close

వార్తలు / కథనాలు

దాల్చిన చెక్క గురించి ఇది విన్నారా?

అప్పట్లో దీన్ని వాడటం నిషేధమట!

దాల్చిన చెక్క గురించి ఇది విన్నారా?

ఇంటర్నెట్‌ డెస్క్‌: మసాలా దినుసులు లేని వంటగదిని ఊహించుకోగలమా?. అందులోనూ దాల్చిన చెక్కను ఉపయోగించని వాళ్లుంటారా?. దక్షణి భారత దేశంలో దీనికి ఆదరణ మరీ ఎక్కువ. అలాంటి దాల్చిన చెక్కను వంటల్లో వాడటం నిషేధమని మీకు తెలుసా? దీన్ని కానుకగా ఇచ్చిపుచ్చుకునేవారని ఎప్పుడైనా విన్నారా? కేరళలో పండించే సుగంధ ద్రవ్యాల పంటల్లో దాల్చిన చెక్కకు ప్రత్యేక స్థానం ఉంటుంది. అయితే దీన్ని వంటల్లో వాడటం మాత్రమే మనకు తెలుసు.వంటల్లో వాడినప్పుడు సువాసనలు చిందించడమే కాదు. దీనిలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. దాల్చిన చెట్టు బెరడు నుంచి వచ్చిన పట్టను ఎండబెట్టి దాల్చిన చెక్క పేరుతో మార్కెట్లలో అమ్ముతుంటారు. మరి దీని గురించి వివరంగా..

ప్రతి భాగం ఉపయోగమే: వేప చెట్టు మాదిరిగానే ఈ చెట్టులోని దాదాపు ప్రతి భాగం ముఖ్యమైందే. దీన్ని ఒక్కసారి వేస్తే చాలు. ఇది ఎవర్‌ గ్రీన్‌ పంట. చెట్టు బెరడు దాల్చిన చెక్కలాగా ఉపయోగిస్తారు. దీని ఆకుల పసరును కాలిన గాయాలకు మందుగా ఉపయోగిస్తారు. పొడిదగ్గు ఉన్నవాళ్లు ఈ ఆకుల చూర్ణాన్ని ఔషధంగా వినియోగించుకుంటారు. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదనేది పాతమాట. మలబద్ధకం, మధుమేహం ఉన్న వాళ్లకు దాల్చిన చెక్క చేసే మేలు అంతా ఇంతా కాదు. మలబద్ధకం, జీర్ణ సంబంధ సమస్యలున్నవాళ్లు ఇంగ్లిష్‌ మందుల జోలికెళ్లకుండా ఇంట్లోనే నయం చేసుకోవచ్చు.

దాల్చిన చెక్క గురించి ఇది విన్నారా?

దాల్చిన చెక్కకి చాలా సీనుంది: నిజానికి దాల్చిన చెక్క ప్రపంచానికి ఎప్పుడో పరిచయం అయింది. క్రీ.పూ 2000నాటి కాలంలో ఈజిప్టులో దీని వాడకం బాగా ఉండేదట. దీని పుట్టుకపై స్పష్టమైన ఆధారాల్లేవు. చైనాలో పుట్టిందని ఓశాస్త్రవేత్త తెలిపితే, దీని జన్మస్థలం శ్రీలంక అని అందుకే ఇది భారతదేశంలోకి త్వరగా రాగలిగిందని మరో శాస్త్రవేత్త అన్నాడు. అంతేకాదు దీన్ని ప్రాచీన కాలంలో కానుకలాగా ఉపయోగించేవారట. దాల్చిన చెక్కలను కానుకగా ఇచ్చి దేవతల మొక్కు చెల్లించుకునే వారట. ఈ సంప్రదాయం ఎక్కువగా రోమన్లు, గ్రీకు ప్రజల్లో ఉండేదని చరిత్ర చెబుతోంది. ప్రసాదంగా భావించేవారు కాబట్టి దీన్ని వంటల్లో ఉపయోగించేవారు కాదట. వంటల్లో దీని ఉపయోగంపై కొన్ని సంవత్సరాల పాటు నిషేధం విధించారు. అయితే దీన్ని తొలిసారి వంటల్లో వాడిన ఘనత చైనాదేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

దాల్చిన చెక్క సుగుణాలివే: మనదేశంలో కేరళలో దీన్ని ఎక్కువ పండిస్తారు. మనదేశంలో దొరికే దాల్చిన చెక్క రకం పేరు ‘తమాలా’. భారత్‌లో మలబారు తీరం దీని పుట్టినిళ్లట. డయాబెటిస్‌ ఉన్నవారు దీన్ని నిత్యం 10గ్రాముల చొప్పున తీసుకుంటే మధుమేహం అదుపులో ఉంటుంది. టైప్‌-2 మధమేహ రోగుల్లో గ్లూకోజ్‌ నియంత్రణకు దాల్చిన చెక్కబాగా ఉపయోగపడిందని ఓ అధ్యయనంలో తేలింది. కాలిఫోర్నియాలోని వెస్టర్న్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. సుమారు 543మంది టైప్‌-2 మధుమేహగ్రస్థులకు రోజుకు 120మి.గ్రా నుంచి 6గ్రాముల వరకు మాత్రల రూపంలో ఇచ్చారు.ఈ మాత్రలు ఉపయోగించని వారితో పోలిస్తే ఉపయోగించిన వారిలో చక్కెర స్థాయిలు మెరుగ్గా తగ్గడాన్ని గమనించారు. శరీరంలోని చెడుకొలెస్ట్రాల్‌, ట్రైగ్లిసరైడ్లను తగ్గించడంలో దాల్చిన చెక్క మెరుగైన పాత్రపోషించిందని వారు తెలిపారు.దాల్చిన చెక్క నుంచి తీసిన నూనెతో మధుమేహానికి ఔషధాలు తయారుచేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు