
వార్తలు / కథనాలు
కరోనా వైరస్ బాధితులను ట్రాక్ చేయడానికి, కరోనాకు సంబంధించిన విషయాలు తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య సేతు యాప్ తీసుకొచ్చింది. స్మార్ట్‌ఫోన్ వినియోగించే ప్రతి ఒక్కరూ ఈ యాప్‌ను కచ్చితంగా డౌన్లోడ్ చేసుకోవాలని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఈ యాప్‌లో యూజర్ వివరాలు గోప్యంగా ఉంటాయని కేంద్రం స్పష్టం చేసినా.. భద్రతపై పలువురు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఆరోగ్యసేతు యాప్‌పై ‘బగ్ బౌంటీ’ కార్యక్రమం చేపట్టింది.
ఆరోగ్యసేతు యాప్‌లో భద్రతపరమైన లోపాలు (బగ్) కనిపెట్టి చెబితే రూ.లక్ష నుంచి రూ.3లక్షలు వరకు బహుమతి ఇస్తామని కేంద్రం ప్రకటించింది. అలాగే ఆరోగ్య సేతు యాప్‌ను మెరుగుపర్చడానికి మంచి సలహాలు.. సూచనలు ఇచ్చిన వారికి రూ.లక్ష వరకు రివార్డు అందజేస్తామని వెల్లడించింది. ప్రభుత్వమే స్వయంగా ‘బగ్ బౌంటీ’ కార్యక్రమం నిర్వహించడం అరుదైన విషయం. ఇంతకీ అసలు ఈ బగ్ బౌంటీ అంటే ఏమిటి? ఎవరెవరు ఈ కార్యక్రమం చేపడతారు? ఎంత నగదు బహుమతి ప్రకటిస్తారు? ఓ సారి చూద్దాం..
యూజర్లకు అందుబాటులో ఉన్న వెబ్సైట్లు, యాప్‌లు, సాఫ్ట్‌వేర్స్‌లో ఎవరూ గుర్తించలేని భద్రతపరమైన లేదా సైబర్ దాడికి అవకాశముండేలా కొన్ని లోపాలు (బగ్స్) ఉండొచ్చు. అలాంటి బగ్స్‌ను ఐటీ ఎక్స్పర్ట్ నుంచి విద్యార్థుల వరకు ఎవరైనా సరే కనిపెట్టి చెప్పగలిగితే వారికి నగదు బహుమతి ఇస్తుంటారు. ఈ కార్యక్రమాన్నే బగ్ బౌంటీ అంటారు. ప్రముఖ సెర్చింజన్లు గూగుల్.. యాహూ, ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ఫేస్బుక్ సహా అనేక ఐటీ సంస్థలు, ఇతర కంపెనీలు తమ వెబ్సైట్లలో లోపాలు గుర్తించి చెప్పమంటూ తరచూ బగ్ బౌంటీ కార్యక్రమం నిర్వహిస్తుంటాయి. కనిపెట్టి చెప్పిన వారికి నగదు బహుమతి ప్రకటిస్తాయి. తద్వారా సంస్థలు తమ సేవలను మరింత మెరుగుపర్చుకుంటాయి.
