
వార్తలు / కథనాలు
కరోనా నేపథ్యంలో విధించిన ఈ లాక్డౌన్లో ఆఫీసులు, దుకాణాలే కాదు.. ఫంక్షన్‌హాల్స్ కూడా మూతపడ్డాయి. దీంతో అనేక కుటుంబాలు తమ ఇంట్లో వివాహాది శుభాకార్యాలను వాయిదా వేసుకున్నాయి. అయినా కొన్ని జంటలు మాత్రం వీడియోకాల్స్ వేదికగా డిజిటల్ వివాహాలు చేసుకుంటున్నాయి. కొందరు పోలీసులు అనుమతి తీసుకొని నిరాడంబరంగా ఒకటవుతున్నారు. మరికొందరైతే.. లాక్‌డౌన్‌ను లెక్కచేయకుండా వివాహం కోసం సాహసాలు చేశారు. అందులో కొందరు విజయం సాధిస్తే.. మరికొందరు విఫలమయ్యారు. గత నెలలో జరిగిన కొన్ని వివాహాల సంగతులు ఒకసారి చూస్తే..
వివాహం కోసం అర్ధరాత్రి కోర్టును తెరిపించారు
హరియాణలోని రోహతక్‌కు చెందిన నిరంజన్ కశ్యప్‌కి ఓ లెర్నింగ్ యాప్ ద్వారా మెక్సికోకి చెందిన డానా జొహెరీ ఒలివెరోస్ క్రూజ్ అనే యువతి పరిచయమైంది. అది కాస్త ప్రేమగా మారింది. దీంతో ప్రత్యేక వివాహ చట్టం ద్వారా ఈ ఏడాది వివాహం బంధంతో ఒక్కటవ్వాలనుకున్నారు. ఈ మేరకు గత ఫిబ్రవరి 17న దరఖాస్తు చేసుకోగా.. నెల రోజుల నోటీసు పీరియడ్ ఇచ్చారు. అది పూర్తయి వివాహ ఏర్పాట్లు చేసుకుంటుండగా లాక్డౌన్ అమల్లోకి వచ్చింది. వారి వివాహానికి బ్రేక్ పడింది. దీంతో నిరంజన్.. తన వివాహం జరిపించాలని కోరుతూ న్యాయవాది ద్వారా కోర్టులో దరఖాస్తు పెట్టుకున్నాడు. మెక్సికో ఎంబసీ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కూడా పొందడంతో న్యాయమూర్తి వివాహం జరిపించడానికి ఒప్పుకొన్నారు. దీంతో ఏప్రిల్ 13న రాత్రి వేళ కోర్టు తలుపులు తెరిపించి మరీ న్యాయమూర్తి సమక్షంలో నిరంజన్.. డానా ఒక్కటయ్యారు.
పోలీసు జీపులో వరుడి ఎంట్రీ
దిల్లీకి చెందిన ఓ కుటుంబం తన కుమారుడి వివాహం అంగరంగ వైభవంగా చేయాలనుకుంది. కానీ లాక్డౌన్ వల్ల వారి ఆశలు ఆవిరయ్యాయి. అయినా అనుకున్న ముహూర్తానికి(ఏప్రిల్ 25) వివాహం చేయాలని భావించారు. ఈ మేరకు ఆర్య సమాజ్‌లో నిరాడంబరంగా పెళ్లి ఏర్పాట్లు చేశారు. వధువు అప్పటికే ఆర్యసమాజ్‌కు చేరుకోగా.. ఆంక్షల దృష్ట్యా సొంత వాహనాలపై వెళ్లడానికి వరుడు కౌశల్ కుటుంబానికి సాధ్యపడలేదు. దీంతో కౌశల్ తండ్రి నరేశ్ అహ్లూవాలియా పోలీసులను సంప్రదించాడు. కేవలం కుటుంబసభ్యుల మధ్యనే వివాహం జరుపుతున్నామని తెలపడంతో పోలీసులు వారికి సాయం చేసేందుకు ముందుకొచ్చారు. పోలీసు జీపులో వరుడు కుటుంబాన్ని వివాహవేదిక వద్దకు తీసుకెళ్లడమే కాదు.. పెళ్లి తంతు పూర్తయ్యాక వరుడు, వధువును తిరిగి ఇంటి వద్ద దింపారు.
