
వార్తలు / కథనాలు
కొన్ని నెలల క్రితం వరకు ఆపరేషన్ సమయంలో డాక్టర్లు మాత్రమే సర్జికల్ మాస్క్‌ను ధరించేవాళ్లు. కానీ, కరోనా మహమ్మారి వల్ల ఇప్పుడు ప్రజలంతా మాస్క్ తప్పనిసరిగా ధరించాల్సి వస్తోంది. బయటకు వస్తే మాస్క్ ధరించాల్సిందేనని, లేకపోతే జరిమానా విధిస్తామని ప్రభుత్వాలే హెచ్చరించే స్థితికి వచ్చింది. ఇలా మాస్క్ ధరించి బయటకువెళ్లడం మనకు కొత్తగా.. కాస్త ఇబ్బందిగా ఉన్నా.. జపాన్‌లో మాత్రం సర్వసాధారణం. కరోనా సమయంలోనే కాదు.. దానికి ముందు నుంచే జపాన్ ప్రజలు రోజూ వివిధ సందర్భాల్లో మాస్కులు ధరిస్తుంటారు. ఎందుకు అంటారా? మీరే చదవండి...
కొంచెం అనారోగ్యంగా ఉన్నా..
జలుబుతో బాధపడుతున్నప్పుడు తుమ్ము వస్తే.. మనం రుమాలు లేదా చేతిని అడ్డుపెట్టుకుంటాం. కానీ జపాన్ ప్రజలు జలుబు తగ్గే వరకు మాస్క్ ధరిస్తారు. అక్కడి ప్రజలు వ్యక్తిగతంగానే కాదు.. సమాజం విషయంలో ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు. అందుకే వారి వల్ల ఇతరులకు జలుబు రాకూడదని జాగ్రత్త వహిస్తారు. కేవలం జలుబు అనే కాదు.. ఏ కొంచెం అనారోగ్యానికి గురైనా మాస్క్ తప్పనిసరిగా ధరిస్తారు.
వసంతకాలం.. వారికి మహా డేంజర్
వసంతకాలంలో చెట్లు చిగురించి పూలు పూస్తాయి. ఆ పూల పుప్పొడి రేణువులను గాలిలో కలవడం వల్ల జపాన్‌లో అనేక మంది అలెర్జీకి గురవుతుంటారు. దీని నుంచి తప్పించుకునేందుకు అక్కడి వాళ్లు మాస్క్‌ను ధరిస్తుంటారు. ఏయే ప్రాంతాల్లో గాల్లో పుప్పొడి రేణువుల శాతం ఎంత ఉందో వాతావరణ శాఖ ప్రకటన విడుదల చేస్తుందంటే.. ఏ స్థాయిలో అలర్జీతో ఇబ్బంది ఎదుర్కొంటున్నారో అర్థం చేసుకోవచ్చు. వాతావారణ శాఖ ఇచ్చే సమాచారం ప్రకారం.. వారు మాస్క్ పెట్టుకొని బయటకు వెళ్తుంటారు.
వంటల వద్ద తప్పదు మాస్క్
ప్రజల ఆరోగ్యం దృష్ట్యా రెస్టారెంట్లలో వంటశాల, వంటలు చేసేవాళ్లు శుభ్రంగా ఉండాలి. శుభ్రతను పరిశీలించేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకంగా అధికారులు ఉంటారు. అయినా అనేక చోట్ల ఎలాంటి పరిశుభ్రత పాటించకుండా వంటలు చేస్తుంటారు. కానీ జపాన్‌లో అలా కుదరదు. రెస్టారెంట్లలో వంటలు చేసేవారు, వడ్డించేవారు కచ్చితంగా మాస్క్ ధరించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పెట్టే సమయంలోనూ సిబ్బంది కచ్చితంగా మాస్కులు ధరిస్తారు.
చలికాలం.. వెచ్చదనం కోసం
జపాన్‌లో శీతాకాలంలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దీంతో వెచ్చదనం కోసం చాలా మంది సర్జికల్ మాస్క్‌ను ధరిస్తారు. అది ముఖాన్ని వెచ్చగా ఉంచుతుంది. బయటి చలి, పొడి గాలి నుంచి రక్షణ కల్పించడంతోపాటు.. ఊపిరి పీల్చుకుంటున్నప్పుడు మాస్క్ తేమను ఏర్పరుస్తుంది. అది గొంతు తడారకుండా చూస్తుంది.
మేకప్ లేకపోతే మాస్కే
జపాన్‌లో అమ్మాయిలు మేకప్ వేసుకోనప్పుడు ఈ మాస్కులు ధరించి బయటకు వెళ్తుంటారట. ఎందుకంటే ఈ మాస్క్ వారి మేకప్‌లేని ముఖాన్ని కనిపించకుండా చేస్తుందట. జపాన్‌లో అందరూ సమయపాలన పాటిస్తారు. ఎప్పుడైనా మేకప్ వేసుకోవడానికి సమయం లేకపోతే ఈ మాస్క్‌ను ధరించి కవర్ చేస్తారట. అలాగే ముఖంపై మొటిమలు, స్కిన్ ఎలర్జీ వచ్చినప్పుడు అవి కనిపించకూడదని మాస్క్‌ను పెట్టుకుంటారట. అక్కడ మగవాళ్లు ఎప్పుడు గడ్డం గీసుకొని నీట్‌గా కనిపిస్తుంటారు. ఎప్పుడైన సమయం లేక గడ్డం తీసుకోలేకపోతే.. మాస్క్‌ను ధరించి గడ్డం కనిపించకుండా జాగ్రత్త పడతారట. మాస్క్ ఆరోగ్యానికే కాదు.. సౌందర్యం విషయంలోనూ ఉపయోగపడుతుందన్నమాట.
సమాజానికి దూరంగా ఉండాలని
ఎదుటి వ్యక్తుల్ని చూడటంతోనే వారిని జడ్జ్ చేసే అలవాటు జపాన్‌లో అధికం. దీంతో ముభావంగా, నిస్పృహతో ఉండే వ్యక్తులు, సిగ్గు ఎక్కువగా ఉండే వాళ్లు తమ భావాలను ఎదుటివారితో పంచుకోవడానికి ఇష్టపడరు. నిజానికి సమాజానికి దూరంగా ఉండాలని భావిస్తుంటారు. అలాంటి వ్యక్తులు ఎదుటి వారికి తమ ముఖం కనిపించకుండా మాస్కును ధరిస్తారు. గందరగోళ ప్రపంచంతో పోటీ పడలేక ఆత్మరక్షణలా మాస్క్‌ను ఉపయోగిస్తుంటారు.
అన్ని చోట్లాలాగే.. కానీ చాలా నిబద్ధతతో..
ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో అన్ని ఆస్పత్రుల్లో వైద్యులు, వైద్య సిబ్బంది మాస్క్ ధరించాలి. అది ఆరోగ్య పరిరక్షణలో ప్రాథమిక అంశం. కానీ మన దగ్గర సాధారణ చికిత్స సమయంలో వైద్య సిబ్బంది పెద్దగా మాస్కులు ధరించరు. కానీ జపాన్‌లో వైద్యులు, వైద్య సిబ్బంది అన్ని వేళలా కచ్చితంగా మాస్కులు ధరిస్తారు.
- ఇంటర్నెట్ డెస్క్