1983లో తొలిసారి
ఈ బగ్ బౌంటీ కార్యక్రమాన్ని తొలిసారి హంటర్ అండ్ రెడీ అనే సంస్థ నిర్వహించింది. తమ సంస్థ రూపొందించిన ‘వెర్సటైల్ రియల్-టైం ఎగ్జిక్యూటివ్ ఆపరేటింగ్ సిస్టమ్’లో ఎవైనా లోపాలు ఉంటే వాటిని కనిపెట్టి చెప్పిన వారికి ఫోక్స్‌వ్యాగన్ బీటల్ కారును బహుమతిగా ఇస్తామని హంటర్ అండ్ రెడీ ప్రకటించింది. నిజానికి ఈ కార్యక్రమానికి బగ్ బౌంటీ అనే పేరును 1995లో నెట్‌స్కేప్ కమ్యూనికేషన్ కార్పొరేషన్ సంస్థలో పనిచేసే ఇంజినీర్ జారెట్ రిడ్లింగ్ హెఫర్ పెట్టారు. తన సంస్థ ఉన్నతాధికారులను ఒప్పించి అప్పట్లోనే 50 వేల డాలర్లతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
గూగుల్ బగ్ బౌంటీ
ప్రముఖ సెర్చింజన్ గూగుల్ ఏటా ఈ బగ్ బౌంటీ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. మొదట్లో గూగుల్ కేవలం తన ఉత్పత్తులకు మాత్రమే ఈ కార్యక్రమం నిర్వహించేది.. ఆ తర్వాత గూగుల్ ప్లేస్టోర్‌లో ఉండే థర్డ్ పార్టీ యాప్స్ల్లోనూ బగ్స్ గుర్తింపునకు రివార్డ్ ప్రకటిస్తోంది. 2010 నుంచి ఇప్పటి వరకు గూగుల్ బగ్ బౌంటీ కార్యక్రమం కోసం 21 మిలియన్ డాలర్ల మేర వెచ్చించింది. 461 మంది పరిశోధకులు ఈ నగదును అందుకున్నారు. గతేడాది బగ్ బౌంటీ కోసం గూగుల్ అత్యధికంగా 6.5 మిలియన్ డాలర్లు కేటాయించింది. బగ్ కనిపెట్టివారిలో ఒకరు అత్యధికంగా 1,61,337 డాలర్లు గెలుపొందారు.
2013 తర్వాత పెరిగిన బగ్ బౌంటీలు
ఇంటర్నెట్ సంబంధిత సాఫ్ట్‌వేర్స్‌లో లోపాలు కనిపెట్టడం కోసం 2013 నవంబర్‌లో మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్ సంయుక్తంగా ఇంటర్నెట్ బగ్ బౌంటీ నిర్వహించాయి. 2015 నుంచి సోనీ సహా ప్రముఖ కంపెనీలు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాయి. 2016లో యూఎస్ ఫెడరల్ గవర్నమెంట్ ‘హ్యాక్ ది పెంటగాన్’ పేరుతో బగ్ బౌంటీ నిర్వహించింది. ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి సంబంధించిన సాఫ్ట్‌వేర్స్‌లో లోపాలను గుర్తించమని కోరింది. ఇందుకోసం 1.5 లక్షల డాలర్లను బహుమతిగా ప్రకటించింది. సాధారణంగా బగ్ బౌంటీల నగదు బహుమతి 500 డాలర్ల నుంచి 30వేల డాలర్లకు ఉంటుంది. లోపం తీవ్రతను బట్టి రివార్డు మరింత పెరిగే అవకాశం ఉంటుంది.
అత్యధికంగా నగదు గెలుచుకున్న కుర్రాడు
2019 మార్చిలో హ్యాకర్‌వన్ అనే సైబర్ సెక్యూరిటీ సంస్థ ప్రకటన ప్రకారం.. మిలియన్ డాలర్ల బగ్ బౌంటీ రివార్డు పొందిన తొలి వ్యక్తిగా అర్జెంటీనాకు చెందిన 19 ఏళ్ల కుర్రాడు శాంటియాగొ లోపెజ్ నిలిచాడు. ఆ తర్వాత పలువురు ఈ మిలియన్ డాలర్ క్లబ్లో చేరారు.
ఈ ఏడాదిలోనూ అనేకం
సంస్థలు తమ ప్రొడక్ట్‌లో లోపాలు ఉన్నాయని ఆరోపణలు వచ్చినా, అనుమానాలు కలిగినా బగ్ బౌంటీని నిర్వహిస్తుంటాయి. ఈ ఏడాది కూడా గూగుల్, ఫేస్బుక్, ఇంటెల్, యాహూ, స్నాప్‌చాట్, సిస్కో, యాపిల్, మైక్రోసాఫ్ట్, ట్విటర్ సహా 30కిపైగా సంస్థలు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. తాజాగా గూగుల్ క్లౌడ్‌లో లోపాన్ని గుర్తించినందుకు ఓ పరిశోధకుడు 31,337 డాలర్లు గెలుచుకున్నాడు. తమ ప్రొడక్ట్స్ అయిన అజుర్ స్పేర్‌లో లోపాలు గుర్తిస్తే లక్ష డాలర్లు, ఎక్స్ బాక్స్‌లో లోపాలు కనిపెడితే 20వేల డాలర్లు రివార్డుగా ఇస్తామని ఇటీవల మైక్రోసాఫ్ట్ ప్రకటించింది.
- ఇంటర్నెట్ డెస్క్