
వార్తలు / కథనాలు
ఒక ప్రాంతంలో చేసిన పని.. మరో ప్రాంతంలో తప్పుగా అనిపించొచ్చు. ఎందుకంటే ప్రదేశాన్ని బట్టి సంప్రదాయాలు, పద్ధతులు మారుతుంటాయి. జీవన విధానంలో, ప్రవర్తనలో ఎన్నో మార్పులు ఉంటాయి. అలా ఒక దేశంలో సర్వసాధారణమైన పద్ధతిని మరో దేశంలో తప్పుగా భావించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా పాశ్చాత్య దేశాలకు, ఆసియా దేశాలకు మధ్య చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. వాటిలో కొన్నింటిని ఇప్పుడు చూద్దాం..
టేబుల్ షేరింగ్
రెస్టరెంట్‌కు వెళ్లినప్పుడు బయటి వాళ్లు కూర్చున్న టేబుల్ దగ్గర కూర్చోవడానికి చాలామంది ఇష్టపడరు. అయితే, భారత్‌లో ఎవరైనా వచ్చి పక్కన/ఎదురుగా కూర్చున్నా పెద్దగా పట్టించుకోం. కానీ పాశ్చత్య దేశాల్లో ఎవరైనా కూర్చున్న టేబుల్ వద్ద పరిచయం లేని వాళ్లు వచ్చి కూర్చుంటే తప్పుగా భావిస్తారు. అదే జపాన్ దేశంలో ఇలాంటి పట్టింపులు ఏవీ ఉండవు. ఎందుకంటే వారు సమయం వృథా కాకూడదని భావిస్తారు.
వ్యక్తిగత దూరం
ప్రస్తుతం కరోనా కారణంగా అందరూ భౌతిక దూరం పాటిస్తున్నారు. కానీ పాశ్చాత్య దేశాల్లో ఒకరినొకరు వ్యక్తిగత దూరాన్ని ఎప్పటి నుంచో పాటిస్తూ వస్తున్నారు. ఇదేం నిబంధన కాకపోయినా.. అక్కడి వారికి అలవాటైన పద్ధతి. అదే ఆసియా దేశాల్లో వ్యక్తిగత దూరానికి పెద్దగా ప్రాధాన్యం ఉండదు.
అక్కడ బేరమాడలేం
భారత్ సహా, చైనా, టర్కీ, ఇరాన్, ఈజిప్ట్ల్లో కూడా ప్రజలు షాపింగ్‌కు వెళ్లినప్పుడు వస్తువు ధర విషయంలో బేరమాడతారు. రేటు తగ్గించమని అడుగుతారు. కానీ పాశ్చాత్య దేశాల్లో అలా కుదరదు. వస్తువుపై ఉన్న ధరకు కొనుగోలు చేయాల్సిందే. ఒకవేళ తక్కువ ధరకు తెచ్చుకోవాలంటే ఆఫర్లు వచ్చినప్పుడో.. కూపన్లు లభించినప్పుడో షాపింగ్ చేయాల్సిందే.
భోజనం విషయంలో..
చైనాలో పెట్టిన ఆహారాన్ని అతిథి మొత్తం తినేశాడంటే ఇంకా అతను ఆకలితో ఉన్నట్లు అక్కడి వాళ్లు భావిస్తారు. అదే భారత్, జపాన్ దేశాల్లో పెట్టిన భోజనం మొత్తం తినకపోతే అతిథికి భోజనం నచ్చలేదేమోనని బాధపడతారు.
ఆహారం పంచుకోవడం
ఉత్తర, దక్షిణ కొరియాల్లో ఆహారం పంచుకోవడం చాలా సర్వ సాధారణం. ఫ్రెండ్స్, కుటుంబసభ్యులతో తాము తింటున్న ఆహారాన్ని ఇతరులతో పంచుకుంటుంటారు. అదే పాశ్చాత్య దేశాల్లో ఆహారం పంచుకోవడానికి అసలు ఇష్టపడరు. కుటుంబసభ్యులతో కూడా పంచుకోరు. ఇలా చేయడం అపరిశుభ్రతగా భావిస్తారు.
అరిచి ఆర్డరిస్తే..
ఆసియా దేశాల్లో రెస్టరెంట్లలో వెయిటర్‌ను గట్టిగా పిలవడం చాలా మందికి అలవాటు. కూర్చున్న చోట నుంచే అరుస్తూ వెయిటర్‌కు ఆర్డర్ ఇస్తాం. అదే పాశ్చాత్య దేశాల్లో ఇలా చేస్తే అసభ్య ప్రవర్తన అనుకుంటారు. రెస్టరెంట్లలో ఉద్యోగులకు అవమానపరిచినట్లేనట. అక్కడి రెస్టరెంట్లలో వెయిటర్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.
- ఇంటర్నెట్ డెస్క్