
వార్తలు / కథనాలు
భారత్‌లోని పలు ప్రాంతాల్లోని రోడ్ల పరిస్థితి
మన దేశంలో రోడ్ల పరిస్థితి ఏంటో అందరికీ తెలిసిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి రహదారుల నిర్మాణం చేపట్టినా పట్టుమని పదికాలాలపాటు ఉండటం లేదు. రోడ్డు పనులను దక్కించుకున్న కాంట్రాక్టర్లు తమ స్వలాభం కోసం మాత్రమే నిర్మాణం చేపడుతున్నట్లు ఉంది. ఎత్తైన కొండల మీద, సముద్ర మట్టానికి వేలాది అడుగుల ఎత్తులో నిర్మించిన రోడ్లపై ప్రయాణమంటే సాహసమే. మన దేశంలో అటువంటి ప్రమాదకరమైన రోడ్లు ఎక్కడ ఉన్నాయి.. వాటి సంగతేంటో చూసేద్దామా మరి..
సముద్ర మట్టానికి 5, 600 మీటర్ల ఎత్తులో..
కేంద్రపాలిత ప్రాంతమైన లద్దాఖ్‌లోని ఖర్దుంగ్లా రోడ్డు ఉంది. ఇది ప్రపంచంలోనే ఎత్తైన వాహనాల రహదారి కావడం విశేషం. సముద్ర మట్టానికి 5,602 మీటర్ల (దాదాపు 18వేల అడుగులు) ఎత్తులో ఉంటుంది. శీతాకాలంలో రోడ్డు అంతా మంచుమయం అవుతుంది. ఇక్కడ వాతావారణం ఏ సమయంలో ఎలా ఉంటుందో అంచనా వేయలేం. రహదారి ఇరుకుగా ఉండి వాహనాలను నడిపేందుకు కష్టతరంగా ఉంటుంది. రోజు మొత్తం వాహనాలకు అనుమతి ఇవ్వరు. లేహ్ నుంచి ఖర్దుంగ్లాకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు.. అలాగే ఖర్దుంగ్లా నుంచి లేహ్‌కు వెళ్లేందుకు మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు అనుమతినిస్తారు.
దాని పేరే శవాల గుట్ట..
రోహ్తంగ్.. దానికి అర్థం శవాల గుట్ట. హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్న రహదారిపై చినుకు పడిందంటే చాలు ప్రయాణం నరకమే. శీతాకాలంలో చూడటానికి ఎంతో అందంగా ఉండే ఈ ప్రదేశం.. వాహనాలను నడిపేటప్పుడు మాత్రం భయంకరంగా ఉంటుంది. ఎటువైపు నుంచి కొండ చరియలు విరిగిపడతాయోనని ఆందోళన వెంటాడుతూనే ఉంటుంది. ఈ రహదారిపై ప్రయాణించేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే ప్రాణాలకే ప్రమాదం వచ్చే అవకాశం ఉంది.
సన్నని వంపుదీరిన రహదారి...
పర్వతాన్ని చెక్కినట్లు ఉంటుంది. ఆడవారి జడకు పెట్టుకునే పిన్ను వంపినట్లు ఉండే జాతీయ రహదారి NH22. ఇక్కడ జరిగిన పలు రోడ్డు ప్రమాదాల్లోనూ, లోయలోకి పడిపోవడంతో, బస్సు నదిలోకి దూసుకెళ్లడమో వంటి కారణాలతో చాలా మంది తమ ప్రాణాలను పొగొట్టుకున్నారు. అతివేగంతో బస్పా నదిలోకి వాహనాలు పడిపోయి చాలామంది మృత్యువాతకు గురయ్యారు. చూసేందుకు ఎంతో అందంగా ఉండే రహదారిలో ప్రయాణించడమంటే మాత్రం డ్రైవింగ్ నైపుణ్యానికి అగ్ని పరీక్షే అని చెప్పొచ్చు.
బైకర్స్‌కు ఆనందం..అయితే ప్రమాదకరం
చూసేందుకు ఎంతో అబ్బురంగా ఉండే స్పితీ వ్యాలీ.. అక్కడి రోడ్లు మాత్రం ప్రయాణించేందుకు క్లిష్టంగానే ఉంటాయి. అయితే స్పితీ వ్యాలీ సాహసాలు చేసే బైకర్స్‌కు నచ్చుతుంది. సట్లజ్ నదికి పక్కగా వెళ్లే ఈ రహదారిపై డ్రైవ్ చేస్తుంటే ఆ ఆనందమే వేరు. రోడ్డుకి ఇరువైపులా ఆప్రికాట్, ఆపిల్ తోటలు కనువిందు చేస్తాయి. అయితే వ్యాలీ పైకెళ్లేటప్పుడు జాగ్రత్తగా లేకపోతే జారిపడిపోయే ప్రమాదం ఉంది. తక్కువ వేగంతో మీ వాహనానికి వేరే వాహనానికి కనీసం దూరం పాటించాలి. లేకపోతే ప్రమాదవశాత్తూ రెండు వాహనాలు ఢీకొట్టుకుంటే మాత్రం ప్రాణనష్టం తప్పదు.
కడుపులో తిప్పేసినట్టే...
ఆ రోడ్డులో ప్రయాణించేటప్పుడు కడుపులో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటేనే మంచిది. జిగ్‌జాగ్‌గా ఉండే ఆ రహదారిలో ప్రయాణం రోలర్‌కోస్టర్ ఎక్కినట్టే. సిక్కింలోని సోంగో సరస్సుకు దగ్గరగా ఉండే నాథులా పాస్ రోడ్ పొడవు 54 కి.మీ. కొండచరియలు, పొగమంచు ఎక్కువగా కురుస్తుంటుంది. దీని వల్ల ఇక్కడ ప్రయాణం చేయాలనుకునే వారికి చాలా రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం. కొత్త వారికి మరింత ప్రమాదకరంగా ఉండే అవకాశం ఉంది. ఇలాంటి రహదారి మీద ప్రయాణించేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
జోజిలా
హిమాలయ పర్వతాల్లో అత్యంత ఎత్తైన పర్వత శ్రేణుల్లో రహదారి నిర్మాణం జరిగింది. సముద్ర మట్టానికి దాదాపు 3,538 మీటర్లు (11,600 అడుగులు) ఎత్తు ఉంటుంది. దాదాపు 9 కిమీ దూరం ఉండే రోడ్డుపై ప్రయాణించాలంటే వెన్నులో వణుకు పుట్టాల్సిందే. పదునుగా ఉండే రహదారిపై వాహనం నడపడమంటే చాలా జాగ్ర్తతలు పాటించాలి. మంచుగడ్డలు పడేటప్పుడు వాహనాలు అదుపు తప్పే ప్రమాదం ఉంది. అందుకే ఇలాంటి రహదారులపై డ్రైవింగ్ చేయాలంటే గుండెల్లో ధైర్యంతోపాటు క్షణంపాటు అలసత్వం వహించకూడదు.