
వార్తలు / కథనాలు
మూడో ఒలింపిక్స్‌లో ఎన్ని వింతలో...
ప్రపంచ దేశాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చే మహా క్రీడోత్సవం.. ఒలింపిక్స్. శతాబ్దకాలం దాటి అప్రతిహతంగా కొనసాగుతున్న ఈ క్రీడల్లో అనేక అనుభూతులు.. జ్ఞాపకాలు ఉంటాయి. అయితే ఒలింపిక్స్ ప్రారంభమైన కొత్తలో అంటే మూడో ఒలింపిక్స్‌లో మాత్రం కొన్ని విచిత్రమైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. నిర్వహణ లోపం.. క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా సాగిన పరుగు పందెం.. ఒలింపిక్స్ చరిత్రలో మాయని మచ్చగానూ మిగిలిపోయింది. అవేంటో చూద్దాం!
1904 ఆగస్టు 30న మిస్సోరిలోని సెయింట్ లూయిస్ పట్టణంలో మూడో ఒలింపిక్స్ క్రీడలు జరిగాయి. 24.85 మైళ్ల (39.99 కి.మీ) పురుషుల పరుగుపందెంలో నాలుగు దేశాల నుంచి 32 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. ఉదయం ప్రారంభించాల్సిన ఈ పరుగు పందెంను మధ్యాహ్నం ప్రారంభించారు. తాగునీటిని కూడా అందుబాటులో ఉంచలేదు. దీంతో చాలా మంది అథ్లెట్లు పరుగు ప్రారంభమైన కాసేపటికే కుప్పకూలారు. చివరికి 14 మందే గెలుపు గీతను తాకారు. అయితే వారిలో నలుగురు అథ్లెట్ల తీరు.. ఒలింపిక్స్ నిర్వహణలో నిర్లక్ష్యం అందరిని నివ్వెరపోయేలా చేసింది.
కారులో వచ్చి విజేతయ్యాడు.. కానీ
ఈ ఒలింపిక్స్ పురుషుల పరుగు పందెంలో అమెరికాకు చెందిన అథ్లెట్ ఫ్రెడ్ లోర్జ్ ప్రథమ స్థానంలో నిలిచాడు. నిజానికి అతడు తొమ్మిదో మైలు వద్దే పరుగును ఆపేశాడు. ఆ తర్వాత ఓ కారెక్కి ప్రయాణించాడు. 19వ మైలు వద్ద కారు మొరాయించడంతో కాళ్లకు పని చెప్పాడు. అందరికంటే ముందు వచ్చి గెలుపుగీతను దాటి విజేత అయ్యాడు. దీంతో అప్పటి యూఎస్ అధ్యక్షుడు థియోడొర్ రూస్వెల్ట్ కూతురితో కలసి ఫొటోలకు ఫోజులిచ్చాడు. అయితే స్వర్ణ పతకం అందుకునే సమయంలో అతడి మోసం బయటపడింది. వెంటనే లోర్జ్ తను చేసిన మోసాన్ని అంగీకరించి.. సరదాగా చేశానని తప్పించుకునే ప్రయత్నం చేశాడు.. కానీ ఒలింపిక్స్ ప్రతినిధులు అతడిపై జీవితకాల నిషేధం విధించారు. కానీ క్షమాపణలు కోరడంతో మరుసటి ఏడాది నిషేధం ఎత్తివేశారు.
తుళ్లి.. తూగి.. స్వర్ణం గెలిచి
బ్రిటిష్ సంతతికి చెందిన థామస్ హిక్స్ యూఎస్ తరఫున పోటీలో నిలబడ్డాడు. థియోడర్ మోసం బయటపడటంతో... పరుగులో అప్పటివరకు రెండులో నిలిచిన హిక్స్ విజేతగా నిలిచాడు. అయితే హిక్స్ కూడా మోసం చేశాడు. నీరసం ఆవహించడంతో గెలుపు గీతకు ఒకటిన్నర మైలు దూరంలో పడిపోయాడు. దీంతో హిక్స్ నరాలను ఉత్తేజపరిచి బలానిచ్చే స్ట్రిచిన్ అనే రసాయనాన్ని (నిజానికి అది ఎలుకలను చంపే మందు) ఎక్కించారు. అలా హిక్స్ స్టేడియం వరకు వచ్చేసరికి ఒక బాటిల్ మందు తాగేశాడు. దీంతో అతడికి మత్తు ఎక్కి పిచ్చిపిచ్చిగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఉన్న చోటనే నిలబడి పరిగెడుతున్నట్లు ఊహించుకుంటూ తూగాడు. సహాయకులు హిక్స్ను భుజాన మోసుకెళ్లి గెలుపుగీతను దాటించారు. నిర్వాహకులు అతడు రసాయనం తీసుకోవడంపై అభ్యంతరం చెప్పకుండా అతడికే స్వర్ణ పతకం ఇచ్చారు. హిక్స్ మూడు గంటల 28 నిమిషాల 53 సెకన్లలో పరుగును పూర్తి చేశాడు.
క్యూబా అథ్లెట్ రూటే సపరేటు
క్యూబాకు చెందిన అథ్లెట్ ఆండ్రియన్ కార్వజల్ ఈ పోటీలో పాల్గొనడం కోసమే ఎంతో కష్టపడ్డాడు. తన దేశంలో విరాళాలు సేకరించి ఒలింపిక్స్ వేదిక సెయింట్ లూయిస్‌కి పయనమయ్యాడు. అయితే మార్గ మధ్యంలో జూదం ఆడి మొత్తం డబ్బులు పోగొట్టుకున్నాడు. కాలినడకన, దారిలో లిఫ్ట్ అడుగుతూ పరుగు ప్రారంభమయ్యే చివరి నిమిషంలో స్టేడియానికి చేరుకున్నాడు. అతడి ఒంటిపై చిరిగిన పాంటు, టీషర్టు మాత్రమే ఉన్నాయి. ఆ దుస్తులతో పందెంలో పాల్గొనడానికి వీల్లేదని నిర్వాహకులు అడ్డుకున్నారు. దీంతో ఆండ్రియన్ తన పాంట్‌ను కత్తిరించి షార్ట్‌గా మార్చుకొని అవకాశం ఇవ్వాలని అభ్యర్థించాడు. అలా అతడు పరుగు పందెంలో పోటీపడ్డాడు. అయితే రెండ్రోజులుగా ఆహారం లేకపోవడంతో నీరసించిపోయాడు. దారిలో ఆపిల్ తోటలో ఒక పండు కోసి తినేశాడు. అయితే అది పాడైన ఆపిల్ కావడంతో కడుపునొప్పి వచ్చింది. నొప్పి భరించలేక ఆండ్రియన్ దారిలో పడిపోయాడు. కాసేపు విశ్రాంతి తీసుకొని మళ్లీ పరుగు లంఘించుకున్నాడు. ఆకలి, కడుపు నొప్పి భరించి.. కాసేపు విశ్రాంతి తీసుకొని పరుగెత్తినా ఆండ్రియన్ నాలుగో స్థానంలో నిలవడం ఆశ్చర్యం.
రక్తం కక్కుతూ.. లక్ష్యం వైపు పాకుతూ
యూఎస్‌కు చెందిన విలియమ్ గేర్షియా పరుగు పందెంలో చురుగ్గా పాల్గొన్నాడు. 19 మైళ్ల వరకు బాగానే పరిగెత్తాడు. ఆ తర్వాతే అతడికి శ్వాసకోశ ఇబ్బందులు ఎదురయ్యాయి. పైగా దారి పొడవునా నిర్వాహకుల కార్ల వల్ల లేచిన దుమ్ముధూళీతో అతడికి ఊపిరాడలేదు. దీంతో రక్తం కక్కున్నాడు. శరీరం లోపల అనేక గాయాలయ్యాయి. రక్తనాళాలు చిట్లిపోయాయి. తీవ్రమైన అస్వస్థతతో రోడ్డు పక్కన పడిపోయాడు. అతడిని ఎవరైనా చూసి ఉండకపోతే కచ్చితంగా దారిలోనే ప్రాణాలు కోల్పోయేవాడు. సమయానికి స్థానికులు అతడిని గుర్తించడంతో పోటీలో గెలవకపోయినా ప్రాణాలు నిలిచాయి.