
వార్తలు / కథనాలు
మొత్తంగా ఆమెకు ఎంత భూమి ఉందంటే?
ఇప్పుడు ఎకరం పొలమో.. ఇల్లు కట్టుకోవడానికి వంద గజాల స్థలమో కొనాలంటే సామాన్య ప్రజలకు తలకు మించిన భారమైంది. కానీ ఒకప్పుడు భూస్వాముల వద్ద వేల ఎకరాల భూమి ఉండేది. సామాన్య ప్రజలు ఆ భూమిలో పంటలు పండించుకునేవారు. కాలక్రమేణా కొందరు భూస్వాములు పేదలకు భూములు పంచి ఇస్తే.. మరికొందరు అమ్ముకుంటూ పోయారు. ఇప్పటికీ కొన్ని ధనవంతుల కుటుంబాలకు వేల ఎకరాలు భూములు ఉన్నాయనుకోండి.. కానీ ఎప్పుడైనా ప్రపంచంలో ఎక్కవ భూమి ఎవరి పేరు మీద ఉంది.. అని సందేహం కలిగిందా...? ఆ సందేహానికి సమాధానం.. బ్రిటన్ రాణి ఎలిజెబెత్. అవునండీ ఆమెనే ప్రపంచంలో అత్యధిక భూమిని కలిగి ఉన్న వ్యక్తి.
బ్రిటన్ మొత్తం ఎలిజెబెత్ సామ్యాజ్యమని అందరికి తెలిసిందే. అయితే మహారాణి పేరు మీద బ్రిటన్‌లోని ఖాళీ స్థలాలు, ప్యాలెస్‌లతోపాటు 14 రిటైల్, కమర్షియల్ షాపింగ్ పార్కులున్నాయి. లండన్‌లోని ప్రఖ్యాతి గాంచిన రెజెంట్ స్ట్రీట్ మొత్తం ఆమె సొంతం. ఈ స్ట్రీట్ రెండు కిలోమీటర్లు ఉంటుంది. సెయింట్ జేమ్స్ ప్లేస్ ప్రాంతంలోని ఇళ్లు, షాపులు, ఆఫీస్ భవనాలు అన్ని మహారాణి సొంతమే. కేవలం యూకె మాత్రమే కాదు.. కెనడా, ఆస్ట్రేలియాలోని దాదాపు 90 శాతం భూమి ఎలిజెబెత్‌కు చెందినదే. నిజానికి కామన్వెల్త్ కూటమిలో ఉన్న అన్ని దేశాల్లో భూమి ఎలిజెబెత్ పేరుపైనే ఉంటుంది. కరేబియన్ ఐలాండ్స్ బెహమస్, అంటిగ్వా, బెర్ముడా, బెలిజ్, బర్మడోస్, గ్రెనెండా, జమైకా, సెయింట్ లూసియా, సెయింట్స్ కిట్స్, నెవిస్, సెయింట్ విన్సెంట్, ది గ్రెనడైన్స్ ఆమె సొంతమే. వాటితోపాటు పపువా న్యూ గినియా, న్యూజిలాండ్‌లోని భూములు కూడా ఎలిజెబెత్ పేరునే ఉన్నాయి. అంటే.. భూగోళం మొత్తం మీద 667 కోట్ల ఎకరాలకుపైగా భూమి(కచ్చితంగా చెప్పాలంటే.. 667,17,45,299 ఎకరాలు)కి యూకె మహారాణి ఎలిజెబెత్ 2నే యజమాని. అయితే ఇందులో చాలావరకు సాంకేతికంగా మాత్రమే భూ యజమానిగా ఎలిజెబెత్ పేరు ఉంటుంది. భూగర్భమే కాదు.. యూకె సముద్ర తీరం నుంచి 12 నాటికల్ మైళ్ల దూరం వరకు సముద్రం లోపల ఉన్న భూమి సైతం ఎలిజిబెత్‌కు చెందడం విడ్డూరం.. విశేషం. ఇలాంటి కోట్ల ఎకరాలు ఉన్న రాయల్ కుటుంబాన్ని, అష్టఐశ్వర్యాలను వదిలేసి తమ కాళ్లపై తాము నిలబడాలని యువరాజు ప్రిన్స్ హ్యారీ దంపతులు నిర్ణయించుకోవడం అందరిని ఆశ్యర్యానికి గురిచేస్తోంది.
- ఇంటర్నెట్ డెస్క్