
వార్తలు / కథనాలు
కరోనా వల్ల ప్రపంచమంతా లాక్డౌన్ అయింది. ప్రజలంతా ఇంటికే పరిమితమయ్యారు. కనీసం బయటకు కూడా వెళ్లడానికి వీలు లేని ఈ సమయంలో గిన్నిస్ రికార్డు కొట్టే అవకాశం వచ్చింది. ఏ విషయంలో ప్రయత్నించాలి? ఎంత సాధన చేయాలి? దరఖాస్తు ఎలా చేయాలన్న మీమాంసాలొద్దు. ఎందుకంటే.. గిన్నిస్ వరల్డ్ రికార్డు సంస్థే.. ప్రజలకు ఓ ఛాలెంజ్ విసిరింది. ఇంట్లోనే ఉండి ఆ ఛాలెంజ్‌లో పాల్గొంటే చాలు. అదెలా అంటారా వివరాలు ఇదిగో..
లాక్డౌన్.. హోం క్వారంటైన్‌తో ప్రజలు కాస్త విసిగిపోతున్నారు. ఇది గమనించిన గిన్నిస్ వరల్డ్ రికార్డు సంస్థ.. ఓ వినూత్న ఛాలెంజ్‌ను ప్రజల ముందుకు తీసుకొచ్చింది. అదేంటంటే.. టాయిలెట్ పేపర్ రోల్‌ను కాలితో ఫుట్బాల్లా ఎగరేస్తుండాలి. చేతులు, మోచేతులు మినహా శరీరంలో ఏ భాగంతోనైనా రోల్‌ను ఎగరేయొచ్చు. 30 సెకన్ల పాటు టాయిలెట్ పేపర్ రోల్ కింద పడకుండా ఎగరేస్తూ తీసిన వీడియోను #GWRCHallenge హ్యాష్ ట్యాగ్ జతచేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాలి. 30 సెకన్లలో ఎవరు ఎక్కువసార్లు టాయిలెట్ పేపర్ రోల్‌ను కిందపడకుండా ఎగరేస్తారో వారు గిన్నిస్ రికార్డు సాధించినట్లు.
ప్రతీ సోమవారం ఆ వారం రోజుల్లో వచ్చిన వీడియోలను గమనించి విజేతను సంస్థ ప్రకటిస్తుంది. ప్రతి వారం ఈ రికార్డును బద్దలుకొట్టే అవకాశముంటుంది. అయితే దీనికి కొన్ని నిబంధనలున్నాయి. పేపర్ రోల్‌ను ఎగరేసే క్రమంలో చేతులు, మోచేతులు ఉపయోగించకూడదు. కెమెరా ముందుకొచ్చాక 3, 2, 1 రెడీ అనుకున్న తర్వాతే ప్రారంభించాలి. ఎగరేస్తున్న క్రమంలో 30 సెకన్ల లోపు పేపర్ రోల్ కిందపడినా, గోడకు.. కుర్చీలకు తగిలినా ప్రయత్నం విఫలమైనట్లే. ముఖ్యంగా వీడియో ఒకే టేక్‌లో ఉండాలి. ఎడిట్ చేసినా, వీడియోలో కట్స్ కనిపించినా ఆ వీడియో అనర్హతకు గురవుతుంది. మరెందుకు ఆలస్యం మీరూ ఆ వీడియో తీసి.. ఫేస్బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రాంలో అప్లోడ్ చేయండి. రికార్డు సాధించండి.. ఆల్ ది బెస్ట్.