
వార్తలు / కథనాలు
కరోనా వైరస్ వల్ల దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతోంది. దీంతో ఐటీ, కార్పొరేట్ సంస్థలు ఇళ్ల నుంచే కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. మరికొన్ని రోజుల్లో లాక్డౌన్ ఎత్తివేసినా చాలా మంది ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోం ద్వారానే విధులు నిర్వహించే అవకాశముందని నివేదికలు చెబుతున్నాయి. వర్క్ ఫ్రమ్ హోం అంటే ఏముందిలే.. ఇంట్లోనే హాయిగా కూర్చొని పని చేసుకోవచ్చు అనుకుంటారు. కానీ.. వీడియో సమావేశాలు జరిగినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తలు పాటించాలి. లేకపోతే.. ఉద్యోగులపై కొంత ప్రతికూల అభిప్రాయాలు వచ్చే అవకాశముంది. అందుకే తరచూ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనేవారి కోసం కొన్ని సూచనలు.
చుట్టూ పరిసరాలు శుభ్రం చేసుకోండి
ఆఫీస్‌లో డెస్క్ లేదా కాన్ఫరెన్స్ హాల్ శుభ్రంగా ఉంటుంది కాబట్టి ఎలాంటి సమస్య లేదు. అదే ఇంట్లో ఉన్నప్పుడు చుట్టూ పరిసరాలు శుభ్రంగా ఉండేలా మనమే చూసుకోవాలి. వీడియో కాల్ సమయంలో పక్కన దిండ్లు, బట్టలు, పిల్లల ఆట వస్తువులు లాంటి కనిపిస్తే.. అవతలి వ్యక్తికి, మీకు ఇబ్బందిగా ఉంటుంది. అలాగే వీడియోకాల్ గురించి కుటుంబ సభ్యులకు ముందే చెప్పి అంతరాయం కలిగించకుండా జాగ్రత్త పడండి. లేదంటే కాల్ మధ్యలో వచ్చి ఇబ్బంది పెట్టడం ఇటీవల ఓ వైరల్ వీడియోలో చూసే ఉంటారు.
కెమెరాను సరైన దిశలో పెట్టండి
మనం మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్లు మన ముఖాన్ని, కళ్లని గమనిస్తారు. కాబట్టి వీడియో కాన్ఫరెన్స్ సమయంలో మీ ముఖం బాగా కనిపించే విధంగా ల్యాప్‌టాప్ క్యామ్, లేదా వెబ్‌క్యామ్ దిశను సరిచేసుకోండి. వీలైనంతగా కెమెరా వైపే చూడటానికి ప్రయత్నించండి.
హెడ్‌ఫోన్స్ తప్పనిసరిగా పెట్టుకోండి
వీడియో కాన్ఫరెన్స్ సమయంలో హెడ్‌ఫోన్స్ తప్పనిసరిగా పెట్టుకోండి. ఎందుకంటే కాల్లో తోటి ఉద్యోగులు, ఉన్నతాధికారులు, క్లయింట్స్ పాల్గొంటుంటారు. దాని వల్ల ఇంట్లో వాళ్లకు మీరు ఏదో మీటింగ్‌లో ఉన్నారని తెలుస్తుంది. అలాగే మీరు వాడే హెడ్‌ఫోన్‌లో నాయిస్ క్యాన్సిలేషన్ సదుపాయం ఉండేలా చూసుకోండి. దాని వల్ల మీ పిల్లల అల్లరి, ఇంటి బయట శబ్దాలు, శునకాల అరుపులు కాల్లో ఇతరులకు వినపడవు. భారీ శబ్దాలైతే కాస్త చిన్నగా వినిపిస్తాయి కాబట్టి పెద్ద సమస్య ఉండదు.
ఆ సమయంలో నోటిఫికేషన్స్ ఇబ్బందే
మనకు నచ్చిన అంశాలపై నోటిఫికేషన్స్ రూపంలో అప్డేట్స్ పొందుతుంటాం. కానీ, వీడియో కాన్ఫరెన్స్ జరుగుతున్నప్పుడు అవే మీకు ఇబ్బంది కలిగించవచ్చు. సీరియస్‌గా సమావేశంలో పాల్గొంటున్నప్పుడు నోటిఫికేషన్స్ మీ ఏకాగ్రతకు భంగం కలిగించడమే కాకుండా.. వీడియో గ్రూప్ కాల్ ఉన్నవారికి విసుగు తెప్పించొచ్చు. కాబట్టి పనిలో ఉన్నప్పుడు నోటిఫికేషన్స్‌ను ఆఫ్ చేయండి. డోంట్ డిస్ట్రబ్ ఆప్షన్‌ను యాక్టివేట్ చేసుకుంటే ఇంకా మంచిది.
కాస్త విరామం తీసుకోండి
విధుల్లో భాగంగా చాలా వీడియో కాన్ఫరెన్స్‌ల్లో మాట్లాడాల్సి వచ్చిన్పపుడు.. కాల్స్ మధ్యలో కొన్ని నిమిషాలు విరామం తీసుకోండి. ఈ సమయాన్ని కాస్త రిలాక్స్ అవడంతోపాటు ఇప్పటివరకు జరిగిన సమావేశంలో ముఖ్యమైన అంశాలను నోట్‌బుక్‌లో రాసుకోవడానికి కేటాయించండి. దీని వల్ల మీటింగ్స్ సారాంశాన్ని మరచిపోవడం లాంటి ఇబ్బందులు ఉండవు. తదుపరి వీడియోకాల్‌కు సన్నద్ధమవడానికి కూడా ఈ విరామం ఉపయోగపడుతుంది.
తొందరొద్దు.. నిదానంగా మాట్లాడండి
పని పూర్తి చేయాలన్న తొందరలో వీడియో కాన్ఫరెన్స్‌లో వేగంగా మాట్లాడకండి. గ్రూప్ కాల్లో ఉన్న వారికి మీరు చెప్పింది అర్థంకాకపోవచ్చు. నిదానంగా మాట్లాడండి.. ఒక క్షణం విరామం తీసుకోవాలనుకుంటే చిన్న నవ్వు నవ్వండి.. దీని వల్ల మీరు గాబరా పడుతున్నా, ప్రసంగానికి సిద్ధంగా లేకున్నా.. ఎదుటివాళ్లకు అలా కనిపించదు.
ఆడియో మ్యూట్ చేయండి.. వీడియో హైడ్ చేయండి
సుదీర్ఘంగా జరుగుతున్న వీడియో కాన్ఫరెన్స్‌లో మీరు మాట్లాడే అవకాశం లేనప్పుడు.. లేదా మీరు మాట్లాడటం అయిపోగానే మీ ఆడియోను మ్యూట్ చేయండి. తద్వారా అనవసర శబ్దాలు ఇతరులకు వినపడకుండా ఉంటుంది. అలాగే గ్రూప్ కాల్లో మీ భాగస్వామ్యం పూర్తయినా.. లేదా మీరు గ్రూప్‌లో ఉండి.. మీ అవసరం లేకపోయినా కాస్త విరామం తీసుకోండి. ఆ సమయంలో వీడియోను హైడ్ చేయండి.
వీడియో కాల్ రికార్డు చేయండి
వీడియో కాన్ఫరెన్స్ సమయంలో ముఖ్యమైన అంశాలను నోట్ చేసుకోవాల్సి రావొచ్చు. హడావిడిగా పేపర్‌పై రాసుకోవడం బదులు వీడియో కాల్ రికార్డు సదుపాయం ఉంటే రికార్డు చేసుకోవడం ఉత్తమం. దీనివల్ల సమావేశంలోని ముఖ్య అంశాలను కాల్ ముగిసిన తర్వాత కాస్త నింపాదిగా నోట్ చేసుకొనే అవకాశం ఉంటుంది. అలాగే సమావేశం సారాంశాన్ని మరోసారి విశ్లేషించుకోవచ్చు.
అంతరాయం కలిగించకుండా చాట్ ఫంక్షన్ వాడండి
వీడియో కాన్ఫరెన్స్ ముగిసిన తర్వాత ప్రశ్నోత్తరాల సమయంలో ఒకేసారి అందరూ ప్రశ్నలు లేవనెత్తడమో.. సమాధానం చెప్పడమో జరుగుతుంది. దీంతో గందరగోళం ఏర్పడొచ్చు. దీనికి బదులు చాట్ ఫంక్షన్‌ను ఉపయోగించండి. తద్వారా వీడియోకాల్ సభ్యుల ప్రశ్నలు.. సమాధానాలు స్పష్టంగా వినిపిస్తాయి.
లాగ్ఆఫ్ మర్చిపోకండి
వీడియోకాన్ఫరెన్స్ పూర్తయ్యాక లాగ్ఆఫ్ అవడం మర్చిపోకండి. లాగ్ఆఫ్ కాకుండా వెళ్లిపోతే.. మీరు కాల్ తర్వాత చేసే పనులు, జరిపే సంభాషణలు ఇతరులకు కనిపిస్తాయి.. వినిపిస్తాయి. కాబట్టి ఒకటి రెండు సార్లు లాగ్ఆఫ్ పూర్తిగా అయ్యారో లేదో సరిచూసుకోండి.
- ఇంటర్నెట్ డెస్క్