
వార్తలు / కథనాలు
మూడు నెలల కిందట ఎవరైనా ఊహించారా.. గడప దాటకుండా ఇంట్లోనే ఉండిపోతామని.. సినిమాలు.. షికార్లు బంద్ అవుతాయని? కలలో కూడా ఎవరూ అనుకొని ఉండరు. కానీ కరోనా మహమ్మారి.. అందరి జీవితాలను తలకిందులు చేసింది. ఈ వైరస్‌కు విరుగుడు మందు వచ్చే వరకూ మనల్ని వదిలిపోదు.. అందుకే కరోనాతో కలిసి జీవించడం నేర్చుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. లాక్డౌన్ ఎత్తివేసినా.. సాధారణ జీవితాన్ని గడపలేం. ఒక కొత్త విధానంలో జీవించడానికి అలవాటుపడాల్సి రావడం ఖాయం. ఈ నేపథ్యంలో లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత ఇంటా బయట, ఆఫీసుల్లో కొన్ని విషయాల్లో మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం..
బయటకు వెళ్లాలంటే మాస్కులు
ఇదివరకు బయటకు వెళ్లాలనుకోవడమే లేటు.. ఉన్నఫళంగా వెళ్లేపోయేవాళ్లు. ఇప్పుడు.. ఇకపై కొన్ని ఆయుధాలు సిద్ధం చేసుకొని వెళ్లాల్సిందే. ముఖానికి మాస్కు, చేతికి గ్లౌజులు, జేబులో శానిటైజర్ పెట్టుకోక తప్పదు. భౌతిక దూరం పాటిస్తూనే బయట పనుల్ని చక్కదిద్దుకోవాల్సి ఉంటుంది. ఇంటికి తిరిగొచ్చిన కాళ్లు, చేతులు, ముఖం శుభ్రంగా కడుక్కోవడం తప్పనిసరైపోతుంది. వీలైతే వేడి నీళ్లతో స్నానం చేస్తే మరీ మంచిది.
పలకరింపులో భారీ మార్పు..
ఓ వ్యక్తి ఎదురైనప్పుడు పలకరించే విధానం ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటుంది. కానీ, ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా షేక్ హ్యాండ్స్ ఇస్తారు. ఇప్పుడు అది పూర్తిగా కనుమరుగువుతుంది. కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకే అంటువ్యాధి కావడంతో షేక్ హ్యాండ్స్ ఇచ్చే ధైర్యం ఎవరు చేయకపోవచ్చు. మన దేశంలో ప్రాచీనకాలం నుంచి పలకరింపులో భాగంగా రెండు చేతుల్ని జోడించి నమస్కారం పెట్టే అలవాటుంది. ఇప్పుడు అదే ప్రపంచ దేశాలు పాటిస్తున్నాయి. ఇకపై అలాగే పాటిస్తాయి. లేకపోతే కరోనా కాటేసే అవకాశముందిగా..
షాపింగ్.. అంత సులువు కాదు
ఇదివరకు షాపింగ్‌కి వెళ్లాలంటే డబ్బులు ఉంటే సరిపోయేది. ఇప్పుడు అలా కుదరదు. మార్కెట్‌కు మాస్కులు ధరించే వెళ్లాల్సి ఉంటుంది. సొంత సంచి తీసుకెళ్లాలి. అక్కడ ఏది కొనుగోలు చేసిన, దేన్ని పట్టుకున్నా.. తర్వాత శానిటైజర్‌తో చేతులను శుభ్రం చేసుకోవాల్సిందే. మార్కెట్‌కు అనేక మంది వస్తుంటారు. దీంతో వైరస్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే సరుకులు తెచ్చుకోవాలన్నా మనం జీవితాన్ని పణంగా పెట్టినట్టుగానే ఉంటుంది. రాబోయే రోజుల్లో అపాయింట్మెంట్ తీసుకొని షాపింగ్ చేయాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆన్లైన్ షాపింగ్ అందుబాటులో ఉంది. రానున్న రోజుల్లో వర్చువల్ షాపింగ్‌కే ఎక్కువమంది ప్రాధాన్యమివ్వొచ్చు.
ఆన్లైన్ పేమెంట్స్ మాత్రమే
ఆర్థిక లావాదేవీలు పారదర్శకంగా ఉండాలని ఆన్లైన్ పేమెంట్స్లను ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. అయినా చాలా మంది నగదుతోనే లావాదేవీలు జరుపుతున్నారు. అయితే కరెన్సీ నోట్ల ద్వారా కూడా కరోనా వైరస్ సోకుతుందని ప్రచారముంది. దీంతో నోట్లతో కొనుగోళ్లు చాలా వరకు తగ్గిపోయింది. దీనికి బదులు ఆన్లైన్ చెల్లింపులు చేస్తున్నారు. ఇకపై కూడా అదే కొనసాగనుంది.
స్ట్రీట్‌ఫుడ్.. రిస్క్ ఫుల్
రోజులో ఒక్కసారైన వీధుల్లో చిరుతిళ్లు, రెస్టారెంట్ ఫుడ్ తినని వారుండరంటే అతిశయోక్తి కాదు. కానీ లాక్డౌన్లో అవీ మూతపడ్డాయి. లాక్డౌన్ తర్వాత తెరుచుకున్నా.. ఎప్పటిలాగా కొనసాగుతాయన్న నమ్మకం లేదు. స్నేహితులతో కలిసి వెళ్లే ఇలాంటి ప్రాంతాలకు కరోనా సోకిన వాళ్లూ వస్తే.. అనేకమంది వైరస్ బారిన పడే అవకాశాలుంటాయి. అందుకే రెస్టారెంట్లకు వెళ్లే వారి సంఖ్య తగ్గిపోవచ్చు. లేదా.. చిన్న చిన్న రెస్టారెంట్లు కూడా రిజర్వేషన్లు పెట్టి పరిమిత సంఖ్యలో కస్టమర్లకు సేవలు అందించే అవకాశముంది.
స్నేహితులతో జల్సాలు కష్టమే
స్నేహితులతో కలిసి బయటకు వెళ్లడం.. ఒక చోట కూర్చొని కబుర్లు చెప్పుకోవడం సాధారణం. కరోనా వల్ల ఇప్పుడు అది సాహసంతో కూడుకున్న పని. స్నేహితులంతా వేర్వేరు చోట్లలో ఉంటారు. ఎవరి ప్రాంతంలో అయినా కరోనా వైరస్ సోకిన వ్యక్తులు ఉండి.. స్నేహితుడికి తద్వారా స్నేహ బృందానికి అక్కడి నుంచి వారి కుటుంబసభ్యులకు వ్యాపించే అవకాశం ఉంది. కాబట్టి.. ఈ లాక్డౌన్ సమయంలో ఫోన్.. వీడియో కాల్స్ ద్వారా మాట్లాడినట్లే లాక్డౌన్ తర్వాత కూడా ఇలాగే కొనసాగొచ్చు.
ఎలివేటర్.. యమ డేంజర్
ఆఫీసుల్లో అయినా.. షాపింగ్ మాల్స్‌లో అయినా ఎలివేటర్లో ఒకేసారి ఎక్కువ మంది ఎక్కుతుంటారు. దీంతో భౌతికదూరం ఉండదు.. దీంతో ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకే అవకాశం అధికంగా ఉంటుంది. ఇప్పటికే కొన్ని చోట్ల ఎలివేటర్లో భౌతికదూరం పాటిస్తూ ఒక్కసారి ముగ్గురు, నలుగురికి మించి ఎక్కకుండా నిబంధనలు పెట్టారు. ఇకముందు అది కొసాగబోతుంది.
కార్యాలయాల్లో మార్పులు
కరోనా దెబ్బకు అనేక సంస్థలు మూతపడ్డాయి. ఐటీ వంటి కొన్ని రంగాల్లో ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నారు. లాక్డౌన్ ఎత్తివేశాక కార్యాలయాలు తెరుచుకుంటాయి. అయినా వర్క్ ఫ్రమ్ హోం కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ కార్యాలయాలకు వచ్చినా ఉద్యోగులు కూర్చొనే విధానంలో మార్పులు వస్తాయి. కూర్చొనే సీట్ల మధ్య వీలైనంత దూరం పెంచుతారు. కెఫెటేరియా, క్యాంటీన్లలో సామాజిక దూరం పాటించాల్సి ఉంటుంది. మీటింగ్స్‌ను ఎక్కువ మంది ఉద్యోగులతో కాకుండా వీలైనంత తక్కువ మందితో ఉండేలా చర్యలు తీసుకుంటారు. శానిటైజర్లను అందుబాటులో ఉంచుతారు. పాఠశాలలు దాదాపు ఇదే పద్ధతిని పాటించే అవకాశాలున్నాయి.
ప్రతి ఇంట్లో టెలీ మెడిసిన్
పాశ్చాత్య దేశాల్లో ఎక్కువగా వినియోగించే టెలీ మెడిసిన్.. కరోనా వల్ల మన దేశంలోనూ అందుబాటులోకి వచ్చింది. ఆస్పత్రుల్లో కరోనా వ్యక్తులు ఉండే అవకాశం ఉండటంతో అక్కడి వెళ్లాలంటే సాధారణ ప్రజలు భయపడుతున్నారు. చిన్న జబ్బు కోసం వెళ్తే కరోనా అంటుకుంటుందేమోనని ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో టెలీ మెడిసిన్ ప్రజలకు చేరువవుతోంది. ఎలాంటి సమస్యలున్నా.. టెలీ మెడిసిన్ ద్వారా ఇంటి నుంచే చికిత్స తీసుకునే వీలు కలుగుతుంది. భవిష్యత్తులోనూ ఇది విస్తృతంగా వినియోగంలోకి రానుంది.
అప్పుడప్పుడు కరోనా టెస్టులు
కరోనా వైరస్ పూర్తిగా కనుమరుగువుతుందని ఎవరూ చెప్పలేకపోతున్నారు. దీంతో లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నా.. అప్పుడప్పుడు హెల్త్ చెకప్లాగే కరోనా టెస్టులు చేసుకోవాల్సి రావొచ్చు. లక్షణాలు కనపడకున్నా ఈ వ్యాధి సోకుతోంది. ఆరోగ్యంగా ఉన్నామనుకొని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలమీదకు వచ్చే ప్రమాదముంది.
స్టేడియంలో కాదు.. టీవీల్లోనే
కరోనా వల్ల ఎక్కువ మంది ఒకేచోట గుమ్మిగూడే పరిస్థితి లేదు. ఈ ప్రభావం క్రీడలపై ఎక్కువగా పడుతుంది. దీంతో క్రికెట్, తదితర ఆటలు చూడటానికి ప్రేక్షకులు స్టేడియం వద్దకు రావడం అనుమానమే. ఆటగాళ్లు ఖాళీ స్టేడియాల్లోనే ఆడాల్సి రావొచ్చు. ప్రజలు టీవీల్లోనే ఆ ఆటలు చూసేందుకు ఇష్టపడొచ్చు.
- ఇంటర్నెట్ డెస్క్