
వార్తలు / కథనాలు
సోషల్‌మీడియాలో ఎవరు.. ఎప్పుడు.. ఎలా.. పాపులర్ అవుతారో తెలియదు. కొందరు టాలెంట్‌తో గుర్తింపు తెచ్చుకుంటే.. మరికొందరు ఫేమస్ కావడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ, చైనాకు చెందిన ఓ యువకుడు మాత్రం ఇంట్లో హాయిగా నిద్రపోయి పాపులర్ అయ్యాడు. నమ్మశక్యంగా లేదు కదా? నిజమేనండీ.. ఐదు గంటల నిద్ర అతడికి లక్షల మంది అభిమానులను తెచ్చిపెట్టింది. ఇది ఓ రకంగా కరోనా పుణ్యమేనట.
జియాంగ్జి ప్రావిన్స్‌లో ఉండే యువన్సన్కి నటుడు అవ్వాలనే కోరిక. దీంతో ప్రముఖ సోషల్‌మీడియా యాప్ టిక్‌టాక్‌లో అకౌంట్ తెరిచి.. అప్పుడప్పుడు తను నటించిన వీడియోలు పెట్టేవాడు. కానీ, వాటికి స్పందన అంతంత మాత్రంగానే ఉండేది. అయితే ఫిబ్రవరి 9న యువన్సన్కి ఏమీ తోచక టిక్‌టాక్‌లో లైవ్‌స్ట్రీమింగ్ పెట్టి పడుకున్నాడు. నిజానికి తను నిద్రపోతున్నప్పుడు గురక వస్తుందా? లేదా తెలుసుకోవడం కోసం మాత్రమే లైవ్‌స్ట్రీమింగ్ రికార్డు చేశాడట. అయితే ఐదు గంటల తర్వాత నిద్రలేచి చూసే సరికి అతడి వీడియోను లక్షల మంది వీక్షించారు. ఆశ్చర్యపోయిన యువన్సన్.. మళ్లీ అలాగే నిద్రపోతున్నప్పుడు తీసిన కొన్ని వీడియోలను పోస్ట్ చేశాడు. వాటిని కూడా టిక్‌టాక్ యూజర్లు తెగ లైక్ చేశారు. అతడి వీడియోలను చూసిన వారి సంఖ్య 1.85 కోట్లకు చేరింది. దాదాపు 10 లక్షల మంది అతడికి ఫాలోవర్స్‌గా మారారు. దీంతో ఒక్కసారిగా టిక్‌టాక్‌లో యువన్సన్ పాపులర్ స్టార్‌గా మారిపోయాడు. ఎంతలా అంటే.. అతడు నటిస్తూ తీసిన వీడియోలు పెట్టినా టిక్‌టాక్ యూజర్లు వాటిని చూడకుండా ‘యూవన్సన్ నువ్వు ఎప్పుడు నిద్ర పోతావ్’, ‘‘నువ్వు ఎందుకు నిద్రపోవట్లేదు’’, ‘‘నీ నిద్రపోతున్న వీడియోలు ఏవీ’’అంటూ ప్రశ్నిస్తున్నారు.
యువన్సన్ వీడియోలను మెచ్చి వీక్షకులు అతడికి రూ.8.31లక్షలు విలువ చేసే వర్చువల్ బహుమతులు కూడా పంపారు. యువన్సన్ పాపులారిటీ చూసి మీడియా సంస్థలు కూడా అతడి ఇంటర్వ్యూలు తీసుకున్నాయి. అయితే ‘అసలు నేను నిద్రపోతున్న వీడియో వీక్షకులను ఎందుకు నచ్చిందో తెలియదు. ఆ వీడియోలు చేసి చేసి బోర్ కొట్టింది. ఇకపై అలాంటి వీడియోలు మళ్లీ పోస్టు చేయను’’అని యువన్సన్ స్పష్టం చేశాడు.
నిజానికి కరోనా వైరస్ దృష్ట్యా చైనా వ్యాప్తంగా ఆంక్షలున్నాయి. దీంతో పాఠశాలలు, కళాశాలలు, బార్లు, రెస్టారెంట్లు, పార్కులు అన్ని మూతపడ్డాయి. దీంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంట్లో ఏం తోచని యువతీయువకులు సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ అయ్యారు. ఈ క్రమంలో యువన్సన్ వీడియో ఫన్నీగా అనిపించి లైక్.. షేర్ చేయడం మొదలుపెట్టారట. అలా ఉన్నపళంగా యువన్సన్ పాపులర్ అయ్యాడు.