
వార్తలు / కథనాలు
భారత్-నేపాల్‌ల మధ్య వివాదస్పదంగా మారిన కాలాపానీ ప్రాంతం తమదేని భారత్‌లోని నేపాల్ రాయబారి నిలాంబార్ ఆచార్య ప్రకటించారు. ఈ వివాదాన్ని పెద్దది చేయకుండా పరిష్కారంచేయాల్సిన బాధ్యత భారత్‌పై ఉందన్నారు. ఇటీవలే భారత్ కొత్త మ్యాప్‌ను విడుదల చేయడంతో నేపాల్‌లో నిరసనలు తలెత్తాయి.
ఏమిటీ ‘కాలాపానీ’
భారత్-నేపాల్ సరిహద్దుల్లో ఉన్ కాలాపానీ ప్రాంతం రెండు దేశాల మధ్య వివాదంగా ఉంది. ఉత్తరాఖండ్‌లోని పితోడ్‌గఢ్ నేపాల్‌లోని దర్చులా జిల్లాలకు సరిహద్దుగా ఉంది. మహాకాళి నది ఈప్రాంతం నుంచి ప్రవహిస్తోంది. 1816లో సుగౌలీ ఒప్పందం ప్రకారం మహాకాళీ నదిని నేపాల్ పశ్చిమ సరిహద్దుగా గుర్తించారు. మహాకాళీ నదిలో కాలపానీ వద్ద అనేక ఉపనదులు కలుస్తాయి. ఈ ప్రాంతం ట్రై జంక్షన్ లాంటింది. నేపాల్, చైనా, భారత సరిహద్దులు ఇక్కడ కలుస్తాయి. దీంతో రక్షణపరంగా దీనికి కీలకప్రాధాన్యత ఉంది. భూటాన్‌లోని డోక్లాంకు ఎంతటి ప్రాధాన్యత ఉందో కాలాపానీకి కూడా అంతే గుర్తింపు ఉంది.
ఇద్దరి వాదనలు ఇలాగున్నాయి..
కాలాపానీలోనే మహాకాళి నది జన్మిస్తుంది కాబట్టి పశ్చిమ భాగం మొత్తం భారత్‌కు చెందినదని భారత్ వాదిస్తోంది. అయితే లిపుగడ్‌కు తూర్పు ప్రాంతమంతా నేపాల్ కిందకు వస్తోందని ఆ దేశం వాదిస్తోంది. 1830కు సంబంధించిన పితోర్‌గఢ్ రికార్డులను భారత్ తన మద్దతుగా బయటపెట్టింది. 1879లో బ్రిటిషు ఇండియా అధికారులు రూపొందించిన చిత్రపటం మేరకు కాలాపానీ మొత్తం ప్రదేశం భారత్‌లోనే ఉండటం గమనార్హం. నేపాల్‌కు చెందిన ఒక అంగుళం భూమి కూడా భారత్ ఆక్రమించుకోదని భారత్ ఇది వరకే స్పష్టంచేసింది. ఈ సమస్యపై ద్వైపాక్షికచర్చలు జరగాలని రక్షణరంగ నిపుణులు సూచిస్తున్నారు.
పొంచివున్న చైనా..
ఈ ప్రదేశంలో ఎలాగైనా కాలుపెట్టాలని చైనా యోచిస్తోంది. ఇప్పటికే నేపాల్‌తో పలు వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్న చైనా రక్షణ పరంగాను వ్యూహాలు పన్నుతోంది. ట్రైజంక్షన్‌గా ఉండటంతో కాలాపానీలో కాలుపెడితే పైచేయి సాధించవచ్చని చైనా యోచన.
మ్యాపుతో మళ్లీ తెరపైకి..
నవంబరు2, 2019న భారత ప్రభుత్వం కొత్త కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్ముకశ్మీర్, లద్దాఖ్‌లను సూచిస్తూ మ్యాపును విడుదల చేసింది. రేఖాపటంలో పాక్ ఆక్రమిత కశ్మీర్ కూడా ఉంది. 1962 భారత్-చైనా యుద్దం నాటి నుంచి కాలాపానీ భారత్ ఆధీనంలో ఉంది.
- ఇంటర్నెట్‌డెస్క్ ప్రత్యేకం