close

వార్తలు / కథనాలు

ఐఓఎస్‌ 13.0 ఫీచర్లేంటో తెలుసా?

యాపిల్‌ నుంచి ఐఫోన్‌ కొత్త మోడల్‌ వస్తున్నా.. కొత్త ఆపరేటింగ్‌ సిస్టమ్‌ వెర్షన్‌ వస్తున్నా ఆ మొబైల్స్‌ వాడే వారికి పండగే. స్మార్ట్‌ఫోన్ల విపణిలో ఐఫోన్‌కు ఉన్న ప్రత్యేకత అలాంటిది మరి. మరికొన్ని రోజుల్లో ఆ ఐఓఎస్‌కు అప్‌డేటెడ్‌ వెర్షన్‌ 13.0 రాబోతోంది. దీంతో ఈ కొత్త వెర్షన్‌లో ఎలాంటి ఫీచర్లు తీసుకొస్తున్నారు? అప్‌డేట్స్‌ ఎలా ఉండబోతున్నాయని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తారు. వీటికి సంబంధించి అంతర్జాలంలో కొన్ని ఫీచర్ల సంగతుల హల్‌చల్‌ చేస్తున్నాయి. మరి ఆ అప్‌డేట్‌ సంగతులేంటో చూద్దాం..


డార్క్‌మోడ్‌
ఎప్పటినుంచో ఐఫోన్‌ యూజర్లు ఎదురుచూస్తున్న డార్క్‌ మోడ్‌ సౌలభ్యం ఐఓఎస్‌ వెర్షన్‌ 13.0లో లభించనుంది. ఇది సెట్టింగ్స్‌లో ప్రత్యేక ఆప్షన్‌గా కనిపించనుంది. ఈ ఆప్షన్‌ను గతేడాది మ్యాక్‌ ఓఎస్‌లో తీసుకొచ్చిన యాపిల్‌ ఇప్పుడు ఐఫోన్‌లోనూ ప్రవేశపెడుతోంది. అయితే ఈ డార్క్‌మోడ్‌ ఆప్షన్‌ చాలా స్మార్ట్‌ఫోన్లలో ఉంది.


వాట్సాప్‌ స్టైల్‌లో... 

అప్‌డేట్‌ చేసిన రిమైండర్స్‌ యాప్‌లో స్క్రీన్‌పై కొత్తగా నాలుగు ఆప్షన్‌ను పొందుపర్చారు. ఆల్‌ టాస్క్స్‌, షెడ్యూల్డ్‌ టాస్క్స్‌, టాస్క్స్‌ టు బి డన్‌ టుడే, ఫ్లగ్డ్‌ టాస్క్స్‌ ఆప్షన్లు ఉంటాయి. ఇక బుక్స్‌ యాప్‌లోని ప్రొగ్రెస్‌ ట్రాకర్‌ను అప్‌డేట్‌ చేయడంతోపాటు, రివార్డ్‌ సిస్టమ్‌ను ప్రవేశపెట్టారు.  కొత్త వెర్షన్‌లో ఐ మెసేజ్‌ యాప్‌ను వాట్సాప్‌ మాదిరిగా డిజైన్‌ చేశారు. ఇందులో యూజర్‌ ప్రొఫైల్‌ పిక్చర్‌, డిస్‌ప్లే నేమ్‌ పెట్టుకోవచ్చు. వాటికి ప్రైవసీ సెట్టింగ్‌ ఆప్షన్‌ కూడా ఉంది. ఎమోజీ, యానిమోజీ, మెమొజీ, స్టిక్కర్స్‌ పంపించుకునే సౌలభ్యాన్ని కల్పించింది.


మ్యాప్స్‌ యాప్‌
అప్‌డేట్‌ చేసిన మ్యాప్స్‌ యాప్‌లో యూజర్లు తాము తరచుగా వెళ్లే ప్రదేశాలను బుక్‌మార్క్‌ చేసుకోవచ్చు. దీంతో త్వరగా గమ్యస్థానానికి నావిగేషన్‌ సెట్‌ చేసుకోవచ్చన్నమాట. అంతేకాదు.. తరుచూ వెళ్లే ప్రదేశాలను ఒక గ్రూప్‌గా క్రియేట్‌ చేసుకునే వెసులుబాటు, వాటికి ఫొటో జతపరిచే ఆప్షన్‌ కూడా ఉంది. దీంతోపాటు హెల్త్‌ యాప్‌ను కూడా ఆధునీకరించారు. 


