close

వార్తలు / కథనాలు

అలాంటి వాటికి కూడా పన్ను వేస్తారా..?

అధికార మదంతోనో, ప్రభుత్వ ఖజానా నింపాలనో ప్రజలపై అనేక రకాల పన్నులు, జరిమానాలు విధించిన రాజుల గురించి, ప్రభుత్వాల గురించి చరిత్రలో చదివాం. మన దేశాన్ని పాలించిన బ్రిటీష్‌వాళ్లు కూడా ఉప్పుపై కూడా పన్ను విధించి వారి పైశాచికత్వాన్ని ప్రదర్శించారు. అలాగే వస్తువులు, సేవలు తదితరవాటిపై ప్రపంచవ్యాప్తంగా రాజ్యాలు, ప్రభుత్వాలు పన్నులు, జరిమానాలు విధించాయి. వాటిల్లో కొన్ని ప్రజలను దారుణంగా ఇబ్బంది పెట్టేవిగా ఉంటే.. మరికొన్ని విచిత్రంగా.. ఔరా! అని ముక్కున వేలేసుకునే విధంగా ఉన్నాయి. అలా అనిపించిన కొన్ని పన్నులు, జరిమానాల గురించి..

నూనెపై పన్ను.. కట్టాకే తిను
తొలి శతాబ్దంలో ఈజిప్టులో వంటనూనెపై పన్ను విధించేవాళ్లు. పన్ను వసూలు చేసే వ్యక్తులు ఇంటింటికి వెళ్లి తనిఖీలు చేసేవారు. పన్ను ఎగ్గొట్టడానికి వాడిన నూనెనే మళ్లీ వాడటం, లేదా ఇతర ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నారా అని పరిశీలించేవారు. అయితే ఆ కాలంలో డబ్బులు చలామణీలో లేవు కాబట్టి పన్నుల కింద ప్రజలు పండించిన పంటను, వారి ఆస్తులను లాక్కునేవారు. ఈజిప్టులో విధించిన తొలి పన్ను ఇదేనట.
పెళ్లి చేసుకో లేదంటే.. పన్ను కట్టుకో!
వివాహం చేసుకోవడం.. చేసుకోకపోవడం వ్యక్తిగత విషయం. కానీ, ఓ రోమన్‌ చక్రవర్తి ఆ విషయంలో జోక్యం చేసుకున్నాడు. క్రీ.శ 9లో రోమన్‌ చక్రవర్తి అగస్టస్‌ బ్రహ్మచారులకు పన్నులు విధించాడు. దీనికీ ఓ కారణం ఉంది. అదేంటంటే.. వివాహం చేసుకోకుండా ఉన్న యువకులు అత్యాచారాలకు, అసాంఘిక చర్యలకు పాల్పడే అవకాశం ఎక్కువ ఉంటుందట. అందుకే పన్ను భారం భరించలేక వివాహం చేసుకొని సమాజంలో బాధ్యతతో మెలుగుతారని అగస్టస్‌ భావించాడు.
పారిపోవాలనుకున్నా.. పైసలు కట్టాల్సిందే!
రణరంగంలోకి దిగిన సైనికుడికి మృత్యువు కళ్లెదురుగానే ఉంటుంది. అయినా పోరాడాలి. చావో రేవో తేల్చుకోవాలి. అయితే 12-14 శతాబ్దాల కాలంలో ఇంగ్లాండ్‌ చక్రవర్తి హెన్రీ-I తన సైన్యంలోని సైనికులకు బంపర్‌ ఆఫర్‌ ఇచ్చాడు. యుద్ధంలో పాల్గొనడం ఇష్టం లేని సైనికులు కొంత డబ్బును ‘స్కూటేజ్‌ ట్యాక్స్‌’గా చెల్లించి యుద్ధక్షేత్రం నుంచి బయటికి వెళ్లిపోవచ్చు. ఈ పన్ను విధానం ఫ్రాన్స్‌, జర్మనీలోనూ ఉండేది. అయితే 14 శతాబ్దంలో ఈ విధానాన్ని పూర్తిగా తొలగించారు.
గడ్డం పెంచితే.. పన్ను వడ్డించారు
1535-1772 కాలంలో ఇంగ్లాండ్‌ను పాలించిన కింగ్‌ హెన్రీ-VIII గడ్డంపై పన్ను విధించాడు. దాదాపు ఇలాంటి విధానమే రష్యాలోనూ కొనసాగింది. అయితే గ్రేట్‌ ఆఫ్‌ రష్యాగా పిలవబడే పీటర్‌ కొన్ని మార్పులు చేశారు. గడ్డం పెంచుకోవాలనుకునే వారు.. పన్ను చెల్లించనవసరం లేదు. కానీ.. ‘గడ్డం అనేది అనవసరమైన భారం’ అనే ముద్రించి ఉన్న నాణాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దాన్ని కొన్న ఎవరైనా గడ్డం పెంచుకోవచ్చన్నమాట. అయితే ఈ తరహా విధానం 1772లో పూర్తిగా మాయమైపోయింది.