సైకిల్‌పై 100కి.మీ ఒక్కడిగా వెళ్లి.. జంటగా వచ్చాడు
ఉత్తర్‌ప్రదేశ్‌లోని హమీర్పుర్ జిల్లా పౌతియా గ్రామానికి చెందిన 23 ఏళ్ల కల్కు ప్రజాపతికి వివాహం చేయాలని పెద్దలు నిర్ణయించారు. ఈ మేరకు ఐదు నెలల క్రితమే పొరుగు జిల్లాలోని పుతియా గ్రామానికి చెందిన రింకి అనే యువతితో వివాహం నిశ్చయమైంది. ఏప్రిల్ 25న వివాహం. లాక్డౌన్ నేపథ్యంలో పెళ్లి అనుమతి కోసం కల్కు స్థానిక పోలీస్ స్టేషన్లో దరఖాస్తు చేసుకున్నాడు. చివరి రోజు వరకు అనుమతి రాకపోవడంతో ఎలాగైనా వధువు ఊరికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. వివాహం రోజు ఉదయమే కల్కు మాస్కు ధరించి సైకిల్‌పై పుతియాకు బయలుదేరాడు. ఒక్కడే 100 కి.మీ ప్రయాణించి వివాహం సమయానికి గమ్యం చేరుకున్నాడు. స్థానిక గుడిలో రింకు తల్లిదండ్రులు కన్యాదానం చేయడంతో వెంటనే భార్యను వెంటబెట్టుకొని సైకిల్‌పైనే తిరిగి సొంతూరుకు వచ్చేశాడు.
‘‘వివాహం వాయిదా వేద్దామనుకుంటే మా అమ్మ ఆరోగ్యం బాగోలేదు.. ఇంట్లో పరిస్థితులు బాగాలేవు. వధువు తల్లిదండ్రులు శుభలేఖలు కూడా పంచేశారు. లాక్డౌన్ ఎప్పుడు ఎత్తివేస్తారో తెలియదు. అందుకే ఒంటరిగా అంతదూరం వెళ్లి పెళ్లి చేసుకున్నా’’అని కల్కు చెప్పుకొచ్చాడు.
పోలీస్‌స్టేషనే కల్యాణమండపమైన వేళ
ఉత్తర్‌ప్రదేశ్‌లోని చాందౌలీ జిల్లా మాహుజీ గ్రామానికి చెందిన అనిల్‌కు.. ఘాజీపుర్ జిల్లాకు చెందిన జ్యోతితో ఏప్రిల్ 20న వివాహం జరపాలని ఇరు కుటుంబ పెద్దలు నిర్ణయించారు. లాక్డౌన్ నేపథ్యంలో ఎక్కువ మంది ఒక్కచోట ఉండరాదన్న నిబంధనలు ఉన్నాయి. ఏం చేయాలో పాలుపోని వరుడు అనిల్ దీనా పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించాడు. పోలీసులు ఇరు వర్గాల నుంచి ఐదుగురు చొప్పున మాత్రమే వస్తే వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తామని తెలిపారు. దీంతో ఇరు కుటుంబాలు దీనా పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నాయి. స్టేషన్ ఆవరణలో ఉన్న శివుడి గుడి ముందు.. పోలీసుల సమక్షంలో జ్యోతి, అనిల్ వివాహం జరిగింది.
పెళ్లి కోసం కష్టపడి వెళితే.. క్వారంటైన్‌కు పంపారు
సోనూ కుమార్‌ది ఉత్తరప్రదేశ్‌లోని నేపాల్ సరిహద్దుగా ఉన్న ఓ జిల్లా. ఉపాధి నిమిత్తం పంజాబ్‌లోని లుధియానాకి వలస వెళ్లాడు. 24ఏళ్ల సోనూకు పెద్దలు ఏప్రిల్ 15న వివాహం నిశ్చయించారు. లాక్డౌన్ వల్ల లుధియానాలోనే చిక్కుకుపోయిన సోనూ.. మరో మార్గం లేక మరో ఇద్దరు మిత్రులతో కలిసి స్వగ్రామానికి సైకిల్‌పై తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. అలా రాత్రి, పగలూ సైకిల్ తొక్కుకుంటూ వారం రోజుల్లో 850 కిలోమీటర్లు ప్రయాణించాడు. మరో 150 కిలోమీటర్లు వెళితే సొంతూరికి చేరుకునేవాడే. కానీ, సొంత జిల్లాలోకి ప్రవేశిస్తున్న సమయంలో సరిహద్దులో పోలీసులు అడ్డుకున్నారు. ప్రయాణ వివరాలు తెలుసుకున్న వారు.. ముందు జాగ్రత్తగా క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించి నెగిటివ్ అని తేలితే 14 రోజుల పర్యవేక్షణ తర్వాత ఇంటికి పంపుతామని తేల్చిచెప్పారు. అలా పెళ్లికోసం వెళ్లిన సోనూ క్వారంటైన్‌కు చేరుకున్నాడు.