రెండు కలిపి ఒకటి
ఐఫోన్‌లోని ఫైండ్‌ మై ఫ్రెండ్స్‌, ఫైండ్‌ మై ఐఫోన్‌ను ఒకే యాప్‌గా మార్చారు. ప్రయోగ దశలో ఉన్న ఈ యాప్‌కు ‘గ్రీన్‌ టచ్‌’ అని పేరు పెట్టారని సమాచారం. ట్రాకింగ్‌ డివైజ్‌ల కోసం ప్రస్తుతం ప్రయోగాలు జరుగుతున్నాయి. కొత్త వెర్షన్‌లో స్లీప్‌మోడ్‌ను ఆన్‌ చేస్తే.. డు నాట్‌ డిస్టర్బ్‌ ఆప్షన్‌ కూడా ఆటోమేటిక్‌గా ఆన్‌ అవుతుంది. అన్ని పుష్‌ నోటిఫికేషన్లు మ్యూట్‌ అవుతాయి. దీంతోపాటు స్వైప్‌ టు టైప్‌ కీబోర్డు ఆప్షన్‌ సైతం అందుబాటులోకి తీసుకొచ్చారు.


మెయిల్‌ యాప్‌
ప్రస్తుతమున్న మెయిల్‌ యాప్‌.. మెరుగైన పెర్మామెన్స్‌తో, కొత్త ఆప్షన్‌లతో రాబోతోంది. వ్యక్తిగత మెయిల్స్‌ను మ్యూట్‌ చేసుకోవచ్చు. మనం వద్దనుకునే వ్యక్తుల నుంచి మెయిల్స్‌ రాకుండా బ్లాక్‌ చేసే ఆప్షన్‌ ఉంది. మెయిల్స్‌ ఫోల్డర్‌ను సులభంగా మేనేజ్‌ చేసుకోవచ్చు. ఐఓఎస్‌ 13.0 వెర్షన్‌ విడుదలయ్యాక ఇమోజీలు ఉండకపోవచ్చు.. అయితే ఈ ఏడాది చివర్లో కొత్త ఇమోజీలను అందుబాటులోకి తెచ్చేందుకు యాపిల్‌ యత్నిస్తోంది. 


అప్‌డేటెడ్‌ సఫారీ

ఈ వెర్షన్‌లో సఫారీ బ్రౌజర్‌ మరింత మెరుగ్గా పనిచేయనుంది. మొబైల్‌ వెర్షన్‌లో బ్రౌజ్‌ చేస్తున్నప్పుడు అవసరమైతే డెస్క్‌టాప్‌ వెర్షన్‌కి ఆటోమేటిక్‌గా మారుతుంది. ప్రస్తుతం ఐఫోన్‌లో ఉన్న లైవ్‌ ఫొటో నిడివి 3 సెకన్లు ఉండగా.. దానిని ఆరు సెకన్లకు పెంచేందుకు ప్రయత్నిస్తోంది. ఐప్యాడ్‌లోనూ సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది.. యాపిల్‌. ఐప్యాడ్‌కి యూఎస్‌బీ మౌస్‌ సపోర్ట్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీనిని ఉపయోగించాలంటే ముందుగా సెట్టింగ్స్‌లో ఈ ఆప్షన్‌ను ఎనబుల్‌ చేయాల్సి ఉంటుంది.


యేటా యాపిల్‌ వరల్డ్‌ వైడ్‌ డెవలపర్స్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తుంది. ఈ ఏడాది జూన్‌ 3న ప్రారంభమయ్యే ఈ వేదికపైనే యాపిల్‌ ఐఓఎస్‌ వెర్షన్‌ 13.0ను ప్రకటించనుంది. అప్పుడు ఈ ఫీచర్ల మీద పక్కా సమాచారం దొరుకుతుంది. సెప్టెంబర్‌లో విడుదల చేయబోయే కొత్త ఐఫోన్‌లతో పాటు 13.0 బీటా వెర్షన్‌ను విడుదల చేసి, అన్ని పరీక్షలు పూర్తయ్యాక స్టేబుల్‌ వెర్షన్‌ను అందుబాటులోకి తేనుంది. 

- ఇంటర్నెట్‌ డెస్క్‌


Tags :

మరిన్ని