close

వార్తలు / కథనాలు

కలవరు..కనిపిస్తే వదలరు..

కలవరు..కనిపిస్తే వదలరు..

ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం: అండమాన్ నికోబార్ దీవులకు పర్యటనకు వచ్చిన ఓ అమెరికా పర్యాటకుడు జాన్‌ అలెన్‌ దారుణ హత్యకు గురయ్యాడు. ఉత్తర సెంటినెల్ ద్వీపంలోని సెంటినెలీస్‌ తెగకు చెందిన కొందరు వ్యక్తులు అతడిపై దాడి చేసి చంపేశారు. ఆదిమ జాతికి చెందిన వ్యక్తి కాకుండా పరులు తమవైపు కన్నెత్తి చూసినా ఏమాత్రం ఊరుకోరు ఈ తెగ ప్రజలు. ఇదంతా వింటుంటే సినిమాల్లో సన్నివేశాలను తలపిస్తున్నాయి. కానీ ఇదంతా నిజం. ఎన్నో తెగలు తమను తాము మార్చుకొని నాగరికతను అలవాటు చేసుకుంటున్నాయి. సమాజంలో వస్తోన్న మార్పులను అందిపుచ్చుకుంటున్నాయి. కానీ వీరు మాత్రం బయటి ప్రపంచంతో సంబంధాలు పెట్టుకోవడానికి ఏ మాత్రం అంగీకరించరు. అంతేకాకుండా వారి జనాభా గురించి ప్రభుత్వం వద్ద సరైన లెక్కలు కూడా లేవు. 2001 జనాభా లెక్కల ప్రకారం..21 మంది పురుషులు, 18 మహిళలు ఉన్నట్లు అంచనా. 59.67 కిలోమీటర్ల పరిధిలో ఉన్న నివసిస్తోన్న వారిని అధికారులు చాలా దూరంగా ఉండి సర్వే చేశారు.2011 జనాభా లెక్కల ప్రకారం..12 మంది పురుషులు, ముగ్గురు మహిళలు లెక్కలో తేలారు.

కలవరు..కనిపిస్తే వదలరు..

2004లో వచ్చిన సునామీ వారి మీద ఎలాంటి ప్రభావం చూపించిందో ఎవరికీ తెలీదు. కొన్ని లెక్కల ప్రకారం వారి సంఖ్య 100 కు మించదు. ఈ తెగకు చెందిన ఒక వ్యక్తి 5అడుగుల 3 అంగుళాల పొడవు, ఎడమచేతి వాటంతో ఉన్నాడని హీన్‌రిచ్‌ హర్రేర్‌ అనే రచయిత వివరించాడు. వేటాడటం, చేపలు పట్టడం, అటవీ ఉత్పత్తులను సేకరించడం ద్వారా వారు జీవనం సాగిస్తారని, వ్యవసాయం, నిప్పును వాడటం గురించి వారికి అవగాహన ఉన్న దాఖలాలు లేవని తెలుస్తోంది. వారి భాషకు ఒక రూపం అంటూ లేదు.వారికి లోహ వస్తువులను తయారు చేసే నైపుణ్యం పెద్దగా తెలీకపోయినా, వాటి వాడకం మీద మంచి పట్టున్నట్లు తెలుస్తోంది. 1980లో సముద్రం ఒడ్డున ఆగిన రెండు కంటైనర్‌ షిప్‌లను నుంచి వారు ఇనుప వస్తువులను తీసుకెళ్లిపోయారు.

1880లో బ్రిటిష్‌ యాత్రికుడు, అడ్మినిస్ట్రేటర్‌ మౌరీస్‌ విదల్‌ పోర్ట్‌మ్యాన్‌ వెల్లడించిన ప్రకారం..ఆహార తయారీ విధానం ఓంజే తెగల విధానాన్ని పోలి ఉంటుందని, గ్రేట్ అండమాన్‌ దీవుల్లోని ఇతర ఆదిమ జాతుల వారితో ఏమాత్రం సంబంధం ఉండదని తెలిపాడు. పోర్ట్‌మ్యాన్‌ ఓ సర్వే నిర్వహించాలని వారి ప్రాంతానికి వెళ్లగా వారు అతడిని బంధించారు. తరవాత అతడికి కొన్ని బహుమతులు అందించి, స్నేహంగా వ్యవహరించి తిరిగి వదిలేశారు. అయితే పోర్ట్‌మ్యాన్‌ బయట నుంచి వారి వద్దకు వెళ్లిన మొదటి వ్యక్తిగా భావిస్తారు. భారత ప్రభుత్వం వారి గురించి తెలుసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఎవరైన బయటి వ్యక్తులు వస్తున్నారంటే సెంటినెలీస్‌ ప్రజలు అడవుల్లోకి వెళ్లిపోతారు. మ్యాన్‌ ఇన్‌ సెర్చ్‌ ఆఫ్ మ్యాన్ పేరుతో నేషనల్ జియోగ్రఫిక్‌ బృందం బలగాల రక్షణతో ఆ ద్వీపానికి వెళ్లింది. వెంటనే వారు ప్రత్యక్షమై, పెద్ద ఎత్తున బాణాలు సంధించారు. వీరు బహుమతులు అందించగా, కొన్నింటిని పాతి పెట్టి మరికొన్నింటిని వెంట తీసుకుపోయారు.

నిషేధిత ప్రాంతంగా వారి నివాసిత ప్రాంతం

ఈ తెగ ప్రజల ఆచారాలకు భంగం కలగకుండా భారత ప్రభుత్వం పలుచర్యలు తీసుకుంది. ఈ దీవిలోకి ఇతరులు అడుగు పెట్టకుండా నిషేధం విధించింది. సాయుధ బలగాలు సైతం దీవికి దూరంగా సముద్రజలాల్లో ఉండి విధులు నిర్వహిస్తాయి.


Tags :

మరిన్ని