
వార్తలు / కథనాలు
అవసరానికో.. ఆర్భాటానికో, ఆకర్షణకో.. ఆదాయానికో ఉద్దేశం ఏదైనా ప్రభుత్వాలు.. నిర్మాణ సంస్థలు.. తాము చేపట్టిన భారీ నిర్మాణాలు వైవిధ్యంగా ఉండాలని కోరుకుంటాయి. ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ఇందుకోసం కోట్ల రూపాయలు వెచ్చిస్తాయి. మరి అలాంటి భారీ నిర్మాణాలు అనివార్య కారణాల వల్ల మధ్యలోనే ఆగిపోతే.. వాటికి ఎంత నష్టం.. ఎంత కష్టం. అలా ప్రపంచవ్యాప్తంగా భారీ ఖర్చుతో చేపట్టి అర్ధాంతరంగా నిలిచిపోయిన అత్యంత ఖరీదైన ప్రాజెక్టుల గురించి తెలుసుకుందామా..?
ఖర్చు భారం పెరిగి.. మధ్యలో ఆగి
విద్యుత్ రంగానికి సంబంధించి టెక్సాస్ ప్రభుత్వం ఓ భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. స్విట్జర్లాండ్ వద్ద ఉన్న లార్జ్ హైడ్రాన్ కొల్లైడర్కి దీటుగా ఉండాలని 1980లో టెక్సాస్‌లో ‘సూపర్ కండక్టింగ్ సూపర్ కొల్లైడర్’ నిర్మాణం ప్రారంభించింది. 1990 నాటికి ప్రాజెక్టులో భాగంగా 15 మైళ్ల సొరంగం తవ్వారు. సొరంగం తవ్వే క్రమంలో 17 యంత్రాలు భూగర్భంలో కూలిపోయాయి. దీంతో ప్రాజెక్టు భారం మరింత పెరిగింది. ఏకంగా 4.4 బిలియన్ డాలర్లు (సుమారు ₹31.3వేల కోట్లు) నుంచి 11 బిలియన్ డాలర్లు (సుమారు ₹78.3వేల కోట్లు)కు చేరింది. ప్రాజెక్టు నిర్వహణలో భారీగా అవకతవకలు జరిగాయి. దీంతో ప్రాజెక్టును అర్ధంతరంగా నిలిపివేశారు. ప్రాజెక్టు ఆగిపోవడం వల్ల దాదాపు రూ.26.3 వేల కోట్ల ప్రజాధనం వృథా అయింది.
ఆ హోటల్‌ది మేకపోతు గాంభీర్యం
1987లో ఉత్తర కొరియా ఒక హోటల్ నిర్మాణాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది. ఆ దేశ రాజధాని ప్యోగ్యాంగ్లో పిరమిడ్ ఆకారంలో 1,080 అడుగుల ఎత్తు ఉండేలా భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ర్యోగ్యాంగ్ హోటల్‌గా నామకరణం చేసిన ఈ భవనంలో 105 అంతస్తులు ఉండేలా నిర్మాణం మొదలుపెట్టారు. అయితే సోవియట్ యూనియన్ విడిపోవడంతో దేశంలో ఆర్థిక సంక్షోభం తలెత్తి 1992లో ఈ నిర్మాణం మధ్యలో నిలిచిపోయింది. రూ.వేలకోట్లు విలువ చేసే ఈ ప్రాజెక్టు పనులు 2008లో ఎట్టకేలకు తిరిగి ప్రారంభమయ్యాయి. భవనం వెలుపల అద్దాలను అమర్చారు. అయితే భవనం లోపల నిర్మాణం మాత్రం జరగలేదు. అప్పట్లో దేశంలో భవన నిర్మాణానికి కావాల్సిన ముడి సరకులు లేకపోవడంతో నిర్మాణం మళ్లీ ఆగిపోయింది. 2017లో హోటల్‌వైపు రోడ్డు.. 2018లో అద్దాలపై ఎల్ఈడీ తెరలు ఏర్పాటు చేశారు. అంతే.. ఇప్పటికీ హోటల్ లోపల అంతా ఖాళీగానే ఉంది. ప్రస్తుతం అది కేవలం సందర్శక కట్టడంలాగే ఉంటోంది. భవిష్యత్తులో అయినా నిర్మాణం పూర్తి చేసే అవకాశం తక్కువే అని నిపుణులు చెబుతున్నారు.
