
వార్తలు / కథనాలు
పారిస్ హోటల్ వినూత్న సేవలు
ఇంటర్నెట్ డెస్క్: కరోనా మహమ్మారి దెబ్బకు రెస్టారెంట్లు తీవ్రంగా నష్టపోయిన విషయం తెలిసిందే. గత ఆరు నెలలుగా రెస్టారెంట్లు తెరిచే వీలు లేక యజమానులు, ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇటీవల అన్ని దేశాలు అన్‌లాక్ నియమాలను అమలు చేస్తుండటంతో కరోనా నిబంధనలు పాటిస్తూ, పరిమిత కస్టమర్లతో రెస్టారెంట్లు తెరుచుకుంటున్నాయి. దీంతో కొందరు ఎప్పటిలాగే రెస్టారెంట్లను తెరిచి కస్టమర్ల కోసం ఎదురుచూస్తుండగా.. మరికొందరు కస్టమర్లను ఆకట్టుకోవడం కోసం.. వారి భద్రత కోసం రెస్టారెంట్లలో వినూత్న ప్రయోగాలు చేస్తున్నారు. పారిస్‌లోని ఓ హోటల్ కూడా తమ సేవలను భిన్నంగా అందిస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటోంది.
పారిస్‌లోని లెస్ బెయిన్స్ అనే హోటల్ 1980ల్లో నైట్ క్లబ్, బాత్ హౌస్‌గా ఉండేది. కొన్నాళ్లకు హోటల్‌గా మార్చారు. 2015లో దీంట్లోనే రోక్సో పేరుతో ఓ రెస్టారెంట్ ఏర్పాటు చేశారు. అయితే కరోనా కారణంగా అన్ని హోటల్స్‌లాగే ఇదీ మూతపడింది. గత నెలలో మళ్లీ తెరుచుకుంది. అయితే ఈ హోటల్లోని 39 గదులు, డైనింగ్ హాళ్లలోకి కస్టమర్లను అనుమతించట్లేదు. మరి కస్టమర్లు ఎలా భోజనం చేస్తారనుకుంటున్నారా? ఇందుకోసం హోటల్ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. హోటల్ ప్రాంగణంలోని స్విమ్మింగ్‌పూల్, వాటర్ రిజర్వాయర్‌ను డైనింగ్ రూమ్స్‌లా మార్చేశారు.
ఇప్పట్లో స్విమ్మింగ్‌పూల్‌ను ఉపయోగించే పరిస్థితులు లేకపోవడంతో దాంట్లోనే ఎనిమిది మంది కూర్చొని తినగలిగేలా డైనింగ్ టేబుల్ ఏర్పాటు చేశారు. ఈ హోటల్లో నిరుపయోగకరంగా ఉన్న వాటర్ రిజర్వాయర్‌లో కూడా డైనింగ్ టేబుల్ ఏర్పాటు చేసి సేవలందిస్తున్నారు. ఈ రెండు డైనింగ్ టేబుల్ ప్రాంతాల్ని రంగుల వెలుగులు విరజిమ్మే లైట్లు, షాండ్లియర్లతో అందంగా తీర్చిదిద్దారు. అయితే ఈ రెస్టారెంట్లో తినాలంటే ముందుగానే రిజర్వేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 17న ప్రారంభమైన ఈ రెస్టారెంట్ కేవలం గురు, శుక్ర, శనివారాల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. స్విమ్మింగ్‌పూల్, రిజర్వాయరే కాదు, హోటల్లో ఉన్న పెంట్‌హౌస్, నైట్‌క్లబ్, ప్రత్యేకంగా లిఫ్ట్, వ్యక్తిగత వంటమనిషి ఉన్న లగ్జరీ గదిని కస్టమర్ల కోసం కేటాయించారు. ముందే ఏ చోటు కావాలో రిజర్వేషన్ చేసుకుంటే.. నేరుగా అక్కడికే వెళ్లి తినొచ్చు.