
వార్తలు / కథనాలు
మారుతున్న వివాహ తీరు
మార్పును అందిపుచ్చుకుంటున్న స్టార్టప్‌లు
మొబైల్లోనే వధువు మెడలో తాళికడుతున్న కేరళ యువకుడు
‘నాయనా.. ఆ అక్షింతలు అందుకుని ఇక్కడ పూజ చేయి.. అమ్మా కాస్తా అరటి పండ్లు తెచ్చి పెట్టండి’
- సాధారణంగా పెళ్లింట పురోహితుడు పలికే మాటలు
‘నాయనా.. కొంచెం ఆ కెమెరా ముందు సరిగా కూర్చో. ఆ లైట్ కొంచెం నీవైపు తిప్పుకో. పొరపాటున ఆ వైఫై పరిధి దాటకు నాయనా.. వీడియో కాల్ కట్ అవుద్ధి’
-ఇదీ వర్చువల్ పెళ్లి జరిగే తీరు
బహుశా ఇలాంటి పెళ్లిళ్లు జరగడానికి ఏ పదేళ్లో, 20 ఏళ్లో అంతకంటే ఎక్కువ సమయమే పట్టాల్సింది. కానీ కరోనా కారణంగా విధించిన లాక్డౌన్ వల్ల ఇలాంటి వర్చువల్ పెళ్లిళ్లు అప్పుడే పట్టాలెక్కేశాయి. వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్లైన్ పాఠాలు, వర్చువల్ కోర్టు విచారణల తరహాలో వివాహాలు కూడా ఆన్లైన్లోనే జరిగిపోతున్నాయి. సరిగ్గా ఇదే అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నాయి కొన్ని స్టార్టప్‌లు. పెళ్లికి కావాల్సినవన్నీ సమకూరుస్తూ దూసుకెళ్తున్నాయి.
కరోనా వల్ల భౌతిక దూరం పాటించాల్సిన పరిస్థితి ఏర్పడడంతో ఈ సీజన్లో జరగాల్సిన చాలా పెళ్లిళ్లు వాయిదా పడ్డాయి. అయితే, ప్రభుత్వాలు కొన్ని చోట్ల 50 మంది వరకు బంధువులను పిలిపించి వివాహం చేసుకోవచ్చన్న వెసులుబాటు ఇచ్చాయి. దీంతో కొందరు పరిమిత సంఖ్యలో బంధువుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ఇంకొన్ని చోట్ల మాత్రం ఈ ట్రెండ్ మొదలైంది. అప్పుడే ఈ చిన్న చిన్న స్టార్టప్‌లు ఈ నయా పోకడను అందిపుచ్చుకుని వర్చువల్ వివాహాలు చేయడం మొదలు పెట్టాయి.
ఇంతకీ ఎలా..?
ఒక్కసారి వర్చువల్ వెడ్డింగ్ ఈవెంట్లను నిర్వహించే సంస్థలను ఆశ్రయిస్తే పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లన్నీ వారే చూసుకుంటారు. బంధువులకు ఈ- శుభలేఖలు పంపించడం, ఆన్లైన్లోనే పురోహితుడిని సమకూర్చడం, బంధువుల ఇళ్లకు బహుమతులు పంపించడం వంటివన్నీ వాళ్లే చేసి పెడతారు. గత నెలలో ముంబయిలో ఉన్న వరుడికి, బరేలీలో ఉన్న వధువుకు రాయ్‌పూర్‌లో ఉన్న పురోహితుడు వర్చువల్‌గా వివాహం జరిపించారు. ఇంకోచోట కూడా ఇలానే వీడియో కాల్లో బంధువులందరి సమక్షంలో వివాహం జరిపించారు. కొన్ని చోట్ల మొబైల్‌కు తాళి కట్టించిన సందర్భాలూ సామాజిక మాధ్యమాల్లో మీరు చూసే ఉంటారు!
జూమ్ కాల్లో వధూవరులు.. బంధువులు
అప్పుడే అయిపోదు..
‘‘చాలా మంది లాక్డౌన్ పూర్తయ్యాక మళ్లీ యథావిధిగా పెళ్లిళ్లు జరుగుతాయని భావిస్తున్నారు. కానీ భవిష్యత్‌లోనూ ఇదే పరిస్థితి ఉండొచ్చు. వందల సంఖ్యలో గుమిగూడి ఉండే పరిస్థితి ఉండకపోవచ్చు. అప్పుడు ఈ వర్చువల్ ఫంక్షన్ల వైపే అందరూ చూడాల్సిన పరిస్థితి ఉంటుంది’’ అని అంటున్నారు ముంబయికి చెందిన పార్టీ స్టార్టర్స్ అనే వివాహ ఆర్గనైజింగ్ కంపెనీ ప్రతినిధి. ఇకపై చాలా వరకు ‘ఈ’-పెళ్లిళ్లపై మొగ్గు చూపే అవకాశం ఉందంటున్నారు.
మరి ఖర్చెంతో..?
సాధారణంగా పెళ్లంటే కల్యాణ మండపం అని, క్యాటరింగ్ అని, ఫొటోలు, వీడియోలు, దుస్తులు, నగలని.. ఇలా అనేకం ఉంటాయి. అందుకే ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అనే వారు మన పెద్దలు. దీంతో పెళ్లి చేయాలంటే ఇరు పక్షాల వారికి ఖర్చు తడిసి మోపెడయ్యేది. ఇకపై ఖర్చు పరిమితం అవ్వబోతోంది. వర్చువల్ పెళ్లిళ్లలో ఇవేవీ ఉండవు కాబట్టి.. వేల నుంచి లక్షలోపే ఈ తంతు ముగించొచ్చని అంటున్నారు వెడ్డింగ్ నిర్వాహకులు.
అందరి చూపూ వర్చువల్ వైపు
ఇటీవలే ఈ పోకడ వెలుగుచూడడంతో చాలా వరకు స్టార్టప్‌లు వీటిపై దృష్టి పెట్టాయి. షాదీ.కామ్ వంటి మ్యాట్రిమోనీ సైట్లు కూడా ఆన్లైన్ పెళ్లిళ్ల నిర్వహణకు ముందుకొస్తున్నాయి. దీంతో ఇన్వెస్టర్లను ఈ స్టార్టప్‌లు ఆకర్షిస్తున్నాయి. ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తూ, కొత్తదనంతో దూసుకెళ్తున్న స్టార్టప్‌లలో పెట్టుబడి పెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఇండియన్ ఏంజెల్ నెట్‌వర్క్‌కు సీవోవో పేర్కొన్నారు.
ఇంకెందుకు ఆలస్యం.. మొబైల్ అందుకుని దీవించేయండి! చదివింపులు కూడా నెట్‌బ్యాంకింగ్ ద్వారా చేసేయండి!!