
వార్తలు / కథనాలు
(ఫొటో: ఒగాటన్ ట్విటర్)
ఇంటర్నెట్ డెస్క్: జపాన్ ప్రజలు గేమ్స్ ప్రియులు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ గేమ్స్ ఆడటానికి ఎక్కువ ఇష్టపడతారు. అందుకే మొబైల్ గేమ్స్, పీసీ గేమ్స్‌తోపాటు ప్రత్యేకంగా ఆర్కేడ్ గేమ్స్ సెంటర్లు దేశవ్యాప్తంగా దర్శనమిస్తుంటాయి. కొన్ని గేమ్స్ తెలివితో ఆడాల్సి ఉంటుంది. మరికొన్ని గేమ్స్‌కు నైపుణ్యం అవసరం. ఇటీవల జపాన్‌కి చెందిన ఓ యువకుడు గేమ్స్ సెంటర్‌కి వెళ్లి ఒక ఆట ఆడాడు. ఎన్ని సార్లు ప్రయత్నించినా గెలవకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎట్టకేలకు గేమ్స్ సెంటర్ యాజమాన్యం దిగొచ్చి సులువుగా గెలుపొందే విధంగా ఆటను మార్చడం విశేషం.
ఒగాటన్ అనే ఇరవై ఏళ్ల కుర్రాడు ఇటీవల టోక్యోలోని ఓ ఆర్కేడ్ గేమ్ సెంటర్‌కు వెళ్లాడు. అక్కడున్న క్రేన్ గేమ్ (అద్దంలోపల ఉండే వస్తువుల్ని క్రేన్ సాయంతో బయటకు తీసుకురాగలిగితే ఆ వస్తువును గెలుచుకున్నట్లు) ఆడాడు. 200 సార్లు ప్రయత్నించినా అతడికి ఒక్క వస్తువు కూడా దక్కలేదు. దీంతో ఆగ్రహించిన ఒగాటన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఆటలో అక్రమం జరుగుతోందని, ఎవరూ విజేతలుగా నిలవలేకపోతున్నారని ఆరోపించాడు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని విచారించారు. గేమ్స్ సెంటర్ సిబ్బంది కూడా ఆ ఆటను ఆడి చూపించారు. వాళ్లు కూడా 300 సార్లు ప్రయత్నించినా గెలవలేకపోయారు. దీంతో సమస్య ఎక్కడుందో యాజమాన్యం గుర్తించింది. అద్దంలోపల వస్తువులు పెట్టిన స్థానాలు సరిగా లేవని తెలుసుకొని మార్పులు చేశారు. దీంతో ఒగాటన్ సులువుగా ఆట గెలిచి వస్తువును దక్కించుకున్నాడు. ఇదంతా దగ్గరుండి పర్యవేక్షించిన పోలీసులు యాజమాన్యంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అయితే, ఆ గేమ్ సెంటర్ యాజమాన్యం మాత్రం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘అన్ని క్రేన్ గేమ్స్ కస్టమర్ల నైపుణ్యం, అదృష్టం మీద ఆధారపడి ఉంటాయి. ఇవి కేవలం సరాదా కోసమే. డబ్బులు పెట్టినంత మాత్రాన కచ్చితంగా బహుమతి రావాలని లేదు. ఈ పరిస్థితి అర్థం చేసుకొని గేమ్స్ ఆడాలని కోరుతున్నాం’’అని పేర్కొంది. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలను ఒగాటన్ తన ట్విటర్లో పెట్టడంతో నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది.