
వార్తలు / కథనాలు
కరోనా మహమ్మారిని చైనా వైద్యులు జయించిన తీరిది
అనుభవంతో ప్రపంచ వైద్యులకు చెబుతున్న జాగ్రత్తలు
‘వైద్యో నారాయణో హరి’ అన్నది భారతీయ సంస్కృతి. కనిపెంచిన తల్లిదండ్రులు, విద్యాబుద్ధులు నేర్పించే గురువు తర్వాత దేవుడిగా భావించేది వైద్యుడినే. ప్రపంచాన్నే తన గుప్పిట బంధించి మానవాళి మనుగడకే పెనుసవాల్ విసురుతోంది కరోనా వైరస్. ఈ మహమ్మారి నుంచి రక్షించేందుకు ఆరోగ్య యంత్రాంగం పగలు రాత్రీ తేడా లేకుండా కష్టపడుతోంది.
నయం చేసే క్రమంలో కొందరు వైద్యులకు కొవిడ్-19 సోకడం కలవరపెడుతోంది. లక్షమందికి వైరస్ సంక్రమించినా చైనాలో యుద్ధప్రాతిపదికన వైద్యం అందించారు. అక్కడి జెఝాంగ్ వైద్య విశ్వవిద్యాలయం తమ అనుభవంతో వైద్యులు, నర్స్‌లు, సిబ్బంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఎలా వైద్యం అందించాలో, ఏ ఆహారం తీసుకోవాలో, ఏ ఔషధాలు ఉపయోగించాలో, ఆస్పత్రి నిర్వహణ ఎలా ఉండాలో ఓ చిన్న పుస్తకం విడుదల చేసింది. దాని సారాంశం www.eenadu.net (ఈనాడు.నెట్) ద్వారా మీకోసం.
మూడు విభాగాలుగా ఐసోలేషన్
కొవిడ్-19 అంటువ్యాధి అన్న సంగతి అందరికీ తెలుసు. అందుకే ఆస్పత్రిని సాధారణ సేవలు, కరోనా సేవల కోసం విడదీయాలి. ఇక కొవిడ్ కోసం ఐసోలేషన్ ప్రాంతంలో మూడు భాగాలు అవసరం. ఒకటి వైరస్ సోకిన, రెండోది వైరస్ సోకే ప్రమాదమున్న, మూడోది పరిశుభ్రమైనవి. ఒక్కో విభాగం అవసరాలకు అనుగుణంగా పరికరాలు, పరిశీలన గది, ప్రయోగశాల వంటివి ఏర్పాటు చేసుకోవాలి. అనుమానితులు, రోగస్థులను తీసుకొచ్చేందుకు ప్రత్యేక దారులు ఉండాలి. కొవిడ్ లక్షణాలున్న ప్రతి ఒక్కరికీ సర్జికల్ మాస్క్‌లు ఇవ్వాలి. వారున్న చోటికి మరెవ్వరినీ రానివ్వొద్దు. ఈ మహమ్మారిని ఎదుర్కోవాలంటే ముందుగా లక్షణాలను గుర్తించడం కీలకమని వారికీ, కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించాలి.
అనుమానితులు అందరికీ పరీక్షలు
కరోనా అనుమానితులను ముందుగా స్క్రీనింగ్ చేయాలి. వారు గత 14 రోజుల్లో ఎక్కడున్నారో, ఏం చేశారో, ఎవరెవరిని కలిశారో విచారించాలి. ఇన్ఫెక్షన్ ప్రబలిన చోట తిరిగారో లేదో పరిశీలించాలి. వెంటనే వైద్య నిపుణుడికి చూపించాలి. ఆ తర్వాత వారికి సీటీ ఇమేజింగ్ స్కాన్ చేయించాలి. ఊపిరితిత్తులు, శ్వాస నాళంలో కరోనా లక్షణాలు కనిపించాయో లేదో చూడాలి. వ్యాధి సోకిన తొలిదశలో తెల్ల రక్తకణాలు సాధారణంగా ఉంటాయి లేదా తగ్గుతాయి. లింఫోసైట్ కణాలు కాలం గడిచే కొద్దీ తగ్గుతాయి. నమూనాల్లో కరోనా తేలకపోతే వారిని 14 రోజులు ఐసోలేషన్‌కు పంపించి ఆ తర్వాత పరీక్షించి ఇంటికి పంపించాలి. ఇంటివద్ద సైతం 14 రోజులు బయటకు వెళ్లకుండా స్వీయనిర్బంధంలో ఉండమని చెప్పాలి. ఒకవేళ తేలితే వైద్యం అందించాలి.
ప్రత్యేక వసతులు అవసరం
మొత్తం ఐసోలేషన్ చోటును పరిశీలన జోన్, ఐసోలేషన్ జోన్, ఐసోలేషన్ ఐసీయూ జోన్‌గా విడదీయాలి. అనుమానితులను ఒక్కొక్కరినీ ప్రత్యేక గదిలో ఉంచాలి. అందులో అన్ని వసతులతో పాటు మరుగుదొడ్డి ఉండాలి. కరోనా నిర్ధరించిన వారిని ఒక్కొక్కరికీ 1.2 మీటర్ల దూరంలో పడకలు ఏర్పాటు చేయాలి. ఈ వార్డులో అన్ని సౌకర్యాలు ఉండాలి. కుటుంబ సభ్యులకు ప్రవేశం నిషేధం. వారితో మాట్లాడేందుకు, చూసేందుకు ఆడియో, వీడియో కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. కొవిడ్-19 సోకిన వారికి మాస్క్‌లు ఎలా ధరించాలో, చేతులు ఎలా కడుక్కోవాలో, దగ్గు, తుమ్ము వచ్చినప్పుడు ఏం చేయాలో, ఇంటికి వెళ్లాక స్వీయ నిర్బంధంలో ఎలా ఉండాలో అన్నీ వివరించాలి.
వైద్యసిబ్బందికీ మూడు స్థాయిల్లో రక్షణ
(వైద్య సిబ్బంది గ్లోవ్స్, ఇతర దుస్తులు ధరిస్తున్న విధానం)
వైద్య అందించే సిబ్బందికి మూడు స్థాయిల్లో రక్షణ అవసరం. ఒకటో స్థాయిలో వాడిపారేసే సర్జికల్ టోపీ, మాస్క్, దుస్తులు, లేటెక్స్ గ్లోవ్స్, ఐసోలేషన్ దుస్తులు తప్పనిసరి. వీరు ఔట్ పేషెంట్ విభాగం, ప్రాథమిక పరీక్షలకు సాయం అందిస్తారు. రెండో స్థాయి రక్షణ అవసరమైన వారు పైవాటికి అదనంగా ఎన్-95 మాస్క్, వైద్య రక్షణ గల దుస్తులు, కళ్లద్దాలు ధరించాలి. ఐసోలేషన్ వార్డులో సేవలు అందించడం, పరీక్షలు చేయడం, వైద్య పనిముట్లు శుభ్రపరచడం, కొవిడ్-19 వార్డుల్లో వీరు పనిచేస్తారు. మూడో స్థాయి రక్షణ కోసం పైవాటికి అదనంగా గాలిని శుభ్రపరిచే వ్యవస్థ కలిగి, ముఖమంతా కప్పేసే దుస్తులు అవసరం. అంతర్గత గ్లోవ్స్‌తో పాటు ఔటర్ గ్లోవ్స్నీ వీరు ధరించాలి. సంక్లిష్టమైన అన్ని విభాగాల్లో వీరు పనిచేయాల్సి ఉంటుంది.
వైద్యపరమైన దుస్తులు ఇలా ధరించాలి
(వైద్య సిబ్బంది గ్లోవ్స్, ఇతర దుస్తులు తొలగిస్తున్న విధానం)
కరోనా రాకుండా సాధారణ పౌరులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అంతకన్నా కఠినంగా వైద్య సిబ్బంది నిబంధనలు పాటించాలి. చాలా జాగ్రత్తగా దుస్తులు ధరించాలి/తీసేయాలి. ముందు వైద్య సేవలు అందించే దుస్తులు ధరించాలి. నీటికి తడవని షూ వేసుకోవాలి. వెంటనే సబ్బు లేదా శానిటైజర్‌తో చేతులు కడుక్కోవాలి. ఆ తర్వాత టోపీ, మాస్క్, గ్లోవ్స్, కళ్లద్దాలు ధరించాలి. రెండు/మూడో స్థాయి రక్షణ అవసరమైన సిబ్బంది ఐసోలేషన్ గ్లోవ్స్, గాలిని శుభ్రపరిచే వ్యవస్థ గలిగిన దుస్తులు వేసుకోవాలి. ఇది ముఖమంతా కప్పేలా ఉండాలి. చివరిగా లేటెక్స్ గ్లోవ్స్ తొడుక్కోవాలి. ఇక వీటిని తీసేసే క్రమంలో అదనపు జాగ్రత్తలు అవసరం. ముందు గ్లోవ్స్ తొలగించి చేతులు కడగాలి. వెంటనే రెండో దశ గ్లోవ్స్, రక్షణ కల్పించే దుస్తులు తీసేయాలి. చేతులు శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత కళ్లద్దాలు, మాస్క్, టోపీ, అంతర్గత గ్లోవ్స్ తీసేయాలి. తీసే ప్రతిసారీ చేతులు కడగాలి సుమా. ఆఖరికి సాధారణ దుస్తులు వేసుకోవాలి. చేతులు శుభ్రం చేసుకోవాలి. కొవిడ్-19 పేషెంట్లకు సేవలందించే సిబ్బంది నాలుగు గంటలు మాత్రమే సంక్లిష్టమైన సేవల్లో భాగమవ్వాలి. తర్వాత మిగతా సేవలకు వెళ్లొచ్చు.
పరిశుభ్రతకు పెద్దపీట
కొవిడ్-19 పూర్తిగా నయమవ్వాలంటే పరిశుభ్రతే ప్రధానం. అందుకే ఐసోలేషన్ గదులు, పనిముట్లు, రోగి తుంపర్లు, చీమిడి, తెమడ, వాంతులు శుభ్రం చేసే ప్రక్రియ మరింత జాగ్రత్తగా చేయాలి. ముందుగా రక్తం, తెమడ, తుంపర్లు అంటుకున్న చికిత్సా పనిముట్లను వేరుచేయాలి. లీటరు నీటిలో 1000 మిల్లీ గ్రాముల క్లోరిన్ కలిపిన మిశ్రమంతో నేల, గోడలు శుభ్రపరచాలి. 30 నిమిషాలకు నీటితో కడిగేయాలి. ఇలా రోజుకు మూడు సార్లు చేయాలి. ఇక పని ముట్లను 5000 మి.గ్రా/లీ క్లోరిన్ మిశ్రమంతో శుభ్రం చేయాలి. కిందపడిన తెమడ, తుప్పిర్లు, రక్తాన్ని దాని పరిమాణాన్ని బట్టి 10,000-20000 మి.గ్రా /లీ క్లోరిన్ ద్రవణంతో తుడవాలి. మళ్లీ ఆ వస్త్రాన్ని శుభ్రం చేసేందుకు ఇంకా గాఢత కలిగిన మిశ్రమం అవసరం. ఎండోస్కోపీ చేసే గొట్టాలు, నాళాలను 0.23 శాతం పెరోక్సయసెటిక్ ఆమ్లం, సైరింగ్ మిశ్రమాలను ఉపయోగించి శుభ్రపరచాలి. ఒక్కో వార్డులో వైరస్ తీవ్రతను బట్టి శుభ్రత అవసరం. ఇక వాడి పారేసే, తిరిగి ఉపయోగించే దుస్తులను క్లోరిన్ ద్రవాణంతో తడిపిన సంచుల్లో మూటగట్టి ప్రత్యేక పద్ధతిలో నాశనం/ఉతికేయాలి. డిసిన్ఫెక్టెట్ చేయడం అత్యంత కీలకం.
మృతదేహాలను తరలించే తీరిది
కొవిడ్-19 సోకిన వారిలో దాదాపు 97% కోలుకొని తిరిగి ఇంటికి వెళ్తున్నారు. ఇంటికెళ్లాక వారు 14 రోజులు స్వీయ నిర్బంధంలో ఉండటం మంచిది. దురదృష్టం కొద్దీ కొందరు చనిపోతున్నారు. వారి మృతదేహాలను కుటుంబీకులకు అప్పగించే సమయంలో జాగ్రత్తలు అవసరం. సిబ్బంది పూర్తిగా రక్షణాత్మక దుస్తులు ధరించాలి. పార్థివదేహంలో ఎలాంటి రంధ్రాలు ఉన్నా వాటిని 3000-4000 మిగ్రా/లీ క్లోరిన్‌తో తడిపిన దూది ఉండలతో నింపాలి. నోరు, ముక్కు , మలద్వారంలోనూ ఇలాగే చేయాలి. డిసిన్ఫెక్ట్ మిశ్రమంతో తడిపిన రెండు పొరల వస్త్రంలో దేహాన్ని చుట్టి ఐసోలేషన్ కాకుండా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన దారిలో తరలించాలి. కుటుంబ సభ్యులు కోరిన నిర్దేశిత శ్మశానవాటికకు ప్రత్యేక వాహనంలో పంపించాలి. దేహాన్ని తీసుకెళ్లిన దారినంతటినీ క్లోరిన్ మిశ్రమంతో కడిగేయాలి.
మీరే ఆదర్శం.. నిబంధనలు పాటించండి
కరోనా సోకిన వారికి చికిత్స చేస్తున్న వైద్య సిబ్బంది ఇతర వార్డుల్లోకి వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. ఎవరినీ అనవసరంగా ముట్టుకోవద్దు. నిబంధనలు కచ్చితంగా పాటించి ఆదర్శంగా నిలవాలి. వైద్యలం, మాకేమవుతుందిలే అన్న నిర్లక్ష్యం ఏ మాత్రం తగదు. చైనాలో వైద్యులు ఎంత కఠినంగా, అలుపెరగక శ్రమించారోర అందరికీ తెలిసిందే. అజాగ్రత్తగా ఉంటే వైద్య సిబ్బందికి వైరస్ సోకే అవకాశంఉ ఎక్కువ. అలాంటప్పుడు రోగులు, సాధారణ ప్రజలు ఆందోళన చెందుతారు. ఆస్పత్రి, ఐసోలేషన్ వార్డుల్లో సూక్ష్మజీవులను నిరోధించే, హెఫా ప్రమాణాలతో గాలిని శుభ్రం చేసే యంత్ర వ్యవస్థను పెట్టుకోవాలి. సికింద్రాబాద్ గాంధీలో ఇప్పటికే ఇలాంటి వ్యవస్థను నెలకొల్పారు. చికిత్సకు సంబంధించిన ఈ పుస్తకం ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మీరూ చదవాలనుకొంటే పీడీఎఫ్ కోసం క్లిక్ ఇక్కడ చేయండి
-ఇంటర్నెట్‌డెస్క్, హైదరాబాద్