
వార్తలు / కథనాలు
ఇంటర్నెట్‌డెస్క్ ప్రత్యేకం: కరోనా వైరస్.. ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ధనిక, పేద దేశాల తేడా లేదు. అన్ని ఖండాల్లోనూ మరణ మృదంగం మోగిస్తోంది. భారత్‌లోనూ అడుగుపెట్టింది. అయితే సరిగ్గా 102 సంవత్సరాలకు ముందు 1918లో ప్రపంచం స్పానిస్ ప్లూ అనే ఇన్‌ఫ్లూయంజాతో నిలువెల్లా వణికిపోయింది. ఏకంగా 50 కోట్లమంది దీని బారిన పడి ఉంటారని అంచనా. భారత్‌లోనూ ఈ వైరస్ తన మారణకాండ కొనసాగించింది. ఇక్కడ ఏకంగా 2 కోట్లమంది వరకు ప్రాణాలు కోల్పోయివుంటారని ప్రభుత్వ రికార్డులు పేర్కొంటున్నాయి. కాశీలోని గంగా తీరంలో వందలాది శవాలను రోజూ కాల్చేవారు. దేశంలోని ప్రతి ప్రాంతంలో ఈ మహమ్మారి బారిన పడి వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. తొలుత స్పెయిన్‌లో గుర్తించడంతో దీన్ని స్పానిష్ ఫ్లూ గా వ్యవహరించారు
దొంగ లాగా వచ్చింది..
భారత్‌లోకి ఈ వైరస్ దొంగలాగా వచ్చింది. మొదటి ప్రపంచయుద్ధ సమయంలో సైనికులు కందకాలు తవ్వేవారు. అందులోనే అధిక సమయం గడిపేవారు. పారిశుద్ధ్య పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉండేవి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ వైరస్ పుట్టుకొచ్చింది. మొదట్లో యూరప్‌కు పరిమితమైన వైరస్ నౌకల ద్వారా భారత్‌లోకి దొంగలాగా ప్రవేశించింది. బాంబే పోర్టులోని సిబ్బందికి ఈ వ్యాధి సోకింది. మొదట్లో దీనిని వైద్య సిబ్బంది గుర్తించలేకపోయారు. మలేరియా లక్షణాలున్నా మలేరియా కాకపోవడంతో వైద్యులకు దీని గురించి అంతుపట్టలేదు. క్రమంగా వ్యాధిన పడేవరిసంఖ్య వందల్లోకి వేలల్లోకి వెళ్లిపోయింది.
బ్రిటిషు పాలకుల నిర్లక్ష్యం..
ఈ వైరస్‌ను కట్టడి చేయడంలో అప్పటి వలస పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం ప్రదర్శించారు. అప్పట్లో వైద్యుల్లో అధిక భాగం శ్వేతజాతీయులే. దీంతో తమకు ఎక్కడ అంటుకుంటుందోనన్న భయంతో దూరంగా ఉండిపోయారు..ఫలితంగా లక్షల మంది బలయ్యారు.
బాంబే జ్వరం
తొలినాళ్లలో ఈ వ్యాధి బాంబేలో బయటపడింది. దీంతో బాంబే ఫీవర్ అని పిలిచేవారు. 1918 నుంచి 1920 వరకు ఈ మహమ్మారి విలయతాండవం చేసింది. మొదటి దశలో వృద్ధులపై ప్రతాపం చూపించగా రెండో దశలో యువత సైతం బలవ్వడం గమనార్హం. 1920 చివరి కల్లా వ్యాధి మాయమైంది. మందులు రావడంతో పాటు మానవుల్లో రోగ నిరోధక వ్యవస్థ బలపడటంతో ఆ మహమ్మారి అంతరించింది.
సామాజిక దూరం పాటించడంతో..
అప్పట్లోనే ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో ఈ వ్యాధి విస్తరణను అడ్డుకునేందుకు లాక్డౌన్ ప్రకటించారు. యూరప్, అమెరికాల్లో సామాజిక దూరాన్ని పాటించారు. దీంతో వ్యాధి విస్తరణ తగ్గింది. తాజాగా కరోనా వైరస్ నియంత్రణలో ఇదే వ్యూహాలను పాటిస్తున్నారు. సామాజికదూరాన్ని పాటిస్తే రానున్నరోజల్లో కరోనాకు ముక్కుతాడు వేయగలం.