
వార్తలు / కథనాలు
(పియా లివింగ్ ఫేస్బుక్)
ఇంటర్నెట్ డెస్క్: కరోనా కారణంగా ఆఫీస్‌కు వెళ్లలేని పరిస్థితుల్లో చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. ఇంట్లోనే చక్కగా పనిచేసుకోవచ్చు అనుకుంటారు. కానీ కుటుంబ సభ్యులతో కలిసుండే వారికి అది అంత సులువు కాదు. చిన్న పిల్లల అల్లరి, టీవీ, ఇంటి బయట వాహనాల శబ్దాలు చికాకు పుట్టిస్తాయి. దీంతో ఉద్యోగి పనిపై దృష్టి సారించలేడు. ఓ గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నా.. చాలా వరకు శబ్దాలు వినిపిస్తుంటాయి. దీనికి పరిష్కారంగా జపాన్‌లోని ఓ కంపెనీ వినూత్న ఆలోచన చేసింది. శబ్దాలు వినిపించకుండా సౌండ్ప్రూఫింగ్తో చిన్న గదులను తయారు చేస్తోంది.
జపాన్‌లోని పియా లివింగ్ అనే సంస్థ ఈ సౌండ్ప్రూఫింగ్ ‘ఒటెగారూమ్’లను అందుబాటులోకి తెచ్చింది. సాండ్విచ్డ్ బోర్డులతో తయారు చేసిన ఈ చిన్న గదిలో బయటి శబ్దాలు లోనికి అస్సలు వినిపించవు. ఇందుకోసం బోర్డులను ప్రత్యేక విధానంలో గోడలుగా అమర్చారు. 194 సెం.మీ ఎత్తు, 91.5 x 121సెం.మీ విస్తీర్ణం గల ఈ గదిలో ఎల్ఈడీ లైట్స్, కంప్యూటర్/లాప్‌ట్యాప్ పెట్టుకోవడానికి డెస్క్, కూర్చోవడానికి సరిపడా స్థలం ఉంటుంది. అలాగే ఛార్జింగ్ కోసం వైర్ పెట్టుకోవడానికి గోడల్లో కన్నాలు ఉంటాయి. గాలి సరఫరా కోసం వెంటిలేటషన్ ఫ్యాన్ ఉంటుంది. కేవలం 50కిలోల బరువు ఉంటే ఈ బుల్లి గదిని ఒకరి సాయంతో ఇంట్లో ఎక్కడైనా అమర్చుకోవచ్చట. దీని ధర 1,98,000 యెన్లు(దాదాపు రూ.1.37లక్షలు). ప్రస్తుతం ఆంటిక్ వైట్, బిట్టర్ బ్రౌన్ రంగుల్లో ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. మన దేశానికి డెలివరీ చేస్తారో లేదో తెలియదు గానీ.. జపాన్‌లో వీటికి ఆదరణ బాగానే లభిస్తోందట.