
వార్తలు / కథనాలు
కార్గిల్ యుద్ధ క్షేత్రంలో ప్రాణాలకు తెగించి పోరాటం
శౌర్య చక్ర అందుకున్న తొలి మహిళా పైలట్
(చిత్రాలు: నెట్‌ఫ్లిక్స్ యూట్యూబ్ నుంచి)
శ్వాస తీసుకోవాలన్నా.. ఆహారం తినాలన్నా.. పనులు నిర్విఘ్నంగా పూర్తి చేయాలన్నా.. ఆఖరికి ప్రశాంతంగా నిద్రించాలన్నా కావాల్సింది ‘శక్తి’. అదే లేకుంటే మనిషి చచ్చినవాడితో సమానమే! మరి వేద వాజ్మయం ప్రకారం ‘శక్తి’ స్వరూపానికి చిహ్నం ‘స్త్రీ’ మూర్తి.
నిష్కర్షగా చెప్పాలంటే ‘స్త్రీ’ శక్తికి సాధ్యం కానిదేదీ లేదు! యుద్ధరంగంలో పురుషులకు దీటుగా కత్తిదూసిన వీర నారీమణులు ఎందరో ఉన్నారు. , రాణి రుద్రమదేవి, ఝాన్సీరాణి లక్ష్మీభాయి కదనరంగంలోకి దూకి శత్రుసంహారం చేశారు. ఇక భారత స్వాతంత్ర్య పోరాటంలో మేడమ్ బికాజీ కామా, రాణి గైడన్లు, దుర్గాభాయ్ దేశ్‌ముఖ్ వంటి వీర వనితలను ఎందరినో చూశాం.
కానీ అదేంటో! శక్తి స్వరూపమైన స్త్రీని ఆధునిక కాలంలో చిన్నచూపు చూడటం మొదలైంది. మగవారితో సమానమైన కండబలం, ఒత్తిడిని తట్టుకొనే మనోబలం లేదని యుద్ధరంగంలోకి అడుగు పెట్టనీయలేదు. త్రివిధ దళాల్లో చేరేందుకు అవకాశమే ఇవ్వలేదు. ‘ఆమె’ ఏం చేయలేదనే అపోహలోనే ఉండిపోయాం.
అలాంటి కట్టుబాట్లను కట్టిపెట్టి.. గట్టి లక్ష్యం తలపెట్టి.. చావు భయాన్ని ఎదురించి.. మొక్కవోని దీక్షతో కార్గిల్ యుద్ధభూమిలో స్వేచ్ఛా విహంగమై ఎగిరిందామె. పాకిస్థాన్ విసిరిన బాంబులకు బెదరకుండా అసమాన ధైర్య సాహసాలను ప్రదర్శించి భారత వాయుసేన తరఫున యుద్ధక్షేత్రంలో అడుగు పెట్టిన తొలి మహిళగా చరిత్ర సృష్టించింది. ‘శౌర్య చక్ర’ పురస్కారం పొంది ‘ది కార్గిల్ గర్ల్’గా పేరుతెచ్చుకున్న ఆ ‘స్త్రీ శక్తి’ మరెవ్వరో కాదు ‘గుంజన్ సక్సేనా’.
సర్వత్రా ఆసక్తి
దివంగత నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గుంజన్ సక్సేనా- ది కార్గిల్ గర్ల్’. ఈ సినిమా ట్రైలర్ విడుదలవ్వగానే అందరిలోనూ ఒకటే ఆసక్తి. ఎవరీ గుంజన్ సక్సేనా? దేశం కోసం ఆమె ఏం చేసింది? భారత వాయుసేనలో ఎందుకు చేరింది? ఎలాంటి కష్టాలు అనుభవించింది? కార్గిల్ యుద్ధక్షేత్రంలోకి ఎందుకు అడుగు పెట్టింది? చావు భయాన్ని ఎదురించి ఆమె సైనికులను ఎలా రక్షించింది? శౌర్యచక్ర పురస్కారం అందుకున్న ఆమె ఇప్పుడేం చేస్తోందో తెలుసుకోవాలని చాలామంది ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానమే ఈ కథనం!
బాల్యంలో కలగంది
గుంజన్ సక్సేనా ప్రస్తుత వయసు 44 ఏళ్లు. 1975లో సైనిక అధికారుల కుటుంబంలో ఆమె జన్మించింది. ఆమె తండ్రి, సోదరుడు భారత సైన్యంలో సేవలందించారు. చిన్నప్పుడు గుంజన్‌కు తన తండ్రి విమానాలను చూపించేవారు. జన్మనిచ్చిన దేశానికి సేవ చేయాలని చెప్పేవారు. ఆమెకు ఐదేళ్లప్పుడు కజిన్ ఒకరు కాక్‌పిట్ చూపించారు. అప్పుడే ఆమె విమానం నడపాలని పైలట్ కావాలని నిర్ణయించుకున్నారు. అదే కలను కన్నారు. దిల్లీలోని హన్స్‌రాజ్ కళాశాలలో డిగ్రీ చదువుతూనే సఫ్దర్‌జంగ్ ఫ్లైయింగ్ క్లబ్లో చేరారు. లోహ విహంగాలు ఎలా నడపాలో ప్రాథమిక అంశాలు నేర్చుకున్నారు. ఉద్యోగ ప్రయత్నం చేస్తూ 1994లో భారత వైమానిక సేనలో చేరారు. ఐఏఎఫ్ పైలట్‌నే పెళ్లి చేసుకున్నారు. 2004లో ఆమె కుమార్తె ప్రజ్ఞకు జన్మనిచ్చారు. ఏడేళ్ల సర్వీస్ పూర్తికావడంతో అదే ఏడాది జులైలో పదవీ విరమణ చేశారు.
మొదట్లో ఇబ్బందులు
1994లో వాయుసేన మొదటి మహిళల బృందాన్ని ఎంపిక చేసింది. గుంజన్‌తో సహా మొత్తం 25 మంది బ్యాచ్. శిక్షణ పూర్తవ్వగానే జమ్ముకశ్మీర్‌లోని ఉదంపూర్‌లో గుంజన్‌తో పాటు మరికొందరికి ఉద్యోగ బాధ్యతలు అప్పజెప్పారు. మహిళా సిబ్బందిని తీసుకోవడం అదే తొలిసారి కావడంతో మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎందుకంటే వారికి అక్కడ వసతులు లేవు. ప్రత్యేక స్నానపు గదులు, దుస్తులు మార్చుకొనేందుకు వేర్వేరు గదులు ఉండేవి కావు. ఇవన్నీ సమకూరడానికి కొంత సమయం పడుతుంది కదా. అంతవరకు ఇతర మహిళా పైలట్లే రక్షణ గోడగా నిల్చొగా దుస్తులు మార్చుకొనేవారు. త్వరలోనే ప్రత్యేక మౌలిక వసతులు ఏర్పాటు కావడంతో ఈ బాధలు తప్పాయి. ఇక పురుష సహచరులకు మొదట్లో వారితో కలిసి పనిచేయడం కాస్త భిన్నంగా, ఇబ్బందిగా తోచేది. అయితే ఊహించని దానికన్నా త్వరగానే వారిలో మార్పు కనిపించిందని గుంజన్ అన్నారు.
కార్గిల్ యద్ధానికి పిలుపు
మాతృభూమి కోసం ప్రాణాలను సైతం తృణప్రాయంగా భావించే సందర్భాలు సైనికులకు నిత్యం అనుభవమే. అలాంటి అవకాశం గుంజన్ సక్సేనాకు 1999లో లభించింది. పాకిస్థాన్‌తో కార్గిల్ యుద్ధం తలెత్తింది. భారత సైన్యం ఆపరేషన్ విజయ్, ఆపరేషన్ సఫేద్ చేపట్టాయి. ఇందులో విజయం అందుకోవాలంటే వాయుసేన సాయం అవసరం. అప్పటికే వాయుసేనలోని పురుషు పైలట్లు యుద్ధంలో పోరాడుతున్నా మరింత మంది అవసరం ఏర్పడింది. అప్పుడే లెఫ్టినెంట్ శ్రీవిద్య రాజన్‌తో పాటు ఫ్లైట్ లెఫ్టినెంట్ గుంజన్ సక్సేనాకు పిలుపొచ్చింది. సముద్ర మట్టానికి అత్యంత ఎత్తులో, హిమాలయ పర్వత సానువుల్లో ప్రాణాలు లెక్కచేయకుండా పోరాడుతూ గాయపడ్డ వారిని సైనిక శిబిరాలకు చేర్చే బాధ్యతను వారికి అప్పగించారు. సరైన సమయంలో వారికి వైద్యసేవలు అందేలా హెలికాప్టర్లలో తరలించాలి. యుద్ధక్షేత్రంలోని వారికి నిత్యావసరాలు, యుద్ధ సామగ్రి తరలించాలి. పాక్ సైనికులు ఎక్కడ మాటువేశారో గుర్తించి చెప్పాలి.
ప్రాణాలకు తెగించి
తనకు అప్పజెప్పిన బాధ్యతలను గుంజన్ సక్సేనా ప్రాణాలకు తెగించి నిర్వర్తించింది. ఆమెకు చీతా హెలికాప్టర్ కేటాయించారు. ప్రతిదాడి చేసేలా దానికి ఆయుధాలు ఉండవు. బుల్లి హెలికాప్టర్ అది. ఒక సందర్భంలో గాయపడ్డ సైనికులను తీసుకొచ్చేందుకు వస్తుండగా పాక్ దళాలు రాకెట్ లాంఛర్లు ప్రయోగించాయి. వరుసగా వస్తున్న బాంబులను ఆమె అత్యంత రిస్క్ చేసి తప్పించుకుంది. కొండపై హెలికాప్టర్‌ను ల్యాండ్ చేసి గాయపడ్డ సైనికులను మళ్లీ సైనిక శిబిరానికి చేర్చింది. ఆమె తెగువకు అందరూ ఆశ్చర్యపోయారు. ‘గాయపడ్డ సైనికులను తీసుకురావడం యుద్ధంలో పాల్గొనేందుకు నాకెంతో ప్రేరణ కల్పించింది. వారి ప్రాణాలను కాపాడటమే ఒక హెలికాప్టర్ ఫైలట్‌కు అత్యంత సంతృప్తి ఇచ్చే అంశం’ అని గుంజన్ అన్నారు. ఆమె చూపిన ధైర్య సాహసాలకు ప్రభుత్వం ‘శౌర్య చక్ర’తో గౌరవించింది. ఈ పురస్కారం అందుకున్న మొదటి మహిళా పైలట్ ఆమే కావడం ప్రత్యేకం. స్వల్పకాల సేవల కమిషన్ కారణంగా ఏడేళ్లకే 2004, జులైలో ఆమె తన బాధ్యతలకు వీడ్కోలు పలకాల్సి వచ్చింది. ఆమె జీవిత చరిత్ర మొదట ‘ది కార్గిల్ గర్ల్’ అనే పుసక్త రూపంలో వచ్చింది. ఇప్పుడు సినిమాగా వస్తోంది.
- ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం