close

వార్తలు / కథనాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
నిద్ర లేపేందుకు ప్రత్యేక ఉద్యోగం

ప్రజలు పగలంతా కష్టపడి రాత్రి నిద్ర పోతారు. మళ్లీ పొద్దునే ఎవరి పనులకు వారు వెళ్లాలి కాబట్టి ఉదయాన్నే నిద్ర లేచేలా అలారం పెట్టుకుంటారు. కొంతమందికి అలారంతో పనిలేకుండా నిద్ర లేచే అలవాటు ఉన్నా.. చాలా మంది అలారం మోగితేగాని నిద్ర లేవలేరు. ఇప్పుడంటే అందరికీ గడియారాలు, మొబైల్‌ అలారాలు అందుబాటులో ఉన్నాయి. కానీ, అలారం అందుబాటులో లేని రోజుల్లో బ్రిటన్‌ ప్రజలు ఉదయాన్నే తమని లేపడం కోసం ప్రత్యేకంగా ఉద్యోగులను నియమించుకునేవారట. ఆ ఉద్యోగం విశేషాలు మీరే చదవండి.

18వ శతాబ్దం ద్వితీయార్ధంలో యూరప్‌, అమెరికాలో పారిశ్రామిక విప్లవం మొదలైంది. ఫ్యాక్టరీ, కంపెనీలకు కార్మికుల అవసరం పెరిగింది. అందుకు తగ్గట్టే కార్మికులను, ఉద్యోగులను నియమించుకొని పనులు చేయించుకోవడం ప్రారంభించాయి. దీంతో అక్కడి ప్రజలు సమయానికి కార్యాలయం చేరుకోవడం కోసం ఉదయాన్నే లేవాల్సి వచ్చేది. ఆ కాలంలో అలారం గడియారాలు ఉన్నా.. సామాన్య ప్రజలు కొనుక్కునే పరిస్థితులు ఉండేవి కావు. దీంతో పారిశ్రామీకరణ పుణ్యమా అని ప్రజలను నిద్ర లేపే కొత్త ఉద్యోగం పుట్టుకొచ్చింది. అదే.. ‘నాకర్‌-అప్పర్స్‌’. పగలంతా శారీకంగా ఎంతో శ్రమపడి రాత్రుళ్లు ఆదమరిచి నిద్రపోయే ప్రజలను లేపడమే వీరి పని.

నాకర్‌-అప్పర్స్‌ను ప్రజలు వ్యక్తిగతంగా లేదా సంస్థల యజమానులు వారి ఉద్యోగుల కోసం నియమించుకునేవారు. దీంతో వీరు తెల్లవారుజామున ప్రజల ఇంటి వద్ద నిలబడి వెదురు కర్రతో తలుపులు, కిటికీలను బాదడం గానీ, కిటికీలపై బఠానీలు విసరడం గానీ చేసేవారు. ఆ శబ్దాలకు పడుకున్న వాళ్లు లేచేవారు. ఒక వేళ లేవకపోతే లేచేవరకు నాకర్‌-అప్పర్స్‌ తలుపులు, కిటికీలను బాదుతూనే ఉండేవారు. ఇలా నిద్ర లేపుతున్నందుకు గాను వీరు ప్రజలు లేదా కంపెనీల నుంచి రెండు వారాలకొకసారి ఫీజు తీసుకునేవారు. డబ్బులు ఇవ్వకపోతే నిద్రలేపేవారు కాదు. ఇలాంటి ఉద్యోగం 1940 వరకు యూరప్‌లో ఉండేది. ఎప్పుడైతే అలారం గడియారాలు ప్రజలకు అందుబాటు ధరలో లభించడం మొదలైందో అప్పటి నుంచి ఈ ఉద్యోగులు సంఖ్య తగ్గిపోవడం ప్రారంభమైంది. 1950 నాటికి నాకర్‌-అప్పర్స్‌ అనే ఉద్యోగం పూర్తిగా కనుమరుగైంది. అయితే 1970 వరకు ఇంగ్లాండ్‌లోని కొన్ని పారిశ్రామికవాడల్లో ఈ ఉద్యోగులు ఉండేవారని చరిత్రకారులు చెబుతున్నారు.

- ఇంటర్నెట్‌ డెస్క్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు