
వార్తలు / కథనాలు
(ఫొటో: ఏషియన్ పెయింట్స్ ఫేస్బుక్)
ఇంటర్నెట్ డెస్క్: టీవీలో నిత్యం కనిపించే యాడ్స్‌లో ఏషియన్ పెయింట్స్ తప్పకుండా ఉంటుంది. కాలం, సందర్భాలకు అనుగుణంగా యాడ్స్ ఇస్తూ, నాణ్యమైన పెయింట్స్‌ను విక్రయిస్తూ రంగుల అంశం ప్రస్తావనకు వస్తే తన గురించే మాట్లాడుకునే విధంగా ప్రజల మనసులో నాటుకుపోయింది. సంపన్నుల నుంచి సామాన్యుల వరకు అందరికి అందుబాటు ధరల్లో రంగులను అమ్ముతూ దేశంలోనే అత్యంత ఆదరణ ఉన్న కంపెనీగా గుర్తింపు తెచ్చుకుంది. మరి ఈ కంపెనీ బ్రిటీష్ వాళ్లు అహంకారంతో చేసిన ఓ పనికి ఫలితంగా ఏర్పడిందని, దేశంలో నలుగురు స్నేహితులు కలిసి స్థాపించిన రంగుల సామ్రాజ్యమని తెలుసా?సామాన్యుల ‘రంగుల’ కలను నేరవేర్చిన ఈ కంపెనీ చరిత్ర ఏంటో ఓసారి చూద్దాం పదండి..
1942 సంవత్సరం అనగానే అందరికి గుర్తొచ్చేది క్విట్ ఇండియా ఉద్యమమే.. కానీ, అదే ఏడాది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఏషియన్ పెయింట్స్ ఆవిర్భావం జరిగిందనే విషయం చాలా మందికి తెలియదు. 20వ దశకం ప్రారంభంలో దేశంలో బ్రిటన్ అధికారులు భారత్‌లో స్థాపించిన ‘షాలిమర్ పెయింట్స్’, విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఇతర రంగులు మాత్రమే అందుబాటులో ఉండేవి. అయితే, రెండో ప్రపంచయుద్ధం.. భారతీయుల స్వాతంత్ర్యపోరాటం పతాకస్థాయికి చేరుతుండటంతో భారత్‌కు రంగుల దిగుమతిని బ్రిటీష్ ప్రభుత్వం నిషేధించింది. అప్పటి వరకు దిగుమతైన రంగులు, షాలిమర్ పెయింట్స్ ధర భారీగా ఉండటంతో సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయాయి. దీంతో బ్రిటీష్ ప్రభుత్వం దిగుమతి నిలిపేసినా.. దేశీయంగా రంగులు తయారు చేసి అమ్మాలని ముంబయికి చెందిన నలుగురు స్నేహితులు నిర్ణయించుకున్నారు. అలా చంపక్లాల్ ఛోక్సె, చిమన్లాల్ ఛోక్సీ, సూర్యకాంత్ డానీ, అర్వింద్ వకిల్ కలిసి ముంబయిలోని గైవాడి ప్రాంతంలో ఓ షెడ్డులో ‘ఏషియన్ పెయింట్స్’ పేరుతో రంగుల కంపెనీ ప్రారంభించారు.
సామాన్యులకు దగ్గరై..
అప్పటి వరకు పెద్ద పెద్ద డబ్బాల్లో మాత్రమే లభ్యమయ్యే రంగులు.. ఏషియన్ పెయింట్స్ రూపంలో చిన్న చిన్న డబ్బాల్లో అందుబాటులోకి రావడంతో సామాన్యులు వాటిని కొనడం మొదలుపెట్టారు. స్వాతంత్రం వచ్చాక ఏషియన్ కంపెనీ శరవేగంగా పుంజుకుంది. అప్పట్లో కేవలం నలుపు, తెలుపు, ఎరుపు, పసుపు, నీలం రంగులు మాత్రమే విక్రయించేవారు. అలా తొలి ఏడాది కంపెనీ టర్నోవర్ రూ. 3.5లక్షలు ఉండగా.. పదేళ్లలో అంటే 1952 నాటికి సంస్థ టర్నోవర్ రూ. 23 కోట్లకు చేరింది. అప్పట్లో ఇంత ఆదాయం మరే ఇతర కంపెనీలు పొంది ఉండవు. వీలైనంత త్వరగా దేశం మొత్తం తమ సంస్థ రంగులు విస్తరించాలని స్థానికంగా డిస్ట్రిబ్యూటర్లను నియమించుకున్నారు. 1954లో సంస్థకు గుర్తుగా ఒక మస్కట్‌ను తీసుకురావాలని ఈ నలుగురు స్నేహితులు ఆలోచించారు. ఏషియన్ పెయింట్స్ డబ్బాలపై బ్రష్ పట్టుకొని కనిపించే పిల్లాడు ‘గట్టు’ వారి ఆలోచనకు రూపమే. ప్రముఖ చిత్రకారుడు ఆర్కే లక్ష్మణ్ ఈ పిల్లాడి బొమ్మను గీయగా.. దానికి ఏం పేరు పెట్టాలో చెప్పాలంటూ ఏషియన్ పెయింట్స్ సంస్థ ప్రజలకు పోటీ నిర్వహించింది. విజేతలకు రూ. 500 నగదు బహుమతి ప్రకటించింది. దీంతో అందరి దృష్టి ఏషియన్ పెయింట్స్‌పై పడింది. అలా మరోసారి కంపెనీ ప్రజలను ఆకర్షించింది. 47వేల మంది పేర్లు పంపితే.. అందులో ముంబయికి చెందిన ఇద్దరు పంపిన ‘గట్టు’ అనే పేరు ఎంపికైంది. 1950-1990 మధ్య ప్రజలకు ఆ పిల్లాడి బొమ్మ సుపరిచితం.
ట్రెండ్‌ను ఫాలో అవుతూ..
కంపెనీలకు ప్రచారం ముఖ్యం. మొదట్లో కేవలం పేపర్లోమాత్రమే యాడ్ ఇచ్చే ఏషియన్‌పెయింట్స్.. తొలిసారి 1984లో కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్ను ప్రసారం చేసింది. ఇంట్లో శుభకార్యాలు జరిగినప్పుడల్లా ప్రజలు ఇంటికి కొత్త రంగులు వేయాలనే ఉద్దేశం వచ్చేలా ‘హర్ ఘర్ కుచ్ కెహతా హై(ప్రతి ఇల్లు ఏదో చెబుతోంది)’, ‘డోంట్ లాస్ యువర్ టెంపర్, యూజ్ ట్రాక్టర్ డిస్టెంపర్(మీ నిగ్రహాన్ని కోల్పోకండి.. ట్రాక్టర్ డిస్టెంపర్ను వాడండి)’ వంటి వాక్యాలను ఉపయోగిస్తూ నిత్యం ప్రజల నోట్లో నానేవిధంగా మారింది. 1990ల్లో సంస్థకు ప్రత్యేకంగా కాల్ సెంటర్ ఏర్పాటు చేసింది. ఇంటర్నెట్ వినియోగం అప్పుడప్పుడే మొదలుకావడంతో 1998-99 మధ్య వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. అంతేనా.. సోషల్‌మీడియాలో ఎప్పటికప్పుడు ట్రెండింగ్ అంశాలపై తనదైన శైలిలో పోస్టులు పెడుతూ లక్షలాది నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
(ఫొటో: ఏషియన్ పెయింట్స్ ఫేస్బుక్)
ప్రస్తుతం రంగులకు సంబంధించి దేశంలో ఎన్ని కంపెనీలు ఉన్నా.. ఏషియన్ పెయింట్స్ భారతీయులకు అత్యంత చేరువైన సంస్థగా నిలిచింది. 2004లో ఫోర్బ్స్ ప్రకటించిన ప్రపంచంలోని బిలియన్ల విలువ కలిగిన కంపెనీల జాబితాలో ఏషియన్ పెయింట్స్ స్థానం దక్కించుకుంది. బ్రిటీష్ సేఫ్టీ కౌన్సిల్ నుంచి ‘స్వార్డ్ ఆఫ్ హానర్’ పొందింది. 78ఏళ్ల చరిత్ర కలిగిన ఏషియన్ పెయింట్స్ దేశీయంగా 53శాతం మార్కెట్ షేర్ కలిగి ఉంది. ప్రపంచంలోని 16 దేశాల్లో 26 పరిశ్రమలు ఏర్పాటు చేసి 60దేశాల్లో విజయవంతంగా వ్యాపారం నడిపిస్తున్నారు. వ్యవస్థాపకులైన నలుగురిలో ఒకరు మృతి చెందడం, వారి కుమారుడు తన వాటాను అమ్మేయడంతో మిగతా ముగ్గురు స్నేహితుల కుటుంబసభ్యులే ఈ సంస్థను కొనసాగిస్తున్నారు. ప్రాథమిక రంగులే కాదు, కస్టమర్లకు నచ్చే రంగును తయారుచేసి విక్రయిస్తున్నారు. వాటితోపాటు థీమ్స్, టెక్చర్స్ అందుబాటులో ఉంచుతున్నారు. మధ్యతరగతి నుంచి కార్పొరేట్ కంపెనీల వరకు వారికి తగ్గ బడ్జెట్లో రంగులు లభిస్తున్నాయి. ఇప్పుడు ఇంటిని, ఇంట్లో వస్తువుల్ని చూపిస్తే.. వాటికి తగ్గట్టు రంగులు వేసేలా నిపుణులను కూడా నియమించి కస్టమర్లకు సేవలు అందిస్తోంది ఏషియన్ పెయింట్స్.