ఎస్కలేటర్ నుంచి టేబుల్ వరకు అన్ని కొలతలు తప్పే
బెర్లిన్‌లో ఎయిర్‌పోర్టు నిర్మించాలని 1989లో ప్రణాళిక సిద్ధం చేసినా.. దానికి 2006లో అనుమతి లభించింది. వెంటనే పనులు ప్రారంభించారు. 2011 అక్టోబర్ నాటికి ఎయిర్‌పోర్టును అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం 2.7 బిలియన్ డాలర్లు(దాదాపు ₹19.2వేల కోట్లు) వ్యయం అంచనా వేశారు. అయితే అనుకున్న సమయం కన్నా ఎక్కువ సమయం పడుతుందని భావించి 2012 జూన్‌లో ప్రారంభమవుతుందని ప్రకటించారు. అప్పటికే ఎయిర్‌పోర్టు నిర్మాణంలో అనేక లోపాలు బయటపడ్డాయి. ఎస్కలేటర్స్ నుంచి టేబుల్స్ వరకు ఏవీ కొలతలకు తగ్గట్టుగా లేవు. దీంతో వ్యయభారం 6 బిలియన్ డాలర్ల(సుమారు ₹42వేల కోట్లు)కు పెరిగింది. ఇప్పటికీ ఆ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాలేదు. అవుతుందన్న నమ్మకం లేదంటున్నారు అక్కడి ప్రజలు.
ఎంతో ఊహించి.. ఆఖరికి చతికిల పడి
మాడ్రిడ్ ఎయిర్‌పోర్టులో ప్రయాణీకుల రద్దీకి పరిష్కారంగా సియూడాడ్ రియల్‌లో మరో ఎయిర్‌పోర్టు నిర్మించాలనుకుంది స్పెయిన్. దీంతో ఓ ప్రైవేటు సంస్థ ముందుకొచ్చింది. 1 బిలియన్ డాలర్లు (₹7.1వేల కోట్లు) వ్యయంతో ‘సియూడాడ్ రియల్ సెంట్రల్’ ఎయిర్‌పోర్టును అద్భుతంగా నిర్మించి 2009లో ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చింది. అయితే ఏడాదికి కోటి మంది ప్రయాణీకులు వస్తారనుకుంటే.. వేల సంఖ్యలో ప్రయాణికులే ఈ ఎయిర్‌పోర్టు ద్వారా ప్రయాణం సాగించారు. దీంతో ఎయిర్‌పోర్టు నిర్వహణ చూస్తున్న కంపెనీ పూర్తిగా నష్టాల్లోకి వెళ్లింది. దివాలా తీసే పరిస్థితి రావడంతో 2012లో ఎయిర్‌పోర్టును మూసివేశారు. ఆ ఎయిర్‌పోర్టును చైనాకు చెందిన ఓ కంపెనీకి అమ్మేశారు. దాన్ని పునఃప్రారంభిస్తారో.. పూర్తిగా మూసివేస్తారో అనే విషయంపై ఇప్పటికీ స్పష్టత లేదు.
ఆ ప్రాజెక్టులో అన్నీ లోపాలే
న్యూక్లియర్ పవర్ ప్రాజెక్టులో భాగంగా ఫ్రాన్స్.. ఫ్లేమన్విల్లేలో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ మూడో యూనిట్‌ను నిర్మించాలనుకుంది. ఈ మెగా ప్రాజెక్టు ఫ్రాన్స్‌కు చెందిన దిగ్గజ విద్యుత్‌రంగ సంస్థ ‘ఈడీఎఫ్’కు దక్కింది. 3.3బిలియన్ డాలర్లు (₹23.5వేల కోట్లు)వ్యయంతో 2007లో ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. 2012నాటికి నిర్మాణం పూర్తయి పనులు ప్రారంభించాలని నిర్దేశించుకున్నారు. కానీ, ఇప్పటికీ అది పూర్తి కాలేదు. నిర్మాణ లోపాలు, పేలుళ్ల కారణంగా అనేక సార్లు పనులు నిలిచిపోయాయి. అలా ప్రాజెక్టు ఆలస్యమవుతూ వస్తోంది. దీంతో ప్రాజెక్టు నిర్మాణ వ్యయం 12 బిలియన్ డాలర్ల(₹85వేల కోట్లు)కు చేరింది. ఎప్పటికి పూర్తవుతుందో మాత్రం చెప్పలేమంటున్నారు అక్కడి నిపుణులు.
