close

వార్తలు / కథనాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
చెట్లకూ ఓ దవాఖానా!

ఇంటర్నెట్‌ డెస్క్‌: మనుషుల దవాఖానా తెలుసు.. జంతువుల దవాఖానా తెలుసు.. ఈ చెట్ల దవాఖానా ఏంటని ఆశ్చర్యంగా ఉందా?మనుషులు.. జంతువులతోపాటు చెట్లకూ ప్రాణముంటుంది.. మరి వాటి ప్రాణాలు కాపాడటానికి ఆస్పత్రి ఉండాలి కదా! అందుకే పంజాబ్‌కు చెందిన ఓ ఐఆర్‌ఎస్‌ అధికారి ఏకంగా తన ఇంట్లోనే చెట్ల ఆస్పత్రిని ప్రారంభించాడు. తన పరిసర ప్రాంతాల్లో ఏ చెట్టు అనారోగ్యానికి గురైనా దానికి ఔషధాలు ఇచ్చి బాగు చేస్తున్నాడు. అత్యవసర సేవల కోసం అంబులెన్స్‌ సైతం ఏర్పాటు చేయడం విశేషం.

ఆయన.. గ్రీన్‌ మ్యాన్‌ ఆఫ్ ఇండియా

అమృత్‌సర్‌లో నివసించే రోహిత్‌ మెహ్రా దేశానికి సుపరిచితమే. ఇప్పటి వరకు ఆయన దేశవ్యాప్తంగా అనేక చోట్ల మొక్కలను నాటించి.. వాటిని సంరక్షించి 75 అడవులను సృష్టించాడు. ఒక్కో అటవీప్రాంతం విస్తీర్ణం 2వేల చదరపు అడుగుల నుంచి 66వేల చదరపు అడుగుల వరకు ఉంటుంది. అంతేకాదు.. దేశంలో వర్టికల్‌ గార్డెన్స్‌(గోడలపై నిలువు వరుసలో చెట్ల పెంపకం)ను ప్రోత్సహిస్తున్నాడు. అందుకే ఆయన్ను ‘గ్రీన్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా’గా పిలుస్తుంటారు. 

ఇళ్లలో పెంచుకునే చెట్ల కోసం..

ఇళ్లలో మనం పెంచుకునే చెట్లకు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. తెగులు పట్టడం, కాండం తొలచడం వంటి వ్యాధులు సోకుతుంటాయి. దీంతో వాటి పెరుగుదల తగ్గిపోతుంది. వ్యవసాయ క్షేత్రాల్లో అయితే వ్యవసాయ నిపుణులు, శాస్త్రవేత్తలు పరిష్కారాలు చూపుతారు. మరి సాధారణంగా ఇళ్లలో పెంచుకునే చెట్ల పరిస్థితిని ఎవరు పట్టించుకుంటారు? ఈ ఆలోచనతోనే రోహిత్‌ మెహ్రా చెట్ల ఆస్పత్రిని ప్రారంభించాడు. ప్రజలు వారి ఇళ్లలో పెంచుకునే చెట్లకు ఎలాంటి వ్యాధులు సోకినా.. తనను సంప్రదిస్తే చెట్లకు చికిత్స చేసి నయం చేస్తున్నాడు. అత్యవసరమైతే తాను ఏర్పాటు చేసుకున్న అంబులెన్స్‌లో వెళ్లి సేవలందిస్తాడు.

వృక్షాయుర్వేదం.. మియవాకి పద్ధతిలో వైద్యం

రెవెన్యూ ఆఫీసర్ అయిన రోహిత్‌ చెట్ల పంపకం.. వాటి వ్యాధులకు తగిన చికిత్స కోసం వృక్షశాస్త్రాన్ని అధ్యయనం చేశాడు. వృక్షాలకు సంబంధించిన వృక్షాయుర్వేద సహా అనేక ప్రాచీన పుస్తకాలు చదివాడు. అలాగే చెట్ల రోగాలను నయం చేసేందుకు జపనీయులు ఉపయోగించే మియవాకి అనే పద్ధతి గురించి తెలుసుకున్నాడు. అయినా.. చెట్లకు చికిత్స చేయాల్సి వచ్చినప్పుడు ఆధునిక వృక్షశాస్త్ర నిపుణుల సలహాలు సూచనలు తీసుకుంటాడు.

ప్లాస్టిక్‌ నిర్మూలనలో భాగంగా.. వర్టికల్‌ గార్డెన్స్‌

గతంలో రోహిత్‌ ఏర్పాటు చేసిన వర్టికల్‌ గార్డెన్స్‌ లూధియానా ప్రజలను బాగా ఆకట్టుకుంటున్నాయి. ప్లాస్టిక్‌ బాటిళ్లను పారేయకుండా.. వాటిలో మట్టి నింపి, మొక్కలు నాటి గోడ నిండా పేర్చేవాడు. రోహిత్‌ ఆలోచన నచ్చి లూధియానా వ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు, గురుద్వారాలు, చర్చ్‌లు, పోలీస్‌ స్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాలు, రైల్వేస్టేషన్లలో ఈ వర్టికల్‌ గార్డెన్స్‌ ఏర్పాటు అయ్యాయి. ప్రస్తుతం రోహిత్‌ ఈ చెట్ల ఆస్పత్రిపై దృష్టి పెట్టాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు