
వార్తలు / కథనాలు
(ఫొటో: సూపర్ షీ ఫేస్బుక్)
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పర్యటక ఐలాండ్స్ ఉన్నాయి. చిన్నా, పెద్దా, ఆడ-మగ తేడా లేకుండా ఏటా లక్షల సంఖ్యలో సందర్శకులు వస్తుంటారు. ఎవరికైనా అక్కడి పర్యటక అధికారులు సాదరంగా స్వాగతం పలుకుతారు. కానీ ఫిన్లాండ్లోని ఓ ఐలాండ్‌లో మాత్రం కేవలం స్త్రీలకే అనుమతిస్తారు. మగవారికి అక్కడి ప్రవేశం నిషేధం. వింతగా ఉంది కదా..? మరి ఆ ఐలాండ్ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి..
ఫిన్లాండ్ తీరప్రాంతంలో 8.4 ఎకరాల్లో ఉన్న ఐలాండ్ పేరు ‘సూపర్ షీ’. అమెరికాకు చెందిన మహిళా పారిశ్రామికవేత్త క్రిస్టినా రోత్ ఈ ఐలాండ్‌కు యజమాని. మహిళల కోసం ఓ రిసార్టు ఏర్పాటు చేయాలని ఆమె భావించారు. దీంతో కొన్నాళ్ల కిందట ఈ ఐలాండ్‌లో ఓ రిసార్టు ఏర్పాటు చేసి కేవలం స్త్రీలకు మాత్రమే సేద తీరేందుకు అనుమతి ఇస్తున్నారు. ఇక్కడ అతిథుల కోసం ప్రత్యేక గదులు, స్పా, అడ్వెంచర్ యాక్టివిటీస్ ఉన్నాయి. అలాగే రకరకాల వంటలను నచ్చిన విధంగా వండి పెట్టడానికి ప్రత్యేకంగా వంట మనిషి కూడా ఉంది. కావాలంటే పర్యటకులే స్వయంగా వండుకునే సదుపాయం ఉంది. యోగ, ధ్యానం చేయించే క్లాసులు ఉంటాయి. ఐలాండ్ మొత్తం విహరిస్తూ.. ప్రశాంతంగా సేద తీరొచ్చు.
ఈ సూపర్ షీ ఐలాండ్‌కు మొదట్లో కేవలం క్రిస్టినా, ఆమె స్నేహితులు మాత్రమే వచ్చేవారు. ఆ తర్వాత దీనిని పర్యటక ప్రాంతంగా మార్చేశారు. బంధువులు, స్నేహితులు, ఉద్యోగులు ఎవరైనా సరే కనీసం పది మంది మహిళలు బృందంగా ఏర్పడి ఈ ఐలాండ్‌ను బుక్ చేసుకోవచ్చు. పురుషాధిక్య సమాజంలో స్త్రీలు మానసిక ఆనందాలకు నోచుకోవట్లేదని, విహారయాత్రలకు కుటుంబంతో వెళ్లినా, ఉద్యోగుల బృందంతో వెళ్లినా వారికి అంతగా స్వేచ్ఛ ఉండదని క్రిస్టినా అభిప్రాయం. అందుకే వారి కోసం ప్రత్యేకంగా ఈ ఐలాండ్ రిసార్టు ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. ఇక్కడ ప్రపంచానికి, కట్టుబాట్లకు, ముఖ్యంగా మగవారికి దూరంగా నచ్చినట్లుగా గడపొచ్చని, ఒకరినొకరు మనసు విప్పి మాట్లాడుకోవచ్చని చెబుతున్నారు.