
వార్తలు / కథనాలు
వ్లాదిమర్ పుతిన్... రష్యాను 1999 నుంచి ఏలుతున్న నేత. మసకబారుతున్న రష్యా ప్రాభవాన్ని మళ్లీ నిలబెట్టిన కృషీవలుడని ఆయన మద్దతుదారులు గర్వంగా చెబుతారు. ప్రత్యర్థి రాజకీయపక్షాలతో పాటు తనకు వ్యతిరేక గళం విప్పిన వారిని నిస్సహాయులను చేయగల నేర్పరి. తాజాగా ఆయన వేసిన మరో అడుగు రష్యా రాజకీయాల్లో సంచలానికి దారి తీసింది.
రష్యా మంత్రివర్గం రాజీనామా..
రష్యా మంత్రివర్గం రాజీనామా చేసింది. అత్యంత నమ్మకస్థుడిగా పేరొందిన ప్రధాని మెడ్వెడెవ్ కూడా పక్కకు తప్పుకున్నారు. ఆయన స్థానంలో ఎలాంటి రాజకీయ అనుభవం లేని మిషుస్టిన్ ప్రధానిగా నియమితులు కావడం రాజకీయవర్గాలను ఆశ్చర్యంలో ముంచింది. రాజ్యాంగ పరంగా సంస్కరణలను తీసుకువచ్చేందుకు ఈ ప్రక్రియ అని పుతిన్ చెబుతున్నన్నప్పటికీ రష్యాపై తన పట్టును మరింత నిలుపుకునేందుకు పుతిన్ వ్యూహంలో భాగమని తెలుస్తోంది. 2024లో పుతిన్ పదవీకాలం పూర్తవుతుంది. ఆ తరువాత కూడా అధికారాన్ని నిలుపుకునేందుకు పుతిన్ వ్యూహమని పాశ్చాత్య పరిశీలకులు భావిస్తున్నారు.
1999లో ప్రారంభమైన పుతిన్ శకం
1999లో రష్యా అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం ఇప్పటివరకు పుతిన్ అధ్యక్ష, ప్రధాని బాధ్యతలను నిర్వహించారు. 2008లో అధ్యక్షబాధ్యతలను మెడ్వెడెవ్కు అప్పగించి తాను ప్రధాని బాధ్యతలను అందుకున్నారు. రష్యా రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి రెండుపర్యాయాలు వరుసగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అనంతరం మూడోసారి పోటీచేయకూడదు. అయితే విరామం తరువాత ఎన్నికల్లో పాల్గొనవచ్చు. దీంతో ఆయన అప్పటికే వరుసగా రెండుసార్లు అధ్యక్షుడిగా ఉండటంతో మెడ్వెడెవ్ను ఒకసారి అధ్యక్షుడిగా పోటీ చేయించారు. ఆ సమయంలో పుతిన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించడం గమనార్హం.
అధికారం సుస్థిరం చేసుకునేందుకు..
సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం అనంతరం 1999 వరకు రష్యా పరిస్థితి అంతంతమాత్రమే. పుతిన్ అధికారంలో వచ్చిన అనంతరం తిరిగి పూర్వస్థితిని సంపాదించుకుందని చెప్పవచ్చు. ప్రస్తుతం పుతిన్ కన్నా జనాకర్షకనేత రష్యాలో లేరు. 2024 తరువాత కూడా అధికారాన్ని తన చేతుల్లో ఉంచుకునేందుకు రాజ్యాంగ సంస్కరణలు ప్రారంభించి వుంటారని అంతర్జాతీయనిపుణులు భావిస్తున్నారు.
సవాళ్లు అనేకం..
రష్యా ఎదుర్కొంటున్న పెద్ద సమస్య జనాభా తగ్గుదల. జననాల రేటు 1.5 ఉంది. దీనిని 1.7కు పెంచాలని పుతిన్ పట్టుదలతో ఉన్నారు. మరో వైపు అంతర్జాతీయంగా కూడా అమెరికా, చైనాలకు పోటీగా ఎదగాలని పలువురు రష్యన్లు ఆశిస్తున్నారు. సైనికంగా రష్యాకు తిరుగులేని బలముంది. అదే రీతిలో ఆర్థికంగానూ ఎదిగేందుకు పుతిన్ పథకాలు ప్రారంభించారు. దీంతో పాటు స్వదేశంలో తనకు ఎలాంటి ఆటంకం లేకుండా చూసుకునేందుకు వీలుగా రాజ్యాంగ సంస్కరణలను తీసుకువచ్చేందుకు పుతిన్ యత్నిస్తున్నారని ఆయన ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. పుతిన్ సుదీర్ఘపాలనలో అమెరికా అధ్యక్షులుగా బిల్‌క్లింటన్, జార్జి బుష్, ఒబామా, డొనాల్డ్ట్రంప్లు బాధ్యతలు నిర్వహించారు.
- ఇంటర్నెట్‌డెస్క్ ప్రత్యేకం