందన్‌ వర్థమాన్‌ విమానం పీవోకే కూలిపోయిన విషయం తెలియగానే ధనోవా వేగంగా స్పందించారు. అభినందన్‌ తండ్రికి ఫోన్‌ చేసి ‘‘వర్థ సర్‌.. మనం అజయ్‌ అహూజను తీసుకురాలేకపోయాం.. అభినందన్‌ను తీసుకొస్తాం’’ అని చెప్పారు. (కార్గిల్‌ యుద్ధ సమయంలో భారత పైలట్‌ అజయ్‌ అహూజా విమానం కూలిపోవడంతో పాక్‌ సైన్యానికి చిక్కారు. ఆయన్ను వెంటనే పాక్‌ సైనికులు హత్య చేశారు.) ఆ కుటుంబంలో ధైర్యం నింపడానికే ఆయన ఆ రోజు కాల్‌చేశారు. అదే సమయంలో మరణించిన పాక్‌ పైలట్‌ను ఆ దేశంలో పట్టించుకున్న వారు లేరు. 
అభినందన్‌ వర్థమాన్‌ తిరిగి వచ్చాక విశ్రాంతి తీసుకొని విధుల్లో చేరినప్పుడు కూడా ప్రోత్సహించారు. తన చివరి సార్టి (విమానలో ప్రయాణిచడం)ని కూడా వర్థమాన్‌తో కలిసి మిగ్‌-21బైసన్‌లో చేయడం విశేషం. ఈ సందర్భంగా ధనోవా మాట్లాడుతూ ‘‘మేం ఇద్దరం పాక్‌తో పోరాడాం. ఇద్దరం కూలుతున్న విమానం నుంచి బయటపడ్డాం. నేను తిరిగి రావడానికి 8 నెలలు పడితే వర్థమాన్‌ రావడానికి 6 నెలలలోపే పట్టింది’’ అని పేర్కొన్నారు. ఇదంతా అభినందన్‌లో ధైర్యం నింపడానికే.

ఇటీవల వాయుసేనలో శిక్షణ పూర్తి చేసుకొని టాపర్‌గా నిలిచిన జి.నవీన్‌ కుమార్‌ రెడ్డికి ధనోవా ఒక మరపురాని బహుమతి ఇచ్చారు. ‘స్వోర్డ్‌ ఆఫ్‌ ఆనర్‌’ సమయంలో ధనోవా తన చొక్కాపై ఉన్న వింగ్స్‌(బ్యాడ్జ్‌)ను శిక్షణలో టాపర్‌గా నిలిచిన నవీన్‌ చొక్కాకు పిన్‌ చేశారు. ‘‘నేను సెప్టెంబర్‌లో యూనిఫాం తీసేస్తాను. అప్పుడు నా చొక్కాపై ఉన్న వింగ్స్‌ ఒక యువ ఆఫీసర్‌పై దుస్తులపై ఉంటాయి. అతడికి ఒడుదొడుకుల్లో కూడా తోడుంటాయి’’ అని పేర్కొన్నారు. ఆయన వాయుసేనను ఎంతగా ప్రేమిస్తారో చెప్పేందుకు ఈ ఘటన చాలు. దటీజ్‌ ధనోవా!!


Tags :

మరిన్ని