
వార్తలు / కథనాలు
సాధారణంగా రెండు కంటే ఎక్కువ భాషలు వచ్చినవారు చాలా తక్కువగా ఉంటారు. ఇతర రాష్ట్రాలతో సరిహద్దులు కలిగిన జిల్లాల్లో మరి కొన్ని భాషలపై పట్టు కలిగివుంటారు. ఉదాహరణకు చిత్తూరు జిల్లా దక్షిణంలో తమిళనాడుతో, పశ్చిమభాగంలో కర్ణాటకతో సరిహద్దులు కలిగివుంది. దీంతో ఆయాప్రాంతాల్లో ఉండేవారు తెలుగు భాషతో పాటు తమిళం, కన్నడ భాషలపై పట్టు వుంటుంది. తెలంగాణలోని పలు జిల్లాలు కర్ణాటక, మహారాష్ట్రలతో సరిహద్దులు కలిగివున్నాయి. ఇక్కడ ఉండేవారికి తెలుగుతో పాటు కన్నడం, మరాఠీ భాషలు బాగా వచ్చు. అయితే కేరళ ఉత్తరభాగంలోని కాసరగొడ్లో మాత్రం ఏకంగా ఏడు భాషల్లో పరిచయం ఉండటం గమనార్హం.
సప్త భాషా సంగమ భూమి..
కర్ణాటక మంగళూరుకు దిగువన కేరళలో ఉత్తరభాగంలో కాసర్గొడ్ ఉంటుంది. మళయాళం, కన్నడం, తులు, మరాఠీ, కొంకణి,ఉర్దూ, బ్యారీ.. తదితర భాషలను మాట్లాడుతారు. పాలనాపరంగా మలయాళంను ఉపయోగించినా కర్ణాటకను ఆనుకొని ఉండటంతో కన్నడం ప్రభావం అధికంగా ఉంటుంది. కర్ణాటకలోని దక్షిణ కన్నడ, ఉడుపిలతో పాటు కాసర్గొడ్లను తులునాడుగా వ్యవహరిస్తారు. ఈ ప్రాంతంలోని తీరభూముల్లో తులు భాష మాట్లాడతారు. దాదాపు 30 లక్షల మంది ఈ భాషను మాట్లాడుతారని అంచనా. బ్యారీ ముస్లింలు బ్యారీ భాషను వినియోగిస్తారు.
సంస్కృతి భిన్నంగా ఉంటుంది..
కేరళలో ఈ ప్రాంతం విభిన్నమైన సంస్కృతిని కలిగివుంటుంది. కేరళ ఉత్తర భాగంలో తెయ్యం సంగీతరూపకం కాగా ఇక్కడ యక్షగానం ఎక్కువగా ప్రదర్శితమవుతుంటుంది. రాష్ట్రాల పునర్విభజన తరువాత ఇక్కడి పలు ప్రాంతాలను కర్ణాటకకు ఇవ్వాలని మహాజన్ కమిటీ సూచించింది. 1984లో మలబార్ జిల్లాలోని కాసర్గొడ్ తాలుకాను జిల్లాగా ఏర్పాటుచేశారు. ఈ ఏడు భాషల్లోనూ సాహిత్య సమావేశాలు జరుగుతుండటం విశేషం.
ప్రకృతి ఒడి..
జిల్లామీదుగా పశ్చిమ కనుమలు వెళుతాయి. రాణిపురం సమీపంలోని పర్వతాలు ట్రెక్కింగ్‌కు అనుకూలంగా ఉంటాయి. తీరంలోని బెకల్ కోట చారిత్రక కట్టడం. ప్రసిద్దమైన అనంతపుర సరస్సు ఆలయం ఇక్కడే ఉంది. ఈ సరస్సులో ఒక మొసలి శ్రీ అనంతపద్మనాభునికి సేవచేయడం విశేషం.
- ఇంటర్నెట్‌డెస్క్ ప్రత్యేకం