పోలీసులు వరుడిని కాపాడారు.. దిగబెట్టారు
దిల్లీకి చెందిన భూపేంద్ర ఏప్రిల్ 27న వివాహం చేసుకోవడానికి పోలీసుల అనుమతి తీసుకున్నాడు. ఈ మేరకు ఏర్పాట్లు చేసుకున్నాడు. ఆ రోజు తన కారులో వివాహవేదిక వద్దకు వెళ్తుండగా.. అతడి కారు నుంచి మంటలు చెలరేగాయి. లాక్డౌన్ విధుల్లో ఉన్న పోలీసులు మంటలను గమనించి కారును ఆపి భూపేంద్రను బయటకు లాగారు. క్షణాల వ్యవధిలో మంటలకు కారు పూర్తిగా దగ్ధమైంది. వివాహం గురించి తెలుసుకున్న పోలీసులు వారి జీపులో భూపేంద్రను తీసుకెళ్లి వేదిక వద్ద దిగబెట్టారు. దీంతో అనుకున్న సమయానికి భూపేంద్ర వివాహమైంది.
అంబులెన్స్‌లో వెళ్లి.. ఆ తర్వాత పోలీసులకు చిక్కి..
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఖాతౌలికి చెందిన హజీ ఇస్రార్ తన కుమారుడికి ఘజియాబాద్ జిల్లాలోని దాస్నా ప్రాంతానికి చెందిన ఓ యువతితో వివాహం చేయాలని నిర్ణయించాడు. ఏప్రిల్ 28న మూహూర్తం పెట్టుకున్నారు. అయితే హజీ ఉంటున్న ఇస్లామ్ నగర్ కాలనీలో ఐదు కరోనా కేసులు బయటపడటంతో ఆ ప్రాంతాన్ని హాట్‌స్పాట్‌గా మార్చారు. బయటకు వెళ్లే వీలు లేకున్నా.. ఎట్టిపరిస్థితుల్లో వివాహం జరపాలని భావించాడు. దీంతో ఓ అంబులెన్స్‌ను మాట్లాడుకొని పెషేంట్లా నాటకమాడి కుమారుడితోసహా ఘజియాబాద్‌కు చేరుకున్నాడు. అక్కడ వివాహం జరిపించి వధువును తమ వెంట తీసుకొచ్చాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న హజీ పొరుగింటివాళ్లు పోలీసులకు సమాచారం అందించడంతో హజీ.. అతని కుమారుడు, కోడలితోపాటు అంబులెన్స్ డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
పెళ్లికి వెళ్లేందుకు విఫలయత్నం.. వరుడు సహా ఏడుగురు అరెస్టు
ఘజియాబాద్‌కు చెందిన తజుద్దీన్కు ఏప్రిల్ 13న వివాహం జరగాల్సి ఉంది. లాక్డౌన్ అమలు, పోలీసులు పహారా ఉండటంతో వారి కన్నుగప్పి మేరఠ్‌లోని వివాహ వేడుకకు వెళ్లాలని భావించారు. ఈ మేరకు వరుడు, అతడి బంధువులు ఆరుగురు అర్ధరాత్రి మేరఠ్‌కు వెళ్లేందుకు యత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించినందుకు వారిని అరెస్టు చేశారు.
శ్రీవారి ముందు పెళ్లనుకుంటే.. గరుత్మంతుడి ముందు జరిగింది
ఏపీలోని కృష్ణా జిల్లాకు చెందిన ఓ జంట మార్చి 21న తిరుమల శ్రీవారి ముందు వివాహం చేసుకోవాలని భావించింది. ఈ మేరకు కుటుంబ సభ్యులతో తిరుమల చేరుకున్నారు. అప్పటికే కరోనా వ్యాప్తి నేపథ్యంలో కొండపైకి వెళ్లే రూట్లను తితిదే మూసివేసింది(లాక్‌డౌన్‌కు ముందు). పెళ్లి బృందం కొండపైకి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అలిపిరి వద్ద అడ్డుకున్నారు. చేసేదేమి లేక అలిపిరిలోని గరుడ విగ్రహం వద్ద పోలీసుల సమక్షంలో ఆ జంట వివాహం చేసుకుంది.
- ఇంటర్నెట్ డెస్క్