న్యాయవాదికి ఫీజు+పన్ను
మనకేదైనా అన్యాయం జరిగితే న్యాయవాదిని నియమించుకొని పోరాటం చేస్తాం. ఇందుకోసం అతనికి ఫీజు చెల్లిస్తాం. కానీ.. న్యాయవాదిని నియమించుకోవాలంటే పన్ను చెల్లించాల్సిన విధానం ఫ్రాన్స్‌లో ఉండేది. 1667లో ఈ పన్నును అమలు చేశారు. ఎవరైనా సరే న్యాయవాదిని నియమించుకోవాలంటే 13 యూరోలు చెల్లించాల్సి వచ్చేది. అయితే, అలా పన్ను రూపంలో వచ్చిన డబ్బును న్యాయవాదుల పెన్షన్‌కు వినియోగించేవారట.
సబ్బులు వాడితే.. చమురు వదలాల్సిందే..
సబ్బుల తయారీలో భాగంగా కంపెనీలు మన నుంచి పన్నులు వసూలు చేయడం సహజమే. బ్రిటన్‌లో 1711లో సబ్బు వాడాలంటే ప్రజలు పన్ను కట్టాలని చట్టం చేశారు అప్పటి పాలకులు. దీంతో కొన్ని దశాబ్దాల పాటు సబ్బు చాలా ఖరీదైన వస్తువుగా కొనసాగింది. 1835లో బ్రిటన్‌ ప్రధానిగా ఉన్న విలియమ్‌ గ్లాడ్‌స్టోన్‌ ఈ పన్ను విధానాన్ని ఎత్తివేశారు.
టోపీలు పెట్టుకుంటే.. జేబుకు చిల్లే
యూకేలో ఒకప్పుడు టోపీలు పెట్టుకున్నా జేబు ఖాళీ అయ్యేది. ఎందుకంటే 1784లో అప్పటి యూకే ప్రధాని విలియమ్‌ పిట్‌ పురుషులు ధరించే టోపీపై పన్ను విధించాడు. టోపీ పెట్టుకోవాలంటే.. టోపీ ధరకు తగ్గ పన్ను కట్టి.. టోపీలో రెవెన్యూ స్టాంప్‌ అతికించి పెట్టుకోవాలి. ఎవరైనా సరే రెవెన్యూ స్టాంప్ లేకుండా దొరికారంటే వారికి ఉరిశిక్షే. అయితే ఈ పన్ను విధానాన్ని 1811లో రద్దు చేశారు.
నీడ  పడిందా.. నిండా మునిగినట్టే
1993లో ఇటలీలో ఓ వినూత్న పన్నులకు శ్రీకారం చుట్టారు అక్కడి ప్రభుత్వ అధికారులు. ప్రజలు నిత్యం నడిచే రోడ్లకు ఇరువైపుల ఉండే దుకాణాదారులకు ఇదో పెద్ద తలనొప్పిగా మారింది. ఎందుకంటే దుకాణం వివరాలు తెలిపే సైన్‌ బోర్డు నీడ రోడ్డుపై పడితే దుకాణదారు నుంచి ప్రభుత్వం 100 యూరోలను జరిమానాగా వసూలు చేసేది. సైన్‌బోర్డులే కాదు.. దుకాణంలోని ఏ వస్తువుదైనా నీడ రోడ్డుపై పడితే.. ఇలా డబ్బులు వసూలు చేసేవారు.
సిగరెట్‌ తాగితే.. కాదు తాగకపోతేనే
ఎక్కడైనా సిగరెట్‌ తాగితే జరిమానా విధిస్తారు. కానీ, చైనాలోని హుబీ ప్రావిన్స్‌లో సిగరెట్‌ అలవాటు లేని ప్రజలు జరిమానా కట్టాల్సి వచ్చింది. చైనాలో అత్యధిక రెవెన్యూ సిగరెట్‌ అమ్మకాలపై విధించే పన్నుల ద్వారానే వస్తుందట. దీంతో 2009లో హుబీ ప్రావిన్స్‌ ప్రభుత్వం సిగరెట్ల అమ్మకం పెంచేందుకు చర్యలు తీసుకుంది. ధూమపానం చేసేవారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రత్యేక కోటా అమలు చేసింది. సిగరెట్‌ తాగని వారికి జరిమానాలు విధించింది.
సూర్యుడిని చూడాలంటే ఒక యూరో చెల్లించాలి
బలేయారిక్‌ ఐలాండ్స్‌ను ఏటా లక్షల మంది పర్యాటకులు సందర్శిస్తుంటారు. అక్కడ సూర్యోదయం, సూర్యాస్తమయం వేళల్లో వాతావారణం అద్భుతంగా ఉంటాయి. అందుకే పర్యాటకులు సూర్యుడిని చూడాలనుకుంటే రోజు మొత్తానికి ఒక యూరో చెల్లించాలి. ఇలా వసూలైన మొత్తాన్ని ఐలాండ్‌లో పర్యాటకాభివృద్ధికి ఖర్చు చేస్తారట.

 


Tags :

మరిన్ని