కట్టేస్తామన్నారు.. కోర్టు కేసులో చిక్కుకున్నారు
1906లో వచ్చిన భూకంపంతో చెల్లాచెదురైన శాన్ఫ్రాన్సిస్కో తీర ప్రాంతాన్ని బాగుచేసి ప్రజలకు అందుబాటు ధరల్లో ఇళ్లను ఇవ్వాలని నిర్ణయించారు అక్కడి అధికారులు. ఆ ప్రాంతాన్ని నివాస సముదాయాలు, దుకాణాలు, రెస్టారెంట్లు, ఆఫీసులు పెట్టుకునేలా తీర్చిదిద్దాలని భావించారు. ఇందుకోసం 8 బిలియన్ డాలర్లు (₹56.9వేల కోట్లు)వ్యయంతో 2030లోపు ఇవ్వాలని ప్రణాళిక చేశారు. అనుకున్నట్టుగానే ప్రాజెక్టును 2013వ సంవత్సరంలో ప్రారంభించారు. నిర్మాణం ప్రారంభంలోనే కొందరు ఇళ్లను కొనుగోలు చేశారు. అయితే ప్రాజెక్టు నిర్మాణం చేస్తున్న ప్రాంతం గురించి అసలు విషయం బయటపడటంతో అందరూ షాక్‌కి గురయ్యారు. ఆ ప్రాంతం 1940 - 1960 మధ్య కాలంలో అమెరికా సైన్యం అక్కడ న్యూక్లియర్ ప్రయోగాలు జరిపిందని, ఆ ప్రాంతమంతా విషపూరితంగా మారిందని తేలిందట. నకిలీ ధ్రువపత్రాలతో ప్రాజెక్టును ప్రారంభించారని కంపెనీపై కేసు నమోదైంది. ప్రస్తుతం ఆ ప్రాజెక్టు ఆగిపోయి.. ఆ కేసు కోర్టులో ఉంది.
₹64వేల కోట్లు రియాకర్ట్లో పోసిన పన్నీరు
న్యూక్లియర్ ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వంతోపాటు ప్రైవేటు సంస్థలు కూడా ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటాయి. అందుకే యూఎస్‌లోని మూడు దిగ్గజ కార్పొరేట్ కంపెనీలు న్యూక్లియర్ రియాక్టర్ల ప్రాజెక్టును ప్రారంభించాలనుకున్నాయి. సౌత్ కరోలినా ఎలక్ట్రిక్ అండ్ గ్యాస్, శాంటీ కూపర్, వెస్టింగ్‌హౌస్ ఎలక్ట్రిక్ కంపెనీలు కలిసి 2013లో సౌత్ కరోలినాలోని విర్గిల్ సి. సమ్మర్ న్యూక్లియర్ జనరేటింగ్ స్టేషన్లో రెండు ఏపీ1000 న్యూక్లియర్ రియాక్టర్ల నిర్మాణం ప్రారంభించాయి. ఇందుకోసం 11.5 బిలియన్ డాలర్లు (₹82వేల కోట్లు) కేటాయించాయి. అయితే అనేక కారణాల వల్ల ఆ ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమవుతూ వస్తోంది. ఎలాగైనా 2020లో ప్రారంభించాలని నిర్దేశించుకున్నాయి. కానీ, అన్ని మనం అనుకున్నట్లు జరగవు కదా.. 2017లో వెస్టింగ్‌హౌస్ కంపెనీ రుణ ఊబిలో చిక్కుకొని దివాలా తీసింది. దీంతో మూడు సంస్థల మెగా ప్రాజెక్టు ఆగిపోయింది. ఇప్పటివరకు నిర్మాణం కోసం ఖర్చు చేసిన 9 బిలియన్ డాలర్లు(₹64.1వేల కోట్లు) బూడిదలో పోసిన.. కాదు కాదు రియాక్టర్లో పోసిన పన్నీరైంది. అయితే ఇటీవల కొన్ని కంపెనీలు ఆ రెండు రియాక్టర్లను కొని ప్రాజెక్టును కొనసాగించేందుకు ఆసక్తి చూపించాయి. కానీ అది కార్యారూపం దాల్చడం కష్టమే.