
వార్తలు / కథనాలు
ఇంటర్నెట్ డెస్క్: మిడతలతో రైతులకు నష్టాలే గానీ.. లాభం ఎలా ఉంటుందని అనుకుంటున్నారా?నిజమేనండి.. మిడతలు పంటలపై దాడి చేసి రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తుంటాయి. గతేడాది మన ఉత్తరభారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో మిడతల దండు దాడి చేసి పంటలను నాశనం చేశాయి. చేతికొచ్చిన పంటలు మిడతలపాలు కావడంతో రైతులు కన్నీరుమున్నీరయ్యారు. ఇలాంటి ఘటనలు కెన్యా దేశంలో తరచూ జరుగుతూనే ఉంటాయి. సీజనల్‌గా మిడతలు పంటలపై దాడి చేస్తుంటాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతుంటారు. అయితే, ఎక్కడ పోగొట్టుకుంటున్నామో.. అక్కడే వెతుక్కోవాలి అన్నట్లుగా.. మిడతల కారణంగా నష్టపోయిన కెన్యా రైతులు.. ఆ మిడతల ద్వారానే లాభం పొందుతున్నారు. ఎలా అంటారా..!
మిడతల్ని దాణా.. ఎరువుగా మార్చి
మిడతల్లో ప్రోటీన్లు.. ఇనుము, జింక్, మెగ్నీషియమ్ వంటి ఖనిజాలు మెండుగా ఉంటాయి. కాబట్టి వీటిని జంతువులకు దాణాగా వేయొచ్చు. అలాగే సేంద్రియ ఎరువుగాను ఉపయోగించవచ్చని నిపుణులు చెబుతారు. దీనిపై బాగా అధ్యయనం చేసిన లారా స్టాన్ఫోర్డ్ అనే వ్యక్తి ‘ది బగ్ పిక్చర్’ పేరుతో స్టార్టప్‌ను ప్రారంభించారు. ఈ సంస్థ.. పంటలను నాశనం చేస్తున్న మిడతల్ని సేకరించి వాటిని పౌడర్‌గా మార్చి దాణా.. ఎరువుల రూపంలో విక్రయిస్తుంటుంది. మిడతలకు ఆహారపరంగా.. సంతానోత్పత్తికి కెన్యాలో అనువైన వాతావరణం ఉంటుంది. అక్కడి సముద్రం నుంచి వీచే వేడి గాలుల ద్వారా కురిసే వర్షం నిద్రాణస్థితిలో ఉండే మిడతల గుడ్లను మేల్కోపుతుంది. అక్కడి తుపానులను మిడతల సమూహం ధీటుగా ఎదుర్కొనగలవు. అందుకే కెన్యాకు మిడతల గుంపు తరచూ వస్తుంటాయి. ముఖ్యంగా లైకిపీయా, ఇసియొలో, సంబూరి, సెంట్రల్ కెన్యా ప్రాంతాల్లో మిడతల సమస్య ఎక్కువగా ఉంటుంది.
రైతులతో ఒప్పందాలు
ఈ నేపథ్యంలో బగ్ పిక్చర్ సంస్థ మిడతల సమస్య ఎక్కువున్న ప్రాంతాల్లోని రైతులతో ఒప్పందాలు చేసుకుంటోంది. రైతులు పంటలకు బదులు.. మిడతల్నే పెంచాలని కోరుతోంది. అలా రైతులు పెంచిన మిడతల్ని కిలో 50 కెన్యన్ షిల్లింగ్స్ చొప్పున బగ్ పిక్చర్ సంస్థే కొనుగోలు చేస్తుంది. వాటిని మిల్లుల్లో అధిక ప్రోటీన్లు ఉన్న జంతువుల దాణా, ఎరువుగా మార్చుతోంది. మిడతల వల్ల పంట నష్టాలను చవిచూసిన రైతులు.. ఇప్పుడు మిడతల్నే పంటగా మార్చుకొని ఆదాయం పొందేలా మా వంతు ప్రయత్నం చేస్తున్నామని లారా స్టాన్‌ఫొర్డ్ వెల్లడించారు.