close

వార్తలు / కథనాలు

కిమ్‌... భలే గమ్మత్తుగా ఉంటాడు కదా!

అగ్రరాజ్యం అమెరికాను సైతం ఎదురించే మొండిఘటం. ఎవరి మాట వినని సీతయ్య. చిన్న చిన్న తప్పులకే మరణ శిక్ష విధించే కఠినాత్ముడు. పదవిని, ప్రాణాలను కాపాడుకోవడం కోసం ఎంతకైనా తెగించే నియంత. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ గురించి చెప్పమంటే ఎవరైనా ఠక్కున చెప్పే విషయాలు ఇవి. మరి ఒక దేశ అధ్యక్షుడిగా, క్రూరమైన నేతగా ప్రపంచానికి తెలిసిన కిమ్‌.. వ్యక్తిగతంగా ఎలా ఉంటారు? సంపన్నుడైన కిమ్‌ జీవనశైలి ఎలా ఉంటుంది? వంటి విషయాలు చాలా అరుదుగా తెలుస్తాయి. అంతర్జాతీయ మీడియాలో ప్రచారంలో ఉన్న కొన్ని అంశాలపై ఓ లుక్కేద్దామా?

ఆహారం విషయంలో కిమ్‌ చాలా కాస్లీ. నాణ్యత ఉన్న పంది మాంసాన్ని ప్రత్యేకంగా డెన్మార్క్‌ నుంచి తెప్పించుకుంటారట. ఇరాన్‌ నుంచి కావియర్‌, చైనా నుంచి పుచ్చకాయ, గొడ్డు మాంసం.. జపాన్‌ నుంచి రుచికరమైన వంటకాలు తెప్పించుకుంటారట.

కిమ్‌కు బాస్కెట్‌బాల్‌, హార్స్‌ రైడింగ్‌, గోల్ఫ్‌ క్రీడలపై ఆసక్తి ఎక్కువ. అందుకే వాటిల్లో తనకు నచ్చిన జట్లను తమ దేశానికి రప్పించుకొని తన కోసం ఆడాలని ఆదేశిస్తాడట. అలా కిమ్‌ కోసం ఆడిన జట్లకు భారీగానే నజరానా ఇస్తాడట.

కిమ్‌ దగ్గర గుర్రపుపందెల్లో పాల్గొనే తోరాబ్రెడ్‌ జాతి గుర్రాలు చాలా ఉన్నాయి. ఏటా దేశ బడ్జెట్‌లో 20 శాతం నిధులు కిమ్‌ పెంచుకునే జంతువులు, గుర్రాల సంరక్షణకే కేటాయిస్తారట.

కిమ్‌ తన ఆరోగ్య పర్యవేక్షణ కోసం 130 మంది వైద్యులతో ఆస్పత్రినే ఏర్పాటు చేసుకున్నాడు. వైద్యులు ఎప్పటికప్పుడు కిమ్‌ ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తుంటారు.

కిమ్‌కు శత్రుభయం ఎక్కువ. ఆ దేశ ప్రజల్లో అత్యధికం ఆయన్ను ద్వేషించేవారే. అందుకే ఆయన భద్రత విషయంలో అధికారులు ఏ మాత్రం నిర్లక్ష్యం చేయరు. భద్రతలో భాగంగా కిమ్‌కు ఇష్టమైన మెర్సిడెజ్‌ బెంజ్‌ ఎస్‌600 కారును సాయుధ కారుగా తయారు చేయించారు. స్వదేశంలో పర్యటిస్తున్నప్పుడు కిమ్‌ ఈ కారును వినియోగిస్తారు.

ఫ్రాన్స్‌లో లభించే సిగరెట్‌ను కిమ్‌ ఎక్కువగా తాగుతారట. ఫ్రెంచ్‌ వెస్‌ సెయింట్‌ ల్యూరెంట్‌ బ్రాండ్‌ సిగరెట్‌ ప్యాకెట్‌ విలువ రూ. మూడు వేలకుపైనే ఉంటుంది. ఆ సిగరెట్లు ఉంచిన బాక్స్‌ను లెదర్‌తో తయారు చేస్తారట. బాక్స్‌ ధరే రూ. 12వేల వరకు ఉంటుందని తెలుస్తోంది. 

కిమ్‌ దగ్గర 200 అడుగుల పొడవైన నౌక ఉంది. పై అంతస్తులో రూ. 56 కోట్ల వ్యయంతో అద్భుతమైన ఫర్నిచర్‌ డిజైన్‌ చేశారు. 

 

ఉత్తర కొరియాలో ప్రజలు సినిమా చూసే అవకాశం లేదు. కానీ ఆ దేశాధ్యక్షుడికి మాత్రం లగ్జరీ సినిమా థియేటర్‌ ఉంది. ఇందులో వెయ్యి మంది కూర్చోని సినిమా చూసే వీలుంది.

కిమ్‌కు 17 పాలెస్‌లు ఉన్నాయి. ఎప్పుడు ఏ పాలెస్‌లో ఉంటాడో కనిపెట్టడం చాలా కష్టం. ఆయన భద్రతలో ఇదీ ఒక భాగం.

కిమ్‌కు కార్లంటే మహా ఇష్టం. చిన్నప్పటి నుంచే కార్‌ డ్రైవింగ్‌ చేస్తూ తెగ ఎంజాయ్‌ చేసేవాడట. యవ్వనంలోకి వచ్చాక ఖరీదైన కార్లను సేకరించడం మొదలు పెట్టిన కిమ్‌ దగ్గర ఇప్పుడు 100కుపైగా ఖరీదైన కార్లున్నాయి. వాటిలో ఆయనకు మెర్సిడెజ్‌ బెంజ్‌ కార్లంటే అమితమైన ఇష్టమట.

కిమ్‌, ఆయన సన్నిహితులు తాగే మద్యం అలాంటి ఇలాంటిది కాదు. కేవలం విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న మద్యం మాత్రమే పుచ్చుకుంటారట. 2016లో కేవలం విదేశీ మద్యం కోసం లక్షల డాలర్లు ఖర్చుపెట్టాడట. అమెరికా, జర్మనీ నుంచి మద్యాన్ని దిగుమతి చేసుకుంటాడని తెలుస్తోంది.

దేశాధినేతలకు, ప్రముఖులకు సొంత ప్రైవేటు జెట్‌ విమానం ఉండటం సహజమే. అలాగే కిమ్‌కు కూడా ఉంది. అయితే ఇటీవల ఆ జెట్‌ను ఆధునీకరించారు. ఆ జెట్‌ పేరు.. ఎయిర్‌ ఫోర్స్‌ ఉన్‌. గతంలో జెట్‌లో ఉన్న డిజైన్‌ను పూర్తిగా తీసేసి ఆకర్షణీయంగా మార్చారు. రూ. 10 కోట్లతో ఆధునీకరించారు. కిమ్‌కు జెట్‌ విమానాలే కాదు.. ప్రైవేటు రన్‌వేలు కూడా ఉన్నాయి. తన 17 పాలెస్‌లకు సమీపంలో ఈ రన్‌వేలను ఏర్పాటు చేసుకున్నాడు.

కిమ్‌కు చేతి వాచీలంటే చాలా ఇష్టమట. ఖరీదైన వాచ్‌లనే పెట్టుకుంటాడట. ఇప్పటివరకు వాచ్‌ల సేకరణకు కిమ్‌ రూ. 58 కోట్ల వరకు ఖర్చు చేశాడని ఓ ప్రముఖ వార్తా పత్రిక కథనం ప్రచురించింది. కిమ్‌కు బుద్ది చెప్పాలన్న ఉద్దేశంతో స్విట్జర్లాండ్‌ ప్రభుత్వం తమ దేశంలో తయారు చేసే ఖరీదైన వాచ్‌లను ఉత్తర కొరియాకు ఎగుమతి చేయడం 2016 నుంచి నిలిపివేసింది. 

కిమ్‌లో క్రూరత్వంతోపాటు చిన్నపిల్లల మనస్తత్వమూ ఉంది. అందుకే దేశ రాజధాని ప్యాంగ్‌గ్యాంగ్‌లో అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌, వాటర్‌ పార్క్‌ను అభివృద్ధి చేశాడు. ఇందుకోసం దాదాపు రూ. 700 కోట్లు ఖర్చు చేశారని అంచనా.

- ఇంటర్నెట్‌ డెస